వికేంద్రీకరణకు జేడీ మద్దతు.. కానీ.. ?

Update: 2021-12-05 10:45 GMT
జేడీ లక్ష్మీ నారాయణ. సీబీఐ మాజీ అధికారి. సమాజం పట్ల బాధ్యతగా ఆయన ఏదో చేయాలని తపించేవారు. అందుకే ఆయన ఎంతో సర్వీస్ ఉన్నా కూడా అత్యున్నతమైన ఉద్యోగానికి రాజీనామా స్వచ్చందంగా చేసి మరీ రాజకీయాల్లోకి వచ్చేశారు. జేడీ 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి ఏపీగా పోటీ చేసి ఓడినా సమాజ సేవను ఎక్కడా వదల్లేదు, పైగా రాష్ట్రానికి సంబంధించిన ప్రతీ అంశం మీద ఆయన తనదైన శైలిలో  స్పందిస్తున్నారు. తగిన సూచనలు సలహాలు ఇస్తున్నారు.

ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ఆయన న్యాయ పోరాటమే చేస్తున్నారు. మరో వైపు ఎలాంటి ప్రజా పోరాటాలకైనా ఆయన మద్దతు ఇస్తూ నేనున్నాను అంటున్నారు. ఇక అమరావతి రైతుల మహా పాదయాత్రకు జేడీ తాజాగా మద్దతు ఇచ్చారు. వారితో కలసి అడుగులో అడుగు వేస్తూ ముందుకు కదిలారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉండాలి. రాజధాని ఉంటేనే అభివృద్ధి సాగుతుంది అని ఏలికలకు చెప్పారు. అమరావతి రాజధానికి పూర్తి సపోర్ట్ చేశారు. ఏపీకి ఏడేళ్ళుగా సరైన రాజధాని లేదు, అమరావతిని రాజధానిగా ఎంచుకుని అభివృద్ధి చేసుకోవాలని ఆయన విలువలైన సూచనలనే ఇచ్చారు. అంతే కాదు పెట్టుబడులు రావాలీ అంటే కేరాఫ్ అడ్రస్ గా ఒక రాజధాని ఉండాల్సిన అవసరాన్ని కూడా గుర్తు చేశారు.

అమరావతి రాజధానిగా ఉంచుతూనే వికేంద్రీకరణకు కూడా బాటలు వేయాలని ఆయన అన్నారు. అయితే జేడీ మార్క్ వికేంద్రీకరణ వేరు. ఆయన అభివృద్ధి వికేంద్రీకరణ కోరుకుంటున్నారు. అధికార వికేంద్రీకరణ మాత్రం కాదు అంటున్నారు. రాజధానికి ఒక్క చోటనే ఉంచి అభివృద్ధిని మాత్రం అంతటా విస్తరించడం ద్వారా మూడు రాజధానుల సమస్యకు జేడీ పరిష్కారం చూపారనే అనుకోవాలి.

ప్రస్తుతానికీతే మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసిన వైసీపీ ప్రభుత్వానికి జేడీ లాంటి మేధావులు ఇచ్చిన సలహాలు, విలువైన సూచనలు పనికివస్తాయేమో చూడాలి. నిజంగా జేడీ మాత్రమే కాదు, విద్యావంతులు, ఏపీ మేలు కోరేవారు అంతా కూడా ఒక్కటే రాజధాని అంటున్నారు. అదే సమయంలో ఇతర ప్రాంతాలను కూడా విస్మరించకుండా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. మరి వైసీపీ పెద్దలు అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని చెబుతున్నారు. జేడీ లాంటి వారి అభిప్రాయాలను కూడా పరిశీలిస్తే విభజనతో ఇప్పటికే గాయాల పాలు అయిన ఏపీకి పూర్వ వైభవం వస్తుంది అంటున్నారు. చూడాలి మరి అంతా జై అమరావతి అంటున్నారు. వైసీపీ ప్రభుత్వ పెద్దలు కూడా పునరాలోచన చేస్తారా. వెయిట్ అండ్ సీ.
Tags:    

Similar News