భిన్న ధ్రువాల పెద్ద రెడ్లు..వేదిక పంచుకున్నారు

Update: 2015-08-31 04:12 GMT
ప్రాంతాలు రేపిన దూరాన్ని కులం దగ్గర చేసింది. ఎడముఖం.. పెడ ముఖంగా ఉండే ఇరువురు నేతలు మాట్లాడుకోవటమే కాదు.. ఇద్దరూ కలిసి ఒకే వేదికను పంచుకునేలా చేసింది. ప్రాంతాలు వారి మధ్య పూడ్చలేనంత దూరాన్ని పెంచినా.. అందుకు భిన్నంగా వారి కులం మాత్రం ఏకం చేయటం విశేషం. ఈ ఆసక్తికర పరిణామం హైదరాబాద్ లో ఆదివారం చోటు చేసుకుంది.

దశాబ్దాల తరబడి రాజ్యాధికారం చేతిలో ఉన్నప్పటికీ రెడ్డి వర్గీయులు మాత్రం వెనుకపడే ఉన్నారంటూ రెడ్డి వర్గీయులు పడుతున్న ఇబ్బందుల్ని తెరపైకి తీసుకొచ్చి.. వారి సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రయత్నం మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో బలమైన సామాజిక వర్గాల్లో ఒకటైన రెడ్లు వెనుకబడిన తీరును.. విభజనకు అతీతంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రెడ్ల సామాజిక వర్గ నేతలు ఒకే వేదికను పంచుకోవటం గమనార్హం.

బలమైన సమైక్యవాదిగా పేరొందిన ఏపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. బలమైన తెలంగాణ వాదాన్ని వినిపించే తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఇద్దరూ ఒకే వేదికను పంచుకున్నారు. ఆసక్తికరంగా ఈ భిన్న ధ్రువాలు ఒకే మాటను వినిపించారు. రెడ్ల సంక్షేమం కోసం కృషి చేస్తామని చెప్పటమే కాదు.. పేద రెడ్లకు సాయం చేయటానికి ముందుకొచ్చారు.

నాయిని.. జేసీలతో చూస్తే.. జేసీ దివాకర్ రెడ్డి అయితే తనకున్న రెడ్డి కులభిమానాన్ని ప్రదర్శించుకోవటమే కాదు.. వేదిక మీద నుంచి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. పేద రెడ్డి విద్యార్థులను.. రెడ్డి సంఘాలను.. ఉన్నత స్థానాల్లో ఉన్న రెడ్లు ఆదుకోవాలని కోరుతూ.. పేద రెడ్డి విద్యార్థులకు ఉద్యోగాల కోసం ఎవరైనా కోచింగ్ సెంటర్ పెడితే.. తన వంతుగా రూ.10లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఇక.. తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అయితే.. రెడ్లలో ఆర్థికంగా వెనుకబడిన వారు చాలామంది ఉన్నా.. రెడ్లు అనగానే అగ్రవర్ణంగా చిత్రీకరించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి కులాభిమానం రాష్ట్రాల మధ్య హద్దుల్ని చెరిపివేయటం ఆసక్తికరమే.
Tags:    

Similar News