అరాచకపు జిలేబీ బాబా పాపం పండింది.. 14 ఏళ్లు జైలు

Update: 2023-01-12 05:32 GMT
మన దేశంలో దొంగ బాబాలకు.. ఫకీర్లకు కొదవలేదు. మాయమాటలు చెప్పి నిలువునా దోచుకునే ఇలాంటి ఎదవల పాపం కొన్నిసార్లు ఆలస్యంగా పండుతుంటుంది. తాజాగా ఆ కోవలోకే వస్తాడు జిలేబీ బాబా. అతగాడి మాటల్ని నమ్మిన పాపానికి.. జీవితానికి సరిపడా శిక్షను విధించే అతగాడి ఆరాచకాలకు చెక్ పెట్టేలా చేసింది న్యాయస్థానం.

తాజాగా అతడికి 14 ఏళ్లు జైలుశిక్ష విధించటం ద్వారా.. సామాన్య ప్రజలకు అతగాడి పీడ విరగడ అయినట్లేనని చెప్పాలి. తనను నమ్మి వచ్చిన మహిళలపై అత్యాచారాలకు పాల్పడటమే కాదు.. తమకు జరిగిన అన్యాయం గురించి బయటకు రాకుండా ఉండటం కోసం వారిని బెదిరింపులకు గురి చేసే అతడి పాపం పండింది. ఇంతకీ ఈ జిలేబీ బాబా ఎవడు? ఎక్కడివాడు? వారి ఆరాచకాలు ఏ స్థాయిలో ఉంటాయన్న విషయానికి వెళితే..

63 ఏళ్ల జిలేబీ బాబా అసలు పేరు అమర్ వీర్ అలియాస్ బిల్లూరామ్. హర్యానాకు చెందిన ఇతడి నివాసం ఫతేహాబాద్ జిల్లా తోహనా పట్టణం. పద్దెనిమిదేళ్ల వయసులో ఆ ఊరికి వచ్చిన అతడు మొదట్లో జిలేబీ అమ్మేవాడు.దీంతో అతడ్ని జిలేబీగా సుపరిచితుడు. తనకు తాంత్రిక విద్యలు తెలుసని చెప్పుకునే ఇతడు.. దెయ్యాల్ని వదిలిస్తానని చెప్పేవాడు. అతడి మాటల్ని నమ్మిన వారిని నిలువునా దోచేసేవాడు. తనను నమ్మి వచ్చిన మహిళలకు మత్తుమందు ఇచ్చి.. వారి స్ప్రహలో లేనప్పుడు అత్యాచారాలకు పాల్పడేవాడు. దానికి సంబంధించిన వీడియోలు తీసి బెదిరింపులకు దిగి.. తన పనులు కానిచ్చేవాడు. ఇతగాడి పాపం నాలుగేళ్ల క్రితం  బద్ధలైంది.

2018లో జిలేబీ బాబా పరిచయస్థుల్లో ఒకరి భార్యను ఆలయంలో అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలు బయటకు వచ్చాయి. అదే ఉదంతంలో అతడిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీంతో విచారణ మొదలు పెట్టిన పోలీసులకు.. మరిన్నిఫిర్యాదులు అందాయి. అలా మొదలైన పోలీసుల విచారణతో అతడి పాపాల పుట్ట పగిలింది. పలువురు బాధితులు అతడు చేసే ఆరాచకాల గురించి బయటకు చెప్పేందుకు ముందుకు వచ్చారు.

పోలీసులు ఈ దొంగ బాబా మొబైల్ ఫోన్ ను తనిఖీ చేయగా.. అందులో మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వీడియో దొరికింది. మరిన్ని సోదాల అనంతరం 120 మంది మహిళలకు సంబంధించిన అత్యాచారాల వీడియోలు పోలీసులకు లభ్యమయ్యాయి. అతడి ఇంట్లో సోదాలు చేసినప్పుడు మత్తు మాత్రలు.. మహిళలకు చికిత్స పేరుతో వారిని మోసం చేసేందుకు వినియోగించిన బూడిదలు లభ్యమయ్యాయి.

తన వద్దకు వచ్చే మహిళలకు మత్తు మందు ఇచ్చి వారిపై అత్యాచారాలకు పాల్పడేవాడు. వారిని బ్లాక్ మొయిల్ చేస్తూ.. తన పాపాలు బయటకు రాకుండా చూసుకునేవాడు. చివరికి పాపం పండటం.. అతడి నేరాలకు స్పందించిన న్యాయస్థానం అతడికి పద్నాలుగేళ్ల జైలుశిక్షను విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News