జేసీ సంచ‌ల‌నం!..పీకేతో పాటు జ‌గ‌న్‌ తోనూ స్నేహ‌మేన‌ట‌!

Update: 2019-01-04 13:27 GMT
ఏంటీ?... ఈ హెడ్డింగులేంటీ?... ఈ వార్త‌లేంటీ?... అని ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు కురిపిస్తారా?. ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఒక్క‌టే. టీడీపీ సీనియ‌ర్ నేత‌ - అనంత‌పురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి లాంటి నేత‌లు ఉన్నంత కాలం ఈ త‌ర‌హా వార్త‌లు రాకూడ‌ద‌నేది ఏమీ లేదు. ఎందుకంటే... నోటీకి ఏది వ‌స్తే...అదే మాట‌ను ప‌లికేసే జేసీ లాంటి నేత‌ల నోట నుంచి ఈ త‌ర‌హా సంచ‌ల‌నాత్మ‌క ప్ర‌క‌ట‌న‌ల‌కు కొద‌వేమీ లేద‌నే చెప్పాలి. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో పొత్తు పెట్టుకున్న బీజేపీతో టీడీపీ నేత‌లు త‌మ‌కు తాముగా దూరం జ‌రిగారు. గ‌డ‌చిన ఎన్నిక‌ల‌కు కాస్తంత ముందు నుంచి ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత నాలుగేళ్ల దాకా బీజేపీ మంచిగానే క‌నిపించింది. 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కీల‌క త‌రుణంలో అప్ప‌టిదాకా మంచిగా క‌నిపించిన ఆ పార్టీ ఇప్పుడు టీడీపీ నేత‌ల‌కు ద్రోహిగా క‌నిపించింది. వెంట‌నే ఆ పార్టీతో మైత్రికి గుడ్ బై కొట్టేశారు. అప్ప‌టిదాకా ఆ పార్టీ నేత‌లు - ప్ర‌త్యేకించి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని కీర్తించిన నోళ్ల‌తోనే ఇప్పుడు టీడీపీ నేత‌ల‌తో పాటు ఆ పార్టీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు కూడా గ‌తంలో ఎన్న‌డూ లేనంత స్థాయిలో దూషిస్తున్నారు. అదే స‌మ‌యంలో అప్ప‌టిదాకా తాము దూషించిన కాంగ్రెస్ పార్టీతో మైత్రి కోసం చంద్ర‌బాబు త‌న సిద్ధాంతాల‌ను సైతం ప‌క్క‌న పెట్టేశారు.

అయితే మొన్న‌టి తెలంగాణ ఎన్నిక‌ల్లో టీడీపీ - కాంగ్రెస్ మైత్రిని జ‌నం జీర్ణించుకోలేని వాస్త‌వాన్ని గుర్తించిన చంద్ర‌బాబు... ఇప్పుడు కాంగ్రెస్‌ తో క‌లిసి ఎన్నిక‌లకు వెళ్లే ప‌రిస్థితిపై మ‌ల్లగుల్లాలు ప‌డుతున్నాయి. అయితే ఎన్నిక‌ల‌కు గ‌డువు త‌రుముకు వ‌స్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో... ఏదో ఒక పార్టీతో పొత్తు లేకుండా ఎన్నిక‌ల‌కు వెళ్లిన చ‌రిత్ర లేని చంద్ర‌బాబు ఇప్పుడు కూడా త‌మ‌తో క‌లిసి వ‌చ్చే పార్టీ ఏద‌ని లాంత‌రు వేసుకుని మ‌రీ వెతుకుతున్నారు. అయితే వెన్నుపోటు రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్రెస్‌ గా నిలిచిన చంద్ర‌బాబుతో మ‌రోమారు దోస్తీ క‌ట్టేది లేద‌ని గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో టీడీపీకి విజ‌యాన్నందించిన‌ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తేల్చి పారేశారు. వామ‌ప‌క్షాల‌తో మాత్ర‌మే తాము పొత్తు పెట్టుకుంటామ‌ని చెప్పిన ఆయ‌న అధికార టీడీపీతో గానీ - విప‌క్ష వైసీపీతో గానీ అస‌లు పొత్తే ఉండ‌బోద‌ని ప్ర‌క‌టించేశారు. అయినా కూడా రాష్ట్రం బాగు ప‌డాలంటే... త‌మ‌తో ప‌వ‌న్ క‌లిసి రావాల్సిందేన‌ని చంద్ర‌బాబు నిన్న కూడా సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌ల‌కు కేంద్ర బిందువుగా ఉన్న జేసీ దివాక‌ర్ రెడ్డి... ప‌వ‌న్‌ తో స్నేహానికి బాబు సై అంటుంటే... జ‌గ‌న్‌ తోనూ స్నేహానికి త‌మ‌కు అభ్యంత‌రం ఏమీ లేద‌ని ప్ర‌క‌టించేశారు.

పార్ల‌మెంటు స‌మావేశాల కోస‌మంటూ ఢిల్లీ వెళ్లిన జేసీ... స్పీక‌ర్ స‌స్పెన్ష‌న్ వేటు కార‌ణంగా పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లోనే త‌చ్చాడుతూ మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డిన జేసీ... ప‌వ‌న్‌ తో స్నేహంపై త‌న‌కెదురైన ప్ర‌శ్న‌ల‌కు అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తేలా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు - శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌ర‌న్న ఓ ప‌డిక‌ట్టు సామెత‌ను వినిపించేసిన జేసీ... ప‌వ‌న్ వ‌స్తానంటే రెడ్ కార్పెట్ వేసి స్వాగ‌తిస్తామ‌న్న రేంజిలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. *మాము మేముగా ప‌వ‌న్‌ను ఆహ్వానించ‌డం లేదు. ప‌వ‌న్ వ‌స్తే ఆయ‌న‌తో స్నేహానికి వెనుకాడబోం* అంటూనే వ‌ప‌న్‌ను ఆహ్వానించ‌మ‌ని మా సీఎంకు ఓ సారి చెబుతానంటూ వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా ఓ మీడియా ప్ర‌తినిధి... జ‌గ‌న్ పేరెత్త‌గానే త‌న‌దైన శైలిలో స్పందించిన జేసీ... ప‌వ‌న్ తో పాటే జ‌గ‌న్‌ తోనూ స్నేహానికి త‌మ‌కు ఇబ్బందే లేద‌ని చెప్పేశారు.

*మా వాడు జ‌గ‌న్ వ‌స్తే కూడా మిత్రుడిగా చేసుకుంటాం. ఇంకా మంచిది. ఎవ‌డొద్ద‌న్నాడండీ. రాజ‌కీయాల్లో శ‌త్రుత్వం ఎప్పుడూ ఉండ‌దు. మిత్రుత్వం ఎల్ల‌కాలం ఉండ‌దు. ప‌రిస్థితులకు అనుగుణంగా వెళ్లాలి. ఎస్‌... ఇఫ్ హీ క‌మ్స్ టుమారో. మా సీఎంకు చెప్పి ఆహ్వానిస్తాం*అని జేసీ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్ విన్న‌వెంటనే అక్క‌డి మీడియా ప్ర‌తినిధులు నోళ్లు వెళ్ల‌బెట్ట‌గా... ఇప్పుడు ఈ కామెంట్లు వింటున్న నెటిజ‌న్లు, తెలుగు ప్ర‌జ‌లు కూడా షాక్ కు గుర‌వుతున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయినా పార్టీ సిద్ధాంతాలు - రాద్ధాంతాల‌తో ఏమాత్రం ప‌ని లేకుండా త‌న నోటికి ఏది వ‌స్తే అది - తాను ఏమ‌నుకుంటే దానినే ప‌లికే జేసీ లాంటి నేత‌లు ఉన్నంత కాలం... ఈ త‌ర‌హా కామెంట్ల‌ను వింటూనే ఉండ‌క త‌ప్ప‌దేమో. అయినా జ‌గ‌న్‌ తో మైత్రికి సంబంధించి జేసీ నోట వినిపించిన మాట‌ల‌పై చంద్ర‌బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.


Full View

Tags:    

Similar News