అమ్మ ఆస్తుల విష‌యంలో ఆశ్చ‌ర్య‌పోయే నిజం

Update: 2017-04-18 04:35 GMT
త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌లలిత విష‌యంలో ఇన్నాళ్లు సాగిన కీల‌క చ‌ర్చ‌కు ఫుల్ స్టాప్ ప‌డింది. అమ్మ ఆస్తులకు తామంటే తామే వార‌సుల‌మ‌ని కొంద‌రు - జ‌య‌లలిత వీలునామా రాసినందున దాని ప్ర‌కార‌మే పంప‌కాలు ఉంటాయ‌ని మ‌రికొంద‌రు చ‌ర్చోప‌చ‌ర్చ‌లు చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఈ చ‌ర్చకు తాజాగా ఫుల్ స్టాప్ ప‌డింది. అంటే స‌ద‌రు వాటాదారుల మ‌ధ్య అంగీకారం కుద‌ర‌డం వ‌ల్ల కాదు. అలాంటి వీలునామా ఏమీ లేద‌ని తేలిపోవ‌డం వ‌ల్ల‌!

త‌మిళ‌నాడులో వాణిజ్య పన్నులు - రిజిస్ట్రేషన్‌ శాఖ (సీటీడీఆర్‌)కు విభాగం ప‌రిధిలో అధికారికంగా వీలునామాల నమోదు అంశం వ‌స్తుంది. ఈ విభాగానికి ఆస‌క్తిక‌ర‌మైన ద‌ర‌ఖాస్తు ఒక‌టి వ‌చ్చింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత వీలునామా గురించి సమాచారం తెలుపాలంటూ సమాచార కార్యకర్త ఎస్‌ భాస్కరన్ స‌మాచార హ‌క్కు ద్వారా దరఖాస్తు చేశారు. దీనిపై సీటీడీఆర్‌ స్పందిస్తూ దివంగ‌త ముఖ్యమంత్రి జయలలిత వీలునామా గురించి ఎలాంటి పత్రాలు కానీ, సమాచారంగానీ తమ వద్ద లేదని తెలియజేసింది. త‌ద్వారా అమ్మ త‌న ఆస‌క్తి విష‌యంలో ఎలాంటి వీలునామా రాయ‌లేద‌ని క్లారిటీ ఇచ్చింది.

అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పేరిట సుమారు రూ.113.72 కోట్ల ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఆస్తుల‌కు హ‌క్కుదారులుగా ర‌క‌ర‌కాల పేర్లు తెర‌మీద‌కు వ‌చ్చాయి. గ‌త ఏడాది డిసెంబర్‌ 5న జయలలిత మరణించిన త‌ర్వాత ఈ చ‌ర్చ  మ‌రింత‌గా పెరిగింది. పోయెస్‌ గార్డెన్‌ లోని వేదనిలయం సహా ఆమె ఆస్తులు ఎవ‌రికి చెందాలో పేర్కొంటూ జయలలిత వీలునామా రాసినట్టు గతంలో కథనాలు వచ్చాయి. అయితే ఈ విష‌యంలో  తాజాగా ప్రభుత్వం అధికారికంగా వీలునామా ఏదీ లేద‌ని తేల్చిచెప్పింది. కాగా, జయలలిత వీలునామా రాసినట్టు తమకు తెలియదని ఆమె వ్యక్తిగత లీగల్‌ వ్యవహారాలను పర్యవేక్షించిన అన్నాడీఎంకే న్యాయవాదులు గతంలోనే ప్ర‌క‌టించారు. దీంతో అమ్మ‌ ఆస్తులు ఎవరికి చెందుతాయనే మిస్టరీ కొనసాగుతూనే ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News