జేపీ మాట‌!... పీకే అడ‌గ‌డ‌మే ఆల‌స్యం!

Update: 2017-12-26 08:24 GMT
వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి జాతీయ స్థాయి రాజ‌కీయాలు ఎలా ఉన్నా... ఏపీలో మాత్రం ర‌స‌వత్త‌ర‌మైన రాజ‌కీయం చోటుచేసుకునే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయి. ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదికి పైగానే స‌మ‌య‌ముండ‌గా... ఇప్ప‌టికే విప‌క్ష వైసీపీ ఆ ఎన్నిక‌ల్లో విజ‌యమే ల‌క్ష్యంగా ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరిట సుదీర్ఘ పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింప‌డంతో పాటుగా అధికారం ఇస్తే... తాను రాష్ట్రాన్ని ఏ రీతిన అభివృద్ధి చేయ‌నున్నాన‌నే విష‌యాన్ని జ‌నానికి చెబుతూ సాగుతున్న జ‌గ‌న్‌... ఆయా వ‌ర్గాల వారికి త‌న అండ ఎలా ఉంటుంద‌న్న విష‌యాన్ని కూడా చాలా విస్ప‌ష్టంగా చెబుతూ దూసుకెళుతున్నారు. ఇక అధికార పార్టీ టీడీపీ విష‌యానికి వ‌స్తే... గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ప్ప‌ద‌న్న భావ‌న‌తో చివ‌రి నిమిషంలో టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను రంగంలోకి దించి వైసీపీకి పెద్ద దెబ్బే కొట్టేసింది. ప‌వ‌న్ ఎంట్రీతో అధికారం ఖాయ‌మ‌నుకున్న వైసీపీకి విప‌క్ష హోదా ద‌క్క‌గా... ముచ్చ‌ట‌గా మూడో ప‌ర్యాయం కూడా ఓట‌మి త‌ప్ప‌ద‌నుకున్న చంద్ర‌బాబుకు ఫుల్ మెజారిటీ వ‌చ్చేసింది. వెర‌సి గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో వైసీపీ - టీడీపీలే బ‌రిలోకి దిగినా... ప‌వ‌నే ట్రంప్ కార్డులా మారాడ‌న్న మాట‌.

మ‌రి వ‌చ్చే ఎన్నికల్లో త‌న పార్టీ ప్ర‌త్య‌క్ష బ‌రిలోకి దిగుతుంద‌ని ఇప్ప‌టికే గ్రాండ్‌గా ప్ర‌క‌టించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ అందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో అస‌లు ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి మ‌ద్ద‌తు ప‌లుకుతారా? అన్న అనుమానాలు కూడా లేక‌పోలేదు. మ‌రోవైపు ప్ర‌త్య‌క్ష బ‌రిపై ప‌వ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న ఆయ‌న అభిమానుల‌తో పాటుగా జ‌న‌సేన శ్రేణుల్లో కొత్త ఆశ‌ల‌ను రేకెత్తించాయ‌నే చెప్పాలి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ ప్ర‌త్య‌క్ష బ‌రిలోకి దిగుతున్న నేప‌థ్యంలో త‌మ‌కు కూడా అవ‌కాశాలు ద‌క్క‌క‌పోతాయా? అన్న కోణంలో జ‌న‌సేన శ్రేణులు ప్ర‌తి అంశాన్ని కూడా చాలా ఆస‌క్తిగా ప‌రిశీలిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఐఏఎస్ ప‌ద‌విని తృణ‌ప్రాయంగా వ‌దిలేసి... క్లీన్ పాలిటిక్స్ చేద్దామంటూ రాజ‌కీయ బ‌రిలోకి దిగిన జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ గుర్తున్నారు క‌దా. ఐఏఎస్ వాలంట‌రీ రిటైర్‌ మెంట్ తీసుకున్న వెంట‌నే చాలా ఏళ్ల క్రితమే లోక్ స‌త్తా పేరిట ఓ వేదిక‌ను ఏర్పాటు చేసిన జేపీ... 2009 ఎన్నిక‌ల్లో అదే సంస్థ పేరిట ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగారు. కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగిన జేపీ... మిగిలిన చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌న పార్టీ అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దించారు. అయితే ఆ ఎన్నిక‌ల్లో జేపీ ఒక్క‌రు మాత్ర‌మే విజ‌యం సాధించ‌గా... లోక్ స‌త్తాను ఏ ఒక్క నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఆద‌రించిన దాఖ‌లా క‌నిపించ‌లేదు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో మ‌ల్కాజిగిరీ లోక్ స‌భ స్థానం నుంచి పోటీ చేసి జేపీ... ఘోరంగా ఓట‌మిపాల‌య్యారు.

తాజాగా 2019 ఎన్నిక‌లు స‌మీసిస్తున్న నేప‌థ్యంలో ఇటీవ‌లి కాలంలో జేపీ ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్ఓల సుడిగాలి ప‌ర్య‌ట‌న చేస్తున్నారు. ఎక్క‌డికి వెళ్లినా... పెద్ద‌గా రాజ‌కీయాలు మాట్లాడ‌ని జేపీ... సామాజిక అంశాల‌పైనే ప్ర‌ధానంగా దృష్టి సారిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌ కు ఆయ‌న ఇటీవ‌ల ఇచ్చిన ఓ ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర అంశాల‌ను ప్ర‌స్తావించారు. ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన సినీ న‌టులు రాజ‌కీయాల్లోకి రావాలంటూ గ‌తంలో తాను ఇచ్చిన పిలుపును ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేశారు. తన పిలుపు త‌ర‌హాలోనే గ‌డ‌చిన ఎన్నిక‌ల కంటే ముందుగానే రాజ‌కీయ తెరంగేట్రం చేసిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌... జ‌న‌సేన పేరిట పార్టీ పెట్టిన సంగ‌తి తెలిసిందే. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో టీడీపీ - బీజేపీ కూటమికి మ‌ద్ద‌తుగా నిలిచిన ప‌వ‌న్‌... ఈ ద‌ఫా మాత్రం తాను స్థాపించిన జ‌న‌సేన పార్టీ ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతుంద‌ని, తాను అనంత‌పురం జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బ‌రిలోకి దిగుతాన‌ని ప‌వ‌న్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించిన జేపీ... అస‌లు ప‌వ‌న్ పార్టీ వైఖ‌రి ఏమిటో తెలియ‌జేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వ్యాఖ్యానించారు. ప‌వ‌న్ త‌న వైఖ‌రిని ప్ర‌క‌టిస్తే... జ‌న‌సేన‌కు మ‌ద్ద‌తిచ్చే విష‌యాన్ని తాను ప‌రిశీలిస్తాన‌ని జేపీ చెప్పారు. అంతేకాకుండా... ప‌వ‌న్ త‌న‌కు తానుగా స‌హాయం కావాలని కోరినా కూడా తాను జ‌న‌సేన‌కు మ‌ద్ద‌తిచ్చేందుకు సిద్ధంగానే ఉన్నాన‌ని కూడా జేపీ ప్ర‌క‌టించారు. మ‌రి ఈ వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ ఏమంటార‌న్న విష‌యంపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర లేసింద‌నే చెప్పాలి.

ఇదిలా ఉంటే...ఇదే ఇంట‌ర్వ్యూలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ విష‌యాన్ని కూడా ప్రస్తావించిన జేపీ... కాస్తంత ఘాటు వ్యాఖ్య‌లే చేశారు. మోదీపై ఇప్ప‌టిదాకా త‌న‌కు ఉన్న అంచ‌నాలు అన్నీ తారుమారైపోయాయ‌ని, అస‌లు మోదీపై త‌న‌కున్న భ్ర‌మ‌లు తొల‌గిపోయాయ‌ని జేపీ వ్యాఖ్యానించారు. అవినీతి పాల‌న సాగించిందంటూ యూపీఏ పాల‌న‌పై గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో నిప్పులు చెరిగిన మోదీ... ఇప్పుడు తాను కూడా యూపీఏ వ్య‌వ‌హ‌రించిన తీరులోనే ముందుకు సాగుతున్నార‌ని జేపీ తెలిపారు. అంతేకాకుండా ఒక‌టి అరా విష‌యాలు త‌ప్పిస్తే... ఎన్డీఏ స‌ర్కారు అవ‌లంబిస్తున్న విధానాల‌న్నీ కూడా యూపీఏ విధానాల మారిదే ఉన్నాయ‌ని కూడా జేపీ కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. టీడీపీ-బీజేపీ కూటమి గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో లోక్ స‌త్తాతో పొత్తు పెట్టుకోవాల‌ని ప్ర‌తిపాదించింద‌ని పేర్కొన్న జేపీ... ఎందుక‌నో గానీ... ఆ కూటమి ఆ ఆలోచ‌న‌ను ప‌క్క‌న‌పెట్టేసింద‌ని తెలిపారు. ఆ ప్ర‌తిపాద‌న‌ను ఆ కూట‌మి ఎందుకు ప‌క్క‌న‌పెట్టింద‌న్న విష‌యం ఇప్ప‌టిదాకా త‌న‌కు తెలియ‌నే లేద‌ని కూడా జేపీ వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News