చంద్రబాబు పీఎం... లోకేశ్ సీఎం

Update: 2016-04-22 09:51 GMT
అనంతపురం ఎంపీ - టీడీపీ నేత జేసీ దివాకరరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్య చేశారు. ఏపీలో, దేశంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయని... చంద్రబాబు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని అన్నారు. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయవర్గాల్లో, టీడీపీలో కలకలం రేగింది. జేసీ దివాకరరెడ్డి అన్నారంటే ఎక్కడో ఏదో రీజన్ ఉండి ఉంటుందని... చంద్రబాబుతో ఆయనకు ఏదయినా అవసరం ఉండి అలా మెప్పించే మాటలు చెప్పడమైనా కావాలి.. లేదంటే చంద్రబాబు భవిష్యత్తు ప్రణాళికలైనా ఆ దిశగా ఉండి ఉండాలన్న వాదన వినిపిస్తోంది. ఏదైనా కానీ జేసీ వ్యాఖ్యలు మాత్రం కొత్త చర్చకు తెరతీశాయి.

శుక్రవారం ఉదయం తిరుపతికి వచ్చిన జేసీ విలేకరులతో మాట్లాుడూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే... ఆయన వ్యాఖ్యల అనంతరం ప్రస్తుతం రాజకీయ సమీకరణలను విశ్లేషిస్తున్నవారంతా ఏమో చంద్రబాబుకు ఆలోచన ఉండొచ్చని అంటున్నారు. లోకేశ్ ను ఏపీ రాజకీయాల్లోకి చాలా తొందరతొందరగా చొప్పించే ప్రయత్నాలు జరుగుతుండడం... కేంద్రం నుంచి ఏపీకి ఆశించిన సహకారం లేకపోవడం.. టీడీపీ జాతీయ పార్టీగా విస్తరించే ప్రణాళికలు వేస్తుండడంతో జేసీ మాటలను తేలిగ్గా కొట్టిపారేయలేమని అంటున్నారు. బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన వెంకయ్యనాయుడు చంద్రబాబును ప్రమోట్ చేస్తుండడం... మోడీ ప్రభ వచ్చే ఎన్నికల నాటికి ఎలా ఉంటుందో స్పష్టత లేకపోవడం... అవసరమైతే కేసీఆర్ కూడా చంద్రబాబుకు మద్దతు పలికే అవకాశాలు ఉండడంతో చంద్రబాబు ప్రధాని కావడంఅసాధ్యమేమీ కాదని అంటున్నారు. అమరావతి నగరం సక్సెస్ అయితే చంద్రబాబు మరోసారి నేషనల్ లెవల్లో మరోసారి హైలైట్ అవడం ఖాయం.. సో... లోకేశ్ ఏపీని ఏలితే, చంద్రబాబు సెంట్రల్ చూసుకునే రోజు వస్తుందన్న జేసీ జోష్యం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. ఇందులో సాధ్యాసాధ్యాలెలా ఉన్నా జేసీలాంటి నేత నోట చంద్రబాబు ప్రధాని అన్న మాట వినిపిస్తే చంద్రబాబుకు అంతకంటే సంతోషం ఏముంటుంది.

Tags:    

Similar News