టీడీపీ నేతలపై జేసీ ఫైర్

Update: 2021-09-11 12:05 GMT
తెలుగుదేశంపార్టీ నేతలపై సొంతపార్టీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫుల్లుగా ఫైర్ అయ్యారు. రాయలసీమలోని ప్రాజెక్టుల స్ధితిగతులపై నేతలంతా అనంతపురంలో సమావేశం పెట్టుకోవాలని టీడీపీ నేతలు అనుకున్నారు. దీనిలో భాగంగానే ఈరోజు సీనియర్ నేతలంతా హాజరయ్యారు. అయితే అనూహ్యంగా సమావేశంలో పాల్గొన్న నేతలపై జేసీ రివర్సులో ఫై అవ్వటంతో ఏమి చేయాలో మిగిలిన నేతలకు దిక్కుతోచలేదు. పార్టీలోని క్యాడర్ ను గాలికొదిలేసిన నేతలు ప్రాజెక్టుల పేరుతో సమావేశాలు జరపటమేంటి అని నిలదీశారు.

నరసరావుపేటకే లోకేష్ ను అనుమతించని పోలీసులు ఇపుడు ప్రాజెక్టుల దగ్గరకు వెళ్ళనిస్తారని నేతలు ఎలా అనుకున్నారన్న జేసీ ప్రశ్నకు ఒక్కరు కూడా సమాధానం చెప్పలేకపోయారు. పార్టీ పరిస్ధితి, కార్యకర్తలకు అండగా ఉండాలనే చర్చలపై సీనియర్  నేతలు సమావేశం కావాలి కానీ ప్రాజెక్టులపైన సమావేశం అవటం ఏమిటని నిలదీశారు. ప్రాజెక్టులపై నేతలు సమావేశమై ఏమి సాధించదలచుకున్నారన్న జేసీ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పలేకపోయారు.

పార్టీ బతికుండాలంటే ప్రాజెక్టులు కాదని కార్యకర్తలు అవసరమన్న విషయాన్ని నేతలు ఎప్పటికి గుర్తిస్తారంటు మండిపోయారు. ప్రాజెక్టులపైన ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎన్ని పోరాటాలు చేసినా ఉపయోగం ఉంటుందా అని గట్టిగా ప్రశ్నించారు. జిల్లాలో పార్టీకి ఓటుబ్యాంకు ఉంది కాబట్టే తాము నాయకులమయ్యామన్న విషయాన్ని అందరు గుర్తించాలన్నారు. ఇదే సమయంలో కార్యకర్తలకు అండగా ఉన్న నేతలంతెమందో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. టీడీపీకి కంచుకోట లాంటి జిల్లాను కొందరు సీనియర్ నేతలు నాశనం చేసేసినట్లు తీవ్రంగా మండిపోయారు.

మొత్తానికి నేతలు సమావేశమైన అజెండా ఒకటైతే సమావేశంలో జరిగింది మాత్రం ఇంకోటి. ఎవరూ ఊహించని విధంగా సొంత నేతలపైనే జేసీ ఫైర్ అవ్వటంతో ఏమి మాట్లాడాలో ఎవరికీ అర్ధంకాలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జిల్లాలోని చాలామంది నేతలతో జేసీ సోదరులకు ఏమాత్రం పడదు. అలాగని సోదరులను పక్కనపెట్టి జిల్లాలో చేయగలిగింది ఏమీలేదు. అలాగని మిగిలిన నేతలకు జేసీ బ్రదర్స్ పూర్తిగా సహకరిస్తారా అంటే అదీలేదు. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పిందాన్ని అంగీకరించలేక, ఖండించలేక మిగిలిన నేతలు నానా అవస్తలు పడ్డారు.
Tags:    

Similar News