టీడీపీ బాబుద‌ట‌... లోకేష్ కే ఇవ్వాల‌ట‌!

Update: 2018-05-29 18:42 GMT
తెలుగుదేశం పార్టీ గురించి...తెలుగువారికి ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఆ మాట‌కు వ‌స్తే...జాతీయ రాజ‌కీయాల్లో కూడా ఆ పార్టీది ప్ర‌త్యేక ఒర‌వ‌డి. జాతీయ రాజ‌కీయాల‌ను అనూహ్య రీతిలో మ‌లుపు తిప్ప‌డంలో ఆ పార్టీ సాధించిన ఇమేజ్ అలాంటిది. కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజ‌కీయాల‌కు వ్య‌తిరేకంగా, ప్ర‌జాస్వామ్య వ్య‌తిరేక నిర్ణ‌యాల‌ను నిర‌సిస్తూ...టీడీపీ ఏర్పాటు చేశారు సుప్ర‌సిద్ధ‌న‌టుడు ఎన్టీఆర్‌. అలాంటి ఆ పార్టీ కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా ఎన్నో పోరాటాలు చేసింది. అయితే చిత్రంగా ఇప్పుడు ఆ పార్టీ....ఏ మౌలిక సిద్దాంతాల‌కు వ్య‌తిరేకంగా ఏర్ప‌డిందో వాటినే తుంగ‌లో తొక్కేలా సాగుతోంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందుకు నిద‌ర్శ‌నం ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు చెట్టాప‌ట్టాల్ వేసుకొని తిర‌గ‌డం. దానికి కొన‌సాగింపు అన్న‌ట్లుగా తాజాగా మ‌హానాడులో మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంద‌ని అంటున్నారు.

విజయవాడలో జరుగుతున్న మహానాడులో సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి మాట్లాడుతూ వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు వ్య‌తిరేకంగా ఏర్ప‌డిన టీడీపీ అదే రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా ఎలా మారిపోయిందో స‌భా ముఖంగానే వెల్ల‌డించారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఆస్తి. దాని వారసుడు కచ్చితంగా లోకేశే. చంద్రబాబు తర్వాత లోకేశ్‌ ముఖ్యమంత్రి అయితే తప్పేంటి? అని ఆయ‌న విస్మ‌య‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రానికి ఇన్నాళ్లు ముఖ్యమంత్రిగా చేశారు... ఆయన సేవలు దేశానికి అవసరం అని నాయ‌కుడిని ఫిదా చేసే కామెంట్లు చేశారు. పార్టీకి చెందిన ఎంపీ ఇలా పార్టీ మూల సిద్ధాంతాల‌కు భిన్నంగా మాట్లాడుతుంటే..చంద్ర‌బాబు వారించ‌లేదు. త‌ర్వాత కూడా సాగిన ఆయ‌న ప్ర‌సంగంలో ఈ విష‌యంపై స్పందించ‌లేదు. దీంతో స‌మాజ‌మే దేవాల‌యం..ప్ర‌జ‌లే దేవుళ్లు అన్న‌పార్టీ కాస్త త‌న ఆలోచ‌న‌ను మార్చుకున్న విధానం సుస్ప‌ష్టం అయింద‌ని చ‌ర్చించుకుంటున్నారు.

మ‌రోవైపు తెలుగుదేశం పార్టీ మ‌హానాడులో పాల్గొన్న నాయ‌కులంతా యువ‌నేత నారా లోకేష్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. టీడీపీని న‌డిపించే నాయ‌కుడు చంద్ర‌బాబు త‌ర్వాత లోకేషేన‌ని కొనియాడారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని - గ‌తంలో ప‌లు ఉదాహ‌ర‌ణ‌ల‌ను ఆయ‌న స్ఫూర్తిగా తీసుకోవాల‌ని కోరారు. ఇదే సంద‌ర్భంగా మంత్రి లోకేష్‌ ను రాష్ట్రంలో ``ముఖ్య‌`` బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించాల‌ని కోరారు. దీనికి సైతం చంద్ర‌బాబు నుంచి ఎలాంటి స్పంద‌న రాక‌పోవ‌డం పార్టీలోని కొత్త పోక‌డ‌ల‌కు నిద‌ర్శ‌న‌మ‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News