మ‌ళ్లీ చురుగ్గా ఆ కీల‌క నేత‌.. పూర్వ వైభ‌వం వ‌చ్చేనా?

Update: 2022-08-23 04:23 GMT
జేసీ దివాక‌ర్‌రెడ్డి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జేసీ తెలియ‌నివారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. ఉన్న‌ది ఉన్న‌ట్టు.. ఏ విష‌య‌మైనా కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు మాట్లాడ‌టం జేసీ స్టైల్. క‌ర‌డు గ‌ట్టిన కాంగ్రెస్ నేత‌గా చాలా కాలం రాజ‌కీయాల్లో కొన‌సాగిన జేసీ ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న త‌ర్వాత టీడీపీలో చేరారు. 2014లో టీడీపీ త‌ర‌ఫున‌ జేసీ దివాక‌ర్‌రెడ్డి అనంత‌పురం ఎంపీగా, ఆయ‌న సోద‌రుడు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి తాడిప‌త్రి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. ఐదేళ్ల‌పాటు అనంత‌పురం జిల్లా రాజ‌కీయాల‌ను సోద‌రులిద్ద‌రూ శాసించారు.

అయితే ఓడ‌లు బ‌ళ్లు అవుతాయి.. బ‌ళ్లు ఓడ‌లు అవుతాయ‌న్న‌ట్టు 2019 వైఎస్సార్సీపీ అధికారంలోకి రావ‌డంతో జేసీ బ్ర‌ద‌ర్స్‌కు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. మ‌రోవైపు 2019 జేసీ బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రూ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు. అనంత‌పురం నుంచి టీడీపీ త‌ర‌ఫున లోక్‌స‌భ అభ్య‌ర్థిగా జేసీ దివాక‌ర్‌రెడ్డి కుమారుడు జేసీ ప‌వ‌న్ కుమార్ రెడ్డి, తాడిప‌త్రి నుంచి అసెంబ్లీకి జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి పోటీ చేశారు. అయితే ఇద్ద‌రూ ఓడిపోయారు.

ఇంకోవైపు వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వం దివాక‌ర్ ట్రావెల్స్‌పైన‌, జేసీ సోద‌రుల‌పైన అనేక కేసులు న‌మోదు చేసి జైలుపాలు చేసింది. ఒక కేసులో బెయిల్ దొరికింద‌నేలోపే ఇంకో కేసులో అరెస్టు చేయ‌డం చేసింది. దీంతో అప్ప‌టి నుంచి జేసీ దివాక‌ర్‌రెడ్డి సైలెంట్ అయిపోయారు. రాజ‌కీయాల్లోనూ అంత చురుగ్గా వ్య‌వ‌హ‌రించ‌డం మానేశారు. మ‌రోవైపు దివాక‌ర్ రెడ్డి సోద‌రుడు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి మాత్రం తాడిప‌త్రి మున్సిపల్ చైర్మ‌న్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

కాగా ఇన్నాళ్లూ సైలెంట్ అయిపోయిన జేసీ దివాక‌ర్‌రెడ్డి గ‌త కొద్ది రోజుల నుంచి చురుగ్గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెబుతున్నారు. గ్రామాల‌వారీగా ప‌ర్య‌ట‌న‌లు చేయ‌డం, పాత ప‌రిచ‌య‌స్తులంద‌రినీ క‌ల‌వ‌డం, వారి యోగ‌క్షేమాలు తెలుసుకోవ‌డం చేస్తున్నారు. తాడిపత్రి నియోజ‌క‌ర్గంలో గ్రామ‌గ్రామానికి వెళుతున్న జేసీ పాత జేసీని ప‌రిచ‌యం చేస్తున్నార‌ని అంటున్నారు. తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి జేసీ దివాక‌ర్‌రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో ఆయ‌న అనంత‌పురం ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి తాడిప‌త్రి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు.

ఈ నేప‌థ్యంలో తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కు తిరుగుతున్న ఆయ‌న‌ను చూసి ఆయ‌న అభిమానులు, ప్ర‌జ‌లు పెద్దాయ‌న వ‌చ్చాడ‌ని సంతోషం వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. ఆయ‌న కూడా అంద‌రి ఇళ్ల‌కు వెళ్లి ప్ర‌తి ఒక్క‌రినీ ప‌ల‌క‌రిస్తున్నారు. త‌న అనుచ‌రుల యోగ‌క్షేమాల‌ను విచారిస్తున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో జేసీ దివాక‌ర్‌రెడ్డి, జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు. వీరిద్ద‌రి కుమారులు ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. వృద్ధాప్యంతో జేసీ దివాక‌ర్‌రెడ్డి తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు కూడా అప్ప‌ట్లో ప్ర‌క‌టించారు. అయితే మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ఆయ‌న మళ్లీ యాక్టివ్ కావ‌డంతో అనంత‌పురం రాజ‌కీయాలు రంజుగా మారే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల స‌మ‌యం కూడా లేదు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో జేసీ దివాక‌ర్ రెడ్డి పోటీ చేస్తారా.. లేదంటే గ‌త ఎన్నిక‌ల్లో మాదిరిగానే ఆయ‌న కుమారుడు జేసీ ప‌వ‌న్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారా అనే అంశంపై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.
Tags:    

Similar News