వేర్పాటువాద ధోరణితో వెళ్తే నాలో తీవ్రవాదిని చూస్తారు: పవన్‌ సంచలన వ్యాఖ్యలు!

Update: 2023-01-26 14:06 GMT
జనసేనాని పవన్‌ కల్యాణ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వారాహి వాహనానికి జనవరి 25న ఆయన విజయవాడ దుర్గమ్మ  ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ అంశంపై చర్చాగోష్టి నిర్వహించారు. రిపబ్లిక్‌ డే వేడుకలను పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో పవన్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీది దేశీయ దొరతనమని పవన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిటీష్‌ వాళ్లు వెళ్లిపోయివా దేశంలో ఇంకా దొరతనం పోలేదన్నారు. దేశం ఏ ఒక్క కులమో.. సజ్జలో.. వైసీపీ సొంతమో కాదని హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఇది ప్రజాస్వామ్యం.. కులస్వామ్యం కాదన్నారు. తమ పబ్బం గడుపుకునే ఐడియాలజీతో తాను మాట్లాడన్నారు. రెండు తరాలకు మేలు జరిగే ఐడీయాలజీ గురించే తాను మాట్లాడతాను అని తెలిపారు.

ఓ రోజు లెఫ్ట్‌.. మరోసారి బీజేపీతో ఉంటానని తనను విమర్శిస్తున్నారన్నారు. అయితే రెండింటికీ మధ్యస్థమైన ఐడీయాలజీతో తాను ఉన్నానన్నారు. తాను మానవతావాదినని.. మధ్య దారిలో ఉన్న తాను ప్రజల అవసరాల కోసం మారుతూ ఉంటానని స్పష్టం చేశారు.

కులాల మధ్య ఐక్యత సాధించే వాడే నాయకుడని పవన్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఓ చేయి సొంత కులం వైపు.. మరో చేయి వేరే కులాల వైపు ఉండాలని.. లేకుంటే మిగిలిన కులాలకు దూరమవుతారని వ్యాఖ్యానించారు.

ఏపీకి చెందిన నేతలు వేర్పాటువాద ధోరణితో మాట్లాడితే తనలాంటి తీవ్రవాదిని ఇంకోసారి చూడరని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రాలు కావాలంటూ ఇటీవల కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఈ సందర్భంగా పవన్‌ మండిపడ్డారు.

రిపబ్లిక్‌ డే రోజున చెప్తున్నానని ఏపీకి చెందిన నేతలు వేర్పాటువాద ధోరణితో మాట్లాడితే నాలాంటి తీవ్రవాదిని ఇంకోసారి చూడరని హెచ్చరికలు జారీ చేశారు. వేర్పాటువాద ధోరణితో విసిగిపోయామని.. మీ బతుకులకేం తెలుసు? అని ఆయా పార్టీల నేతలను ప్రశ్నించారు. రాజ్యాంగ సభ చర్చలు చదివారా? అని నిలదీశారు. అవినీతిలో మునిగిపోయి పబ్లిక్‌ పాలసీ తెలియని నేతలు రాష్ట్రాన్ని విడగొట్టేస్తారా? అని ధ్వజమెత్తారు. ఇందుకు తాము చూస్తూ కూర్చొంటామా? అని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు.

తాము దేశ భక్తులమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ఇంకోసారి విడగొడతామంటే తోలు తీసి కింద కూర్చోబెడతామని హెచ్చరించారు. ఏం తమాషాగా ఉందా? అని నిలదీశారు.

రాయలసీమ నుంచి ఎంతమంది సీఎంలు వచ్చినా ఆ ప్రాంతానికేం చేశారు? అని నిలదీశారు. అక్కడ నుంచి వలసలు ఎందుకు ఆపలేకపోయారు? అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలా? అని మండిపడ్డారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కోసం తెలంగాణకు చెందిన జగిత్యాలలో సాయిరెడ్డి చనిపోయారని గుర్తు చేశారు. గుంటూరులో హబీబుల్లా మస్తాన్‌ మరణించాడన్నారు. ఆ సంగతి మీకు తెలుసా? అని ఆయా పార్టీల నేతలకు చురకలు అంటించారు. మీ స్వార్థం కోసం ఇష్టారాజ్యంగా స్టేట్‌మెంట్లు ఇవ్వవద్దని కోరారు. రాష్ట్రాన్ని, ప్రజల్ని ఇప్పటిదాకా విడగొట్టింది చాలని ఇక ఆపేయాలని కోరారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News