వస్తున్నట్లు చెబితే కుర్చీ సిద్ధం చేసేవారట

Update: 2016-05-25 04:29 GMT
పదవి బాధ్యతను పెంచుతుందంటారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత విషయంలో ఇదేదో షురూ అయినట్లుగా కనిపిస్తోంది. తనకు నచ్చినట్లుగా వ్యవహరించి.. ఎవరు ఏమనుకున్నా డోన్ట్ కేర్ అన్నట్లు వ్యవహరించే అమ్మ తన తీరును మార్చుకుంటుందా? అన్న సందేహం కలిగేలా వ్యవహరించారు. రాజకీయ ప్రత్యర్థుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుందన్న పేరున్న జయలలిత అందుకు భిన్నంగా వ్యవహరించటం విశేషం.

ఒక అపూర్వ ఘటనలో తన వైఖరిని వేలెత్తి చూపించేలా జరిగిన ఓ ఉదంతంపై ఆమె వివరణ ఇచ్చారు. మూ​డు​ దశాబ్దాల తర్వాత వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశాన్ని సొంతం చేసుకున్న జయలలిత ప్రమాణస్వీకారోత్సవానికి డీఎంకే అధినేత కరుణానిధి కుమారుడు స్టాలిన్ హాజరు కావటం తెలిసిందే. తమిళ రాజకీయాల్లో స్టాలిన్ స్థాయి ఏమిటన్నది అందరికి సుపరిచితమే. డీఎంకే అధినేతగా కరుణ ఉన్నా.. ఆయన తర్వాతి వారసుడు.. మొత్తం చక్రం తిప్పేది స్టాలినే. అలాంటి నేతకు రెండో వరుసలో కుర్చీ కేటాయించటంపై కరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జయలలిత తన తీరు మార్చుకోరని.. ఆమె మారరంటూ విరుచుకుపడ్డారు.

తన ప్రమాణస్వీకార మహోత్సవానికి రాజకీయ ప్రత్యర్థి స్టాలిన్ హాజరైతే.. రెండో వరుసలో కూర్చోబెట్టి అవమానించారన్న అంశంపై ప్రజల్లో బాగా పోవటం.. జయలలిత తీరుపై విమర్శలు షురూ కావటంతో ఆమె ఇరుకున పడిన పరిస్థితి. మామూలుగా అయితే.. ఇలాంటి వాటిని లైట్ తీసుకొని.. అసలేం జరగనట్లుగా వ్యవహరిస్తుంటారు. వరుసగా రెండో సారి సీఎం అయిన సంతోషమో.. ప్రజలు తన మీద పెట్టుకున్న ఆశలకు భిన్నంగా తాను వ్యవహరించాలని అనుకోవటం లేదన్న మాటను చెప్పాలనుకున్నారో లేక.. అనుకోకుండా జరిగిన పొరపాటుపై నిజంగా ఫీలయ్యారేమో కానీ జయలలిత స్పందించారు.

కరుణ చేసిన విమర్శపై వివరణ ఇచ్చారు. స్టాలిన్ వస్తారని తాము అనుకోలేదని.. ఆయన వస్తున్నట్లు ముందస్తు సమాచారం లేదన్నారు. ఒకవేళ ఆయన వస్తున్నట్లు తమకు ముందుగా తెలిసి ఉంటే.. ప్రోటోకాల్ పక్కన పెట్టి మరీ ముందు వరుసలో కుర్చీ ఏర్పాటు చేసేవాళ్లమని వెల్లడించారు. తన ప్రత్యర్థి చేసే విమర్శ మీద  అమ్మ నుంచి ఈ స్థాయి వివరణ రావటం ఎవరూ ఊహించనిది. చూస్తుంటే.. రెండోసారి సీఎంగా బాధ్యతల స్వీకరణ అమ్మ మీద బాధ్యతను పెంచినట్లుగా కనిపిస్తోంది.
Tags:    

Similar News