పీకేతో పొత్తు!... టీడీపీ ఆశ‌లు చావ‌లేదు!

Update: 2019-01-31 16:20 GMT
ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు గ‌డువు ముంచుకొచ్చేసింది. అన్ని పార్టీలూ ఎన్నిక‌ల మూడ్‌ లోకి వెళ్లిపోయాయి. ఓ వైపు క‌లిసి వ‌చ్చే పార్టీలు - అభ్య‌ర్థుల ఎంపిక‌ల‌తో దాదాపుగా అన్ని పార్టీలూ బిజీబిజీగా ఉన్నాయి. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో కుదిరిన పొత్తులు ఈ ద‌ఫా క‌నిపించే ఛాన్సే లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. అయితే పొత్తుల‌తోనే ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని భావిస్తున్న అధికార టీడీపీ... త‌న‌కు గ‌త ఎన్నిక‌ల్లో ఎంతో లాభం చేకూర్చిన జ‌న‌సేన కోసం అర్చులు చాస్తూనే ఉంద‌ని చెప్పాలి. టీడీపీతో పొత్తు ప్ర‌సక్తే లేద‌ని జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక‌టికి నాలుగు సార్లు చెప్పినా.. ఆయ‌న‌ను త‌న దారిలోకి తెచ్చుకునేందుకు టీడీపీ త‌న‌దైన రీతిలో య‌త్నాలు చేస్తూనే ఉంది. ఈ పొత్తు కుదురుతుందా?  లేదా? అన్న విష‌యాన్ని ప‌క్క‌న‌బెడితే... ఈ పొత్తుపై ఎప్ప‌టిక‌ప్పుడు టీడీపీ నేత‌లు ఆశావ‌హ కామెంట్లు చేస్తూనే ఉన్నారు. వాటిపై ప‌వ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

మొన్నామ‌ధ్య టీడీపీ సీనియ‌ర్ నేత‌ - ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేశ్... టీడీపీ - జ‌న‌సేన‌ల పొత్తుపై ఏదో మాట అంటే... ప‌వ‌న్ అంతెత్తున లేచారు. మ‌రోమారు ఇలా మాట్లాడితే ఖ‌బ‌డ్దార్ అంటూ వార్నింగిచ్చేశారు. ఈ వివాదం స‌ద్దుమ‌ణిగిందిలే అనుకుంటున్న త‌రుణంలో ఇప్పుడు ఇలాంటి వివాద‌మే మ‌రొక‌టి వ‌చ్చేసింది. నాడు టీజీ కామెంట్ల‌తో ఈ వివాదం రేగితే... నేడు టీడీపీకే చెందిన మ‌రో సీనియ‌ర్ నేత‌ - అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి తాజా వివాదం రేపారు. జ‌న‌సేన‌తో పొత్తు ఉంటుంద‌ని చెప్ప‌క‌పోయినా... చివ‌రి నిమిషం దాకా ఆగాల‌ని - రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మేన‌ని చెప్పిన జేసీ... జ‌న‌సేన త‌మ‌తో క‌లిసి వ‌స్తుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. ఓ వైపు చంద్ర‌బాబు దీక్ష‌ల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన జేసీ... అదే సంద‌ర్భంగా టీడీపీ - జ‌న‌సేన పొత్తుల‌పై మాట్లాడారు.

అయినా జేసీ ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే... *వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ తో పొత్తు పెట్టుకునే విషయం నాకు తెలియదు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు - శాశ్వత శత్రువులు ఉండరు. ఎవరైనా తమతో కలువవచ్చు. ఎన్నికల నేపథ్యంలో చివరి నిమిషం వరకు ఏదైనా జరగవచ్చు. వేచి చూడండి* అంటూ జేసీ త‌న‌దైన స్టేల్లో కామెంట్ చేసేశారు. మొన్న టీజీ వెంక‌టేశ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హావేశాల‌తో ఊగిపోయిన ప‌వ‌న్‌.... ఏకంగా టీజీని రాజ‌కీయంగానే కాకుండా వ్య‌క్తిగ‌తంగా కూడా విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌రి ఈ సారి జేసీ చేసిన వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ ఏ రీతిన స్పందిస్తారో.. లేదంటే టీడీపీ వాళ్లింతేలే... అంటూ లైట్ గా తీసుకుంటారో చూడాలి. అస‌లే ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో ఈ త‌ర‌హా వివాదాలు నిజంగానే ఆస‌క్తిని పెంచుతున్నాయి.


Tags:    

Similar News