రాజ్యం వీర భోజ్యం : పవన్ తెలుసుకోవాల్సింది ఇదే...?

Update: 2022-06-06 11:49 GMT
రాజ్యం ఎపుడూ వీరున్నే వరిస్తుంది. సాహసి వెంటే సామ్రాజ్యం కదలివస్తుంది. ఎండలను కొండలను దాటుకుని ఆకాశమే హద్దుగా చెలరేగిపోయేవారినే విజయలక్ష్మి వరమాల వేసి తన వారిగా చేసుకుంటుంది. పురాణాలు చూసినా చరిత్ర గురించి చెప్పుకున్నా ఆధునిక  ప్రపంచ చరిత్ర చూసినా ఇదే సత్యం. ఇదే నిజం. విజయానికి షార్ట్ కట్స్ ఉండవు.

పవన్ కళ్యాణ్ మాత్రం దగ్గర దారినే ఎనిమిదేళ్ళుగా వెతుక్కుంటున్నారు. ఎవరో తన పల్లకీ మోయాలని తాజాగా ఆయన ప్రకటించడం అందులో భాగమే కాదు ఆయనలోని అమాయకత్వాన్ని అత్యాశను కూడా తెలియచేస్తోంది. ఇక తాను ఒకటి  రెండు సార్లు తగ్గానూ అని పవన్ చెప్పుకుంటే అది ఆయన మంచితనాన్ని సూచిస్తుంది తప్ప మరోటి కాదు. ఇక రాజకీయాల్లో త్యాగాలు  ఎపుడూ ఉండవు,  వర్కౌట్ కూడా కావు.

అవకాశాల కోసం స్వార్ధాలను ఒంటినిండా నింపుకుని సాగిపోయే వారే అక్కడ అధికార పీఠాలను అధిరోహిస్తారు. నాడు మా భుజం ఇచ్చి మిమ్మల్ని గద్దె మీద కూర్చోబెట్టాను కాబట్టి ఈ రోజు మీరు పరిహారంగా నన్ను కూర్చోబెట్టండి అని అడగడానికి ఇది ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం కాదు, ఒప్పందం అంతకంటే కాదు.

ఇక రాజకీయాల్లో పదవులు పార్టీలు ఇవ్వవు, వాటి అధినాయకులు కూడా ఇవ్వరు. 2014 నాటికి చంద్రబాబుని పవన్ సపోర్ట్ చేశారు. ఆయన అధికారంలోకి వచ్చారు. ఒకవేళ పవన్ చేయకపోయినా అప్పటికే అలాంటి వాతావరణం ఉంది కాబట్టి ఎక్కువో తక్కుఓ సీట్లతో నాడు బాబు గెలిచే సీన్ అయితే  ఉందని ఆ తరువాత ఎన్నో విశ్లేషణలు వచ్చాయి.

అందువల్ల అది తన అకౌంట్ లో వేసుకోవడం ద్వారా పవన్ ఇంకా భ్రమలలో ఉన్నారనే అనుకోవాలి. ఇక 2019 ఎన్నికల్లో పవన్ తగ్గానూ అని అంటున్నారు. ఆయన వేరేగా పోటీ చేసి సర్కార్ వ్యతిరేక ఓట్లు చీల్చడం అనే వ్యూహంలో బాబుని గెలిపించాలని చూస్తే తగ్గడమే అనుకోవాలి. కానీ అలా చూసుకున్నా అది బాబు మార్క్ చాణక్య వ్యూహంగా చూడాలి తప్ప పవన్ కి ఇక్కడ క్రెడిట్ ఎలా వస్తుందో కూడా ఆలోచించాలి.

ఇక పవన్ సొంతంగా 2019 ఎన్నికల్లో  పోటీ చేసి ఓట్లు చీల్చినవి టీడీపీవే తప్ప వైసీపీవి కావు అన్నది కూడా గుర్తెగాలి. మరో వైపు చూస్తే ముఖ్యమంత్రి పదవి చెరిసగం తీసుకోవాలన్నది జనసేన  మనోగతం అయితే పవన్ కూడా అంతే పంతంగా ఉంటే ఈసారి తొడగొట్టి ఆయన రాజకీయ బరిలో సొంతంగా పోటీ చేయాలి. అపుడు ఆయనకు కనీసం పాతిక ముప్పై సీట్లు వచ్చినా ఏపీలో హంగ్ ఏర్పడితే మాత్రం కచ్చితంగా సీఎం అయ్యే చాన్స్ వస్తుంది.

అదే టైమ్ లో జనసేన సత్తా కూడా చాటుకున్నట్లు అవుతుంది. అందువల్ల పవన్ ఇపుడు తక్షణం చేయాల్సిన  పని సొంతంగా పోటీకి సిద్ధం కావడం. బీజేపీతో వెళ్తే మాత్రం కేంద్రం మీద ఉన్న వ్యతిరేకతతో పాటు ఏపీకి బీజేపీ చేసిన అన్యాయం కూడా పవన్ ఖాతాలో పడి ఇంకా ఇబ్బందులు వస్తాయి. తాను ఒంటరిని, ఒక్కడిని, జనాలు తనను సీఎం చేయాలని, ఇదే తన ఎన్నికల ప్రణాళిక అని చెప్పుకుని ఈ రోజు నుంచే జనంలోకి పవన్ వస్తే జనసేన మీద జనాలు తీర్పు కచ్చితంగా ఇస్తారు. ఒక విధంగా పవన్ రాజకీయాలకు ఇది కీలక సమయం. మరో విధంగా చూస్తే  2024 ఎన్నికలు ఆయన రాజకీయ మనుగడకు కూడా అత్యంత కీలకం.
Tags:    

Similar News