బ్రేకింగ్ : మావోయిస్టుల చెరనుంచి జవాన్ రాకేశ్వర్ సింగ్ విడుదల

Update: 2021-04-08 11:34 GMT
గత ఐదు రోజులుగా మావోయిస్టుల చెరలో ఉన్న కోబ్రా కమాండో రాకేశ్వర్‌ సింగ్‌ మావోయిస్టులు విడుదల చేశారని కొన్ని ప్రసారమాధ్యమాల్లో ఓ వార్త ముఖ్యవార్తగా ప్రసారం అవుతుంది. కోబ్రా కమాండో రాకేశ్వర్‌ సింగ్‌ విడుదల కోసం అధికారులు ఆపరేషన్ కుకూన్ చేపట్టిన సంగతి తెలిసిందే. జవాన్ విడుదల బాధ్యత రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కె. విజయ్ కుమార్‌ కు అప్పగించారు. ఎన్ ‌కౌంటర్ స్పెషలిస్ట్ ‌గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్.. ఇప్పటికే మావోయిస్టుల దాడి పై పూర్తి సమాచారాన్ని తెప్పించుకున్నారని అడవుల్లో జరిగిన దాడికి సంబంధించి కేంద్ర బలగాలతో సమీక్ష జరిపారని తెలుస్తుంది.గత కొన్ని రోజులుగా మావోయిస్టుల చెరలోనే ఉన్న రాకేశ్వర్‌ ను విడుదల చేశారని, కొద్ది సేపటిలో బెటాలియన్ వద్దకు రాకేష్ చేరుకోనున్నట్టు ఫస్ట్ రిపోర్ట్స్ అందుతున్నాయి. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.  

ఇదిలా ఉంటే ..  ఛత్తీస్‌గడ్‌లోని బీజపూర్ జిల్లా తర్రెమ్ అటవీప్రాంతంలోని జొన్నగూడ దగ్గర భారీ ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 24 మంది జవాన్లు మృతి చెందారు. అంతేకాకుండా 31 మంది జవాన్లు గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ దాడి తరువాత రాకేశ్వర్ సింగ్ ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. చర్చలకు ప్రభుత్వం వస్తేనే రాకేష్ సింగ్ ను విడుదల చేస్తామంటూ పలు షరతులు పెట్టారు.  మొదట ఆయన ఆచూకీపై ఆందోళన నెలకొనగా... అతను సురక్షితంగానే ఉన్నట్లు మావోయిస్టులు ఫోటోలు విడుదల చేశారు. ఆయన వదిలిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే సంకేతమిచ్చిన మావోలు... కొద్దిసేపటి క్రితం ఆయన్ను విడుదల చేశారని వార్తలు వెలువడుతున్నాయి.
Tags:    

Similar News