ఏపీ కొత్త పరిశ్రమలకు 'అమ్మగండం'

Update: 2016-09-05 04:51 GMT
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎక్కువ నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నిలదొక్కుకునేలా ఏం చేయాలి? ఎలా చేయాలి? అనే కసరత్తు కేంద్రం తీవ్రతరం చేసిందని వార్తల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రజల్లో కూడా కేంద్రం నుంచి అన్యాయం జరుగుతున్నదనే అభిప్రాయం బలపడుతుండడంతో.. రాజకీయ నష్టం వాటిల్లకుండా ఉండేందుకు కేంద్రంలోని భాజపాలో కొంత కదలిక వచ్చిందని చెప్పాలి. అంతో ఇంతో ఆంధ్రప్రదేశ్‌ కు ఏదో ఒకటి ప్రకటించడానికి కసరత్తు చేస్తున్నారు.

అయితే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ కు రాయితీలు ఇవ్వడానికి లేదా రాయితీల వంటి ఇతర వెసులుబాట్లు కల్పించడానికి కేంద్రం ఇతర రాష్ట్రాల అభ్యంతరాలను కూడా తెలుసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వాస్తవాలు ఎలా ఉన్నాయంటే.. ప్యాకేజీల రూపంలో ఆంధ్రప్రదేశ్‌ కు కేంద్రం ఎంత ధనసహాయం చేసినా సరే.. అదంతా రాజధాని నిర్మాణం లేదా ఇతర ఓటుబ్యాంకు పథకాల ఊబిలో పడి అదృశ్యం అయిపోతుంది. అలా కాకుండా.. ప్రత్యేకహోదా అంటూ.. పరిశ్రమలకు పన్ను రాయితీలు నేరుగా కల్పించే ఏర్పాటు ఏదో ఒకటి వస్తేనే.. ఖచ్చితంగా రాష్ట్రానికి పరిశ్రమలు తరలి వస్తాయి. అందుకే రాష్ట్రంలో రాజకీయ వాదులందరూ హోదా కోసం పట్టు పడుతున్నారు.

ఈనేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ కు అసలు పారిశ్రామిక రాయితీలే ఇవ్వడానికి వీల్లేదంటూ .. పొరుగు రాష్ట్రం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేంద్రానికి లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. ఆమె లేఖ రాసినట్లు గా వెంకయ్యనాయుడు కూడా వెల్లడించారు. ఏపీకి రాయితీల గురించి జైట్లీ మాట్లాడినప్పుడు ప్యాకేజీ ఎంత ఇచ్చిన పర్లేదు గానీ.. పారిశ్రామిక రాయితీలు మాత్రం ఇవ్వడానికి వీల్లేదని జయలలిత అన్నట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి. చూడబోతే.. ఏపీకి పారిశ్రామిక రాయితీలు రాకుండా పురట్చితలైవి జయలలిత నేరుగా అడ్డం పడుతున్నట్లు తెలుస్తోంది. చూడబోతే ఏపీ పరిశ్రమలకు అమ్మగండం ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News