అమ్మ మాటను నమ్మి గెలిపించారు...

Update: 2016-05-20 10:00 GMT
  తమిళనాడు రాజకీయాల్లో ఉచిత హామీలకు ఉన్న ప్రాధాన్యం తక్కువేమీ కాదు. గత ఎన్నికల్లో జయలలిత వేసిన మంత్రి ఆమెకు అప్పట్లో ఫలితం ఇవ్వడమే కాకుండా ఈ ఎన్నికల్లోనూ ఆమె రికార్డులు బద్దలు కొట్టడానికి ఉపయోగపడింది. 2011లో జరిగిన తమిళనాడు ఎన్నికల్లో.. తాము అధికారంలోకి వస్తే ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తామని జయలలిత హామీ ఇచ్చారు. అన్నట్లుగానే ఆమె సీఎం అయిన తర్వాత విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇచ్చారు.  దాంతో తమిళనాడు విద్యార్థుల చేతిలో అమ్మ బొమ్మ ఉన్న ల్యాప్ టాప్ లు తళుక్కున మెరిశాయి. ఆ హామీ కారణంగా అప్పటి ఎన్నికల్లో విద్యార్థుల తల్లిదండ్రుల జయకు ఓటేసి గెలిపించగా ఈసారి ఎన్నికల్లోనూ ల్యాప్ టాప్ ల ప్రభావం కనిపించింది.  అప్పుడు ల్యాప్ టాప్ లు తీసుకున్న విద్యార్థుల్లో చాలామందికి ఆ తరువాత ఓటు హక్కు వచ్చింది. వారంతా అమ్మ ల్యాఫ్ టాప్ లు ఇచ్చిందన్న అభిమానంతో ఈసారి ఆమెకే ఓటేశారు. ఫలితంగా జయకు వరుసగా రెండోసారి విజయం దక్కింది.

నిజానికి తమిళనాడులో ఏ పార్టీని వరుసగా రెండుసార్లు గెలిపించిన చరిత్ర గత 30 ఏళ్లలో లేదు. 1984లో ఎంజీరామచంద్రన్ వరుసగా మూడో సారి ముఖ్యమంత్రి అయి 1987 వరకు పాలించారు. ఆ తరువాత నుంచి ఒకసారి జయ సీఎం అయితే - ఇంకోసారి కరుణానిధి  సీఎం అవుతూ వచ్చారు. అంతే కానీ, ఎవరూ వరుసగా రెండుసార్లు సీఎం కాలేకపోయారు. కానీ.. ఈసారి తమిళనాడులో ప్రభుత్వ వ్యతిరేకతను సైతం తోసిరాజని జయలలిత వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి కావడం వెనుక యువ ఓటర్ల ప్రభావం చాలానే ఉంది. గత టెర్ములో అమ్మ ఇచ్చిన ల్యాప్ టాప్ లు అందుకున్నవారంతా ఆమెకే ఓటేసినట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి.

అప్పటి ల్యాప్ టాప్ హామీని నిలబెట్టుకున్న అమ్మపై జనంలో మంచి నమ్మకం ఏర్పడింది. ఈసారి కూడా పెళ్లికూతుళ్లకు బంగారు ఆభరణాలు - ప్రతి కుటుంబానికీ ఉచితంగా మొబైల్ ఫోన్లు ఇస్తామని చెప్పడం లాంటివి బాగానే పనిచేశాయి. మరోవైపు ఇప్పటికే అమలుచేస్తున్న అమ్మ క్యాంటీన్లు - 5 రూపాయలకే భోజనం.. తాగునీటి బాటిళ్లు వంటివన్నీ ప్రజలపై ప్రభావం చూపించాయి. 10 - ఇంటర్ విద్యార్థులందరికీ  ఉచితంగా మొబైల్ ఫోన్లు - ఇంటర్‌ నెట్ కనెక్షన్‌ తో కూడిన ల్యాప్‌ టాప్‌ లు ఇస్తామని ఈసారి హామీల వర్షం కురిపించారు. గత ల్యాప్ టాప్ ల సక్సెస్ వల్ల ఈసారి కూడా విద్యార్థులు - వారి తల్లిదండ్రులు అమ్మకు ఓటేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి జయ టెక్నిక్ బాగానే పనిచేసింది.
Tags:    

Similar News