పొలిటికల్ రాంగోపాల్ వర్మ..జేసీ దివాకరరెడ్డి

Update: 2016-12-23 07:47 GMT
సినిమా రంగంలో సంచలన వ్యాఖ్యలకు మారుపేరైన రాంగోపాల్ వర్మకు పొలిటికల్ కౌంటర్ పార్ట్ ఎవరంటే జేసీ దివాకరరెడ్డి పేరే టక్కున వినిపిస్తుంది. అలాంటి జేసీ ఇటీవల చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే.. దానిపై ఆయన ఒక ఛానల్ తో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబేమీ మహాత్మాగాంధీ కాదని తాను అనలేదని... అసలు మహాత్మా గాంధీ పేరే తాను ప్రస్తావించలేదని.. కేవలం ఎన్టీఆర్ తో కంపేర్ చేశానని అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి క్లారిటీ ఇచ్చారు.  ఎన్టీఆర్ లా చంద్రబాబు అందరినీ గెలిపించలేరని మాత్రమే చెప్పానన్నారు.  అదేసమయంలో చంద్రబాబుకు చిన్నపాటి చురకులు వేస్తూనే ఉన్నంతలో అందరూ నాయకుల కంటే చంద్రబాబే నయమన్నట్లుగా మాట్లాడారు. ఎన్టీఆర్ ఎవరిని నిలబెట్టినా గెలిచేవారు, కానీ, ఇప్పుడు చంద్రబాబుకు ఆ పరిస్థితి లేదు... ఆయన ఇమేజితో కొంత ఓట్లు వస్తే మిగతాది ఎమ్మెల్యేలు - ఎంపీలు సంపాదించుకుని గెలవాలని మాత్రమే అన్నానని జేసీ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు... మహాత్మాగాంధీ పేరు అసలు ప్రస్తావించనే లేదని కుండబద్ధలు కొట్టి మరీ చెప్పారు. అయితే.. అధికారులకు చంద్రబాబు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారని.. ప్రజాప్రతినిధులకు కూడా ప్రయారిటీ ఇవ్వాలని అన్న తన వ్యాఖ్యలకు మాత్రం కట్టుబడ్డారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ బతకడం అసాధ్యమని... జయలలిత ఆరోగ్యం బాగుందని రోజూ ప్రకటించేవారని.. కానీ, చివరకు ఆమె చనిపోయిందని.. కాంగ్రెస్ బలపడుతోందని ఎన్నిసార్లు చెప్పినా అదంతా ఉత్తిమాటలేనని.. పార్టీ బతకదని తేల్చేశారు. కాంగ్రెస్ ను సోనియా కబంధ హస్తాల నుంచి బయటకు తెస్తేనే బాగుపడే ఛాన్సుంటుందని తాను కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచే చెబుతున్నానన్నారు. రాహుల్ వల్ల - ప్రియాంక వల్ల కూడా ప్రయోజనం లేదని అన్నారు. తాను మళ్లీ పార్టీ మారబోనని... కావాలంటే రాజకీయాలను మానుకుంటాను కానీ పదేపదే పార్టీలు మారబోనని ప్రకటించారు.
    
పవన్ కల్యాణ్ విషయంలోనూ ఆయన తన అభిప్రాయం ప్రకటించారు. పవన్ రాజకీయాల్లోకి రావడం అనవసరమన్నారు. అలా అని ఆయన్ను రావొద్దని చెప్పడమూ తన ఉద్దేశం కాదన్నారు.  చంద్రబాబు టీడీపీకి తలలాంటి వ్యక్తని... ఆయనకు చేతులు - కాళ్లు వంటి ఎమ్మెల్యేలు సహకరించి, మంచి పనులు చేస్తే మళ్లీ గెలుస్తామన్నారు. అంతేకాదు... జగన్.. రాజశేఖర్ రెడ్డిని మహా నేత అంటూ కీర్తించడం తప్ప ఇంకేమీ చేయడం లేదని, అలాంటప్పుడు ఆయన వచ్చే ఎన్నికల్లోనూ గెలవలేరని తేల్చేశారు. జగన్ నాయకత్వంలో లోపం ఉందన్నారు. అది సరిదిద్దుకుని, అందరినీ కూడగట్టుకుంటే, చంద్రబాబు కంటే మంచి కార్యక్రమాలు చేస్తానన్న నమ్మకం కల్పిస్తే ఫలితం ఉంటుందన్నారు. పట్టిసీమ డైవర్షన్ వల్ల రాయలసీమకు అంతో ఇంతో నీరు వస్తోందని.. దాన్ని జగన్ వద్దంటున్నారని.. అలాంటప్పుడు రాయలసీమలో ప్రజలు ఆయన్ను ఎందుకు నమ్ముతారన్నారు. పట్టిసీమ నుంచి చంద్రబాబు 40 టీఎంసీలు ఇస్తానన్నప్పుడు జగన్ 100 టీఎంసీలు ఇస్తామని చెబితే జగన్ ఓకే అంటారు కానీ, అదంతా మానేసి మా తాతలు నేతులు తాగారు మా మూతులు చూడండి అంటూ మహానేత అంటూ తండ్రిపేరు చెప్పుకొంటూ ఓట్లు అడిగితే లాభం లేదన్నారు.
    
అనంతపురం జిల్లాలో అధికారులు తన మాట వినకపోవడం వల్లే చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారా అన్న ప్రశ్నకు మాత్రం ఆయన ఖండించారు. తన మాట బ్రహ్మాండంగా చెల్లుబాటువుతోందని ఆయన చెప్పుకొచ్చారు. అక్కడ రోడ్ల విస్తరణ సమస్య నేపథ్యంలో జేసీ అసహనంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఆరోపణలను కూడా ఆయన ఖండించారు.
    
సీఎంపై తనకు మంచి అభిప్రాయం ఉందని.. ఇంకా చెప్పాలంటే సానుభూతి ఉందని... ఆయనకు గతంలోనూ అదే చెప్పానని.. ఆయన నిద్ర లేకుండా, మనవడితో ఆడుకోకుండా 24 గంటలూ పాలన, రాష్ట్రం అనుకుంటూ వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతున్నారని అన్నారు. పాలన, ప్రభుత్వం అనుకుంటూ అధికారులతోనే ఎక్కువ టైం వెచ్చిస్తున్నారు కానీ ప్రజాప్రతినిధులకూ కాస్త టైం ఇవ్వాలన్నారు.
    
అలాగే తనకు ఎవరూ వ్యతిరేకుల్లేరని... కేవలం ఒక్క ఎమ్మెల్యే ప్రభాకరరెడ్డితోనే సరైన సంబంధాలు లేరని అంగీకరించారు. పరిటాల సునీతతో తనకు ఎలాంటి ఇబ్బందుల్లేవని... ఆమె ఎన్నడూ తన నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడం కానీ, తాను చేపట్టే పనులకు అడ్డు తగలడం కానీ చేయలేదని.. తనకు వ్యతిరేకంగా ఏనాడూ ఒక్క మాట కూడా అనలేదని.. అనవసరంగా ఆమెకు, తనకు తగాదా పెట్టొద్దని జర్నలిస్టులకు సూచించారు.
    
తెలంగాణ, ఏపీల్లో రెడ్లను ఏకీకకరణ చేయాలనుకుంటున్నారా అని అడగ్గా... ఏకీకరణా పాడా.. రెడ్లందరినీ తిట్టివచ్చానని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుతో రాయలసీమకు చేసిన అన్యాయంపై వారి వద్ద అసంతృప్తి వ్యక్తంచేయడానికే తెలంగాణ అసెంబ్లీలోకి వెళ్లి అక్కడి నేతలను కలిశానని చెప్పారు.
    
కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తి చచ్చిపోయిందని.. 10 అడుగుల గుంత తీసి పూడ్చారని.. తెలంగాణలో కోమాలో ఉందని.. అక్కడా చచ్చిపోతుందని.. అందుకే తామంతా ఇతర పార్టీలకు వచ్చేశామని అన్నారు. రెడ్డి సామాజికవర్గాన్నంతటినీ కలిపి రాజకీయం చేయాలన్న ఉద్దేశం లేదని.. రాయలసీమకు అన్యాయం జరగడానికి రెడ్లే కారణం కాదని, అందుకే వారిని తిడుతున్నానని అన్నారు. వేరెవరిపైనా తాను నిందలు వేయడం లేదని చెప్పారు.

చివర్లో జర్నలిస్టులపైనా సెటైర్లు వేశారు. పురాణాల్లో ఒక్క నారదుడే ఉండేవాడని.. ఇప్పుడు జర్నలిస్టుల రూపంలో వందలమంది నారదులు ఉన్నారని అన్నారు.
Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Tags:    

Similar News