జేసీ మాట‌: ఏపీకి ప్యాకేజీలే గ‌తి!

Update: 2015-11-23 09:51 GMT
సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసే జేసీ దివాక‌ర్‌ రెడ్డి మ‌రోసారి త‌న మార్క్ వ్యాఖ్య‌ల్ని చేశారు. ఏం మాట్లాడితే ఏం అవుతుందో అన్న‌భ‌యంతో నోటి వెంట మాట రానట్లుగా వ్య‌వ‌హరించే ఏపీ అధికార‌ప‌క్ష నేత‌ల‌కు భిన్నంగా జేసీ వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశం మొద‌లు ఏ విష‌యం మీద‌నైనా స‌రే.. మొహ‌మాటం లేకుండా మాట్లాడేసే ఆయ‌న‌.. తాజాగా ఏపీ ప్ర‌త్యేక హోదా గురించి మాట్లాడారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా మీద పోరాటం చేయాల‌ని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్న నేప‌థ్యంలో జేసీ ఈ విష‌యం మీద త‌న అభిప్రాయాన్ని కుండ బ‌ద్ధ‌లుకొట్టారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోరుకోవ‌టం త‌ప్పేమీ కాద‌ని.. అయితే కేంద్రం మాత్రం హోదా ఇచ్చే ప‌రిస్థితుల్లో లేద‌ని తేల్చి చెప్పారు.

రాయ‌ల‌సీమ గురించి మాట్లాడుతున్న వారంతా రాజ‌కీయ నిరుద్యోగులే అన్న ఆయ‌న‌.. తాను గ‌తంలో రాయ‌ల తెలంగాణ కోరితే ఎవ‌రూ మ‌ద్దుతు ఇవ్వ‌ని విష‌యాన్ని గుర్తు చేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా వ‌చ్చే అవ‌కాశం లేద‌ని.. ప్యాకేజీలే దిక్కు అని తేల్చి చెప్పారు. జ‌గ‌న్ పోరాటం వృధా అన్న‌ట్లుగా జేసీ తేల్చేయ‌ట‌మే కాదు.. చివ‌ర‌కు ఏం జ‌రుగుతుంద‌న్న విష‌యంపై కూడా స్ప‌ష్ట‌త ఇచ్చేయ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News