హరీశ్ ఎక్కడ సీఎం అవుతాడోనని భయం!

Update: 2016-11-08 03:29 GMT
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బర్నింగ్ టాపిక్ ఏదైనా ఉందంటే.. అది సచివాలయం కూల్చుడే. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ సచివాలయాన్ని కూల్చేసి.. అత్యద్భుతమైన సచివాలయాన్ని నిర్మించాలన్నది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అయితే.. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అయినా ఎదుర్కోవాలని.. అడ్డుకోవాలన్నదే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల ఆలోచనగా చెప్పొచ్చు. తన సెంటిమెంట్ల కోసమే బంగారం లాంటి సచివాలయాన్ని కూల్చేస్తున్నారంటూ పలు రాజకీయ పక్షాలు తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోస్తున్నా.. అలాంటి వాటిని అస్సలు పట్టించుకోని రీతిలో కేసీఆర్ తన పని తాను చేసుకుంటూ పోవటం కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే.. సచివాలయం కూల్చివేత ఎందుకో తెలుసా? అంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి చెప్పిన లాజిక్ ఆసక్తికరంగా ఉండటమే కాదు.. కేసీఆర్ లోపలి కోణాన్ని ఆవిష్కరించేలా ఉండటం గమనార్హం. జీవన్ రెడ్డి చెప్పే లాజిక్ మొత్తం వింటే కన్వీన్స్ కావటమే కాదు.. సచివాలయం కూల్చివేతలో కేసీఆర్ ఎందుకంత పట్టుదలతో ఉన్నారన్న విషయంపై స్పష్టత వచ్చేలా తన వాదనను వినిపిస్తున్నారు.  

గతంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన వారి కుమారులు ఎవరూ ముఖ్యమంత్రులు కాకపోవటమే సచివాలయ కూల్చివేత విషయంలో కేసీఆర్ అంత పట్టుదలతో ఉన్నట్లుగా చెబుతున్నారు జీవన్ రెడ్డి. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన వారి కుమారులు ఎవరూ ముఖ్యమంత్రులు కాలేదు. కుమారులే కాదు.. వారి వారసులు సైతం ఆ తర్వాతి కాలంలో ముఖ్యమంత్రులు కాలేదు. ఒక్క చంద్రబాబు అల్లుడు మాత్రమే ముఖ్యమంత్రి అయ్యారు. అదే కేసీఆర్ ను ఇబ్బంది పెడుతోంది. తన తర్వాత తన కుమారుడ్ని ముఖ్యమంత్రిని చేయాలన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. సెంటిమెంట్ పరంగా చూస్తే.. కొడుక్కి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. ముఖ్యమంత్రి కుర్చీపై కన్నేసిన తన మేనల్లుడు హరీశ్ ఎక్కడ ముఖ్యమంత్రి పీఠం చేజిక్కించుకుంటారో అన్న అనుమానంతోనే వాస్తుదోషాన్ని సరి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందేహంతో నిపుణులను సంప్రదించి.. వాస్తు దోషం నివారిస్తే.. కొడుకు సీఎం అవుతారని కేసీఆర్ నమ్మి ఉంటారు. అందుకే ఆయన.. సచివాలయాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారు’’ అంటూ అందరూఅవాక్కు అయ్యే లాజిక్ ను విప్పి చెప్పారు జీవన్ రెడ్డి. సచివాలయం కూల్చివేత విషయంలో జీవన్ రెడ్డి లాజిక్ లో ఎంత నిజం ఉందన్న విషయాన్ని పక్కన పెడితే.. విన్నంతనే ఎవరైనా సరే కన్వీన్స్ అయ్యే పాయింట్ ను తెర మీదకు తెచ్చారనటంలో సందేహం లేదని చెప్పాలి.
Tags:    

Similar News