ఏడాది ముందే ఎన్నికలకు అమ్మ రెఢీ

Update: 2015-07-27 12:10 GMT
తమిళనాడు రాజకీయాలు కాస్తంత చిత్రమైనవి. అధికారం చేతికి వచ్చిన తర్వాత ఐదేళ్ల వరకూ అధికారపక్షానికి తిరుగు ఉండదు. నెత్తిన పెట్టుకున్నట్లుగా ప్రజలు చూస్తుంటారు. మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి సీన్ అంత మారిపోవటమే కాదు.. అధికారపక్షం విపక్షంగా.. విపక్షం అధికారపక్షంగా మారటం మామూలే. ఇలాంటి మినహాయింపులు చాలా తక్కువసార్లు మాత్రమే చోటు చేసుకున్నాయి.

2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాటి విపక్షం అధికారపక్షంగా అవతరించటం.. అమ్మగా పేరొందిన జయలలిత ముఖ్యమంత్రి కావటం జరిగిపోయాయి. షెడ్యూల్ ప్రకారం చూస్తే.. 2016 వరకు ఎన్నికల రాని పరిస్థితి. అయితే.. నమ్మకాలకు పెద్ద పీట వేసే అమ్మ.. తనకు ఏ మాత్రం సూట్ కాని సరి సంఖ్యలో (2016)ఉన్న ఏడాదిలో ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఉందా? అంటే లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. అమ్మకు అనుకూలంగా భావించే బేసి సంఖ్య సంవత్సరంలోనే ఎన్నికలకు వెళితే శుభం కలుగుతుందన్న భావన చూసినప్పుడు 2015 పూర్తయ్యేనాటికి ఎన్నికలు పూర్తి చేస్తారన్న మాట వినిపిస్తోంది.

దీనికి తోడు అమ్మ అనారోగ్యం.. రాష్ట్రంలో ప్రభుత్వానికి తిరుగులేని విధంగా ప్రజాదరణ ఉండటం.. తాజాగా జరిగిన ఉప ఎన్నికలో అమ్మ అద్భుతమైన మెజార్టీతో గెలుపొందటం లాంటివి చోటు చేసుకున్నాయి.  దీనికి తోడు గడిచిన నాలుగేళ్లలో అమ్మ బ్రాండ్ తో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు విపరీతమైన ప్రజాదరణ పొందటంతో పాటు.. అమ్మను ఎక్కడో ఉండేలా చేశాయి.

ఇలాంటి పరిస్థితుల్లో షెడ్యూల్ ప్రకారం 2016 మేలో జరగాల్సిన ఎన్నికల వరకు వెయిట్ చేసే కన్నా.. ముందస్తు ఎన్నికలకు వెళితే.. అధికారాన్ని వరుసగా చేజిక్కించుకున్న రికార్డు సొంతం చేసుకున్నట్లు అవుతుందన్న భావన అధికారపక్షంలో ఉన్నట్లు చెబుతున్నారు. ఎన్నికలు జరిగి నాలుగేళ్లు అవుతున్నా.. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న డీఎంకే ఇప్పటికి బలపడకపోవటం.. అంతర్గత సమస్యలతో తల్లడిల్లుతున్న సమయంలోనే ఎన్నికలు నిర్వహిస్తే.. అధికారం హస్తగతమవుతుందని జయలలిత భావిస్తున్నట్లు చెబుతున్నారు.

దీనికి తగ్గట్లే జూన్ నాటికే ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లకు సంబంధించిన పనులు వేగంగా పూర్తి చేయటం చూస్తుంటే.. ఈ ఏడాది చివరకు ముందస్తు ఎన్నికలకు వెళ్లేలా జయమ్మ ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. దీనికి తోడు అధికారపక్ష నేతలు సైతం.. అప్పుడప్పుడు ముందస్తు సంకేతాలు ఇవ్వటం చూస్తుంటే.. అమ్మ ముందస్తుకే మొగ్గు చూపుతుందన్న భావన వ్యక్తమవుతోంది. 2004లో ఇలానే ముందస్తుకు మొగ్గు చూపి.. మునిగిపోయిన చంద్రబాబు అనుభవం జయమ్మకు ఎదురవుతుందో.. లేక.. తనదైన శైలిలో తిరుగులేని విజయాన్ని మరోమారు చేజిక్కించుకుంటారో చూడాలి.


Tags:    

Similar News