జేసీ కొరడా మాటలు.. బాబు సైలెన్స్ బ్రేక్ ?

Update: 2016-03-26 12:07 GMT
కొంతమంది నేతల నోటి నుంచి వచ్చే మాటలు చాలా ఆసక్తికరంగా ఉండటమే కాదు.. పెద్ద చర్చకే తావిస్తాయి. అధినేత పట్ల అంతులేని విశ్వాసాన్ని ప్రదర్శించే నేతలకు భిన్నం జేసీ దివాకర్ రెడ్డి మాటలు ఉంటాయి. చెప్పాలనుకున్న మాటల్ని ఎలాంటి మొహమాట లేకుండా మాట్లాడేయటం జేసీకి అలవాటే. అయితే.. చాలాసార్లు ఆయన మాటలు మీడియాలో ట్విస్ట్ కావటంతో వివాదాస్పదంగా మారటం తెలిసిందే. కొద్దికాలంగా మీడియాకు దూరంగా ఉన్న ఆయన.. తాజాగా నోరు విప్పారు.

ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కొరడా బయటకు తీయాలని.. దాన్ని ఆయన ఝుళిపించాలని అప్పుడే అన్నీ విషయాలు దారికి వస్తాయని చెప్పుకొచ్చారు. చంద్రబాబును కొరడా తీయమని  తాను చాలాసార్లు చెప్పానని.. కానీ ఆయన తన మాట వినలేదన్నట్లుగా మాట్లాడారు. చంద్రబాబు కానీ కొరడా తీయకపోతే చివరకు ఆయనే ఇబ్బంది పడతారంటూ వ్యాఖ్యానించారు. బాబు కానీ కొరడా తీస్తే అంతా సెట్ అవుతుందని.. లేకుంటే అంతే సంగతులని చెప్పుకొచ్చారు. బాబు ఒక్కరే కష్టపడటంతోనే ప్రయోజనం ఉండదని.. పార్టీ ఎమ్మెల్యేలంతా కష్టపడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పిన జేసీ మాటల్ని వినాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పార్టీ నేతల విషయంలోనూ.. పాలనలోనూ బాబు కాస్త కటువుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న మాట ఎప్పటి నుంచో వినిపిస్తున్నదే. అయితే.. ఇలాంటి వ్యాఖ్యల్ని బాబు విననట్లుగా వ్యవహరించటం చాలా కాలంగా చూస్తున్నదే. కొరడా మాటలు జేసీ నోటి నుంచి రావటం.. ఏమీ పట్టనట్లుగా బాబు వ్యవహరించటం అలవాటుగా మారిందంటూ తెలుగు తమ్ముడు ఒకరు చేసిన వ్యంగ్య వ్యాఖ్య  ప్రస్తావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Tags:    

Similar News