జిగ్నేష్ సంచ‌ల‌నం!... న‌న్ను చంపేస్తారు!

Update: 2018-02-24 07:49 GMT
ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి వెన్ను చూప‌ని ద‌ళిత నేత‌గా దేశ వ్యాప్తంగా పెను ప్ర‌చారం ద‌క్కించుకున్న యువ నేత‌ - ద‌ళిత ఉద్య‌మ నేత‌ - గుజ‌రాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.  ఎప్పుడు నోరు తెరిచినా ప్ర‌భుత్వాల‌పై ప్ర‌త్యేకించి బీజేపీ అధికారంలో ఉన్న కేంద్రం - రాష్ట్రాల‌కు సంబంధించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్న జిగ్నేష్ తాజాగా చేసిన వ్యాఖ్య మాత్రం పెను దుమార‌మే రేపుతోంద‌ని చెప్పాలి. ఇప్ప‌టికే గుజ‌రాత్ లో త‌మ మాట విన‌ని చాలా మందిని న‌రేంద్ర మోదీ ఆ రాష్ట్ర సీఎంగా ఉండ‌గా నిర్దాక్షిణ్యంగా ఎన్ కౌంట‌ర్ చేశార‌ని - దీనిపై కేసులు కూడా న‌మోదు కాగా.... అలాంటి కేసుల్లో ప్ర‌స్తుత బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు - మోదీ కేబినెట్ లో మంత్రిగా కొన‌సాగిన అమిత్ షా కూడా ఇరుక్కున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ కేసుల‌ను మాఫీ చేయించుకునేందుకు మోదీ అండ్ కో చాలా య‌త్నాలే చేసింద‌ని - ఈ క్ర‌మంలో చాలా ఘోరాలు కూడా జ‌రిగిపోయాయ‌ని ఇటీవ‌లే ప‌లు వార్త‌లు వెలువ‌డ్డాయి. అయితే ఈ వార్త‌ల‌కు సంబంధించి ఏ ఒక్క ఆధారం కూడా ల‌భ్యం కాని నేప‌థ్యంలో ఈ వార్త‌ల‌న్నీ పుకార్లుగానే మిగిలిపోయాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అయితే ఇప్పుడు జిగ్నేష్ చేసిన ఆరోప‌ణ‌లో మాత్రం ప‌క్కా ఆధారాలు ల‌భ్య‌మ‌య్యాయ‌ని, ఈ క్ర‌మంలో గుజ‌రాత్ లో బీజేపీ స‌ర్కారుకు చిక్కులు త‌ప్ప‌వ‌న్న వాద‌న వినిపిస్తోంది. అయినా జిగ్నేష్ చేసిన సంచ‌ల‌న ఆరోప‌ణ ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... త‌న‌ను ఎన్ కౌంట‌ర్ చేసేందుకు గుజ‌రాత్ స‌ర్కారు నిర్ణ‌యించుకొంద‌ని - ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వం నుంచి పోలీసుల‌కు కూడా ఆదేశాలు వెళ్లాయ‌ని, దానిపై ఓలీసులు చ‌ర్చించుకుంటున్న విష‌యం త‌న‌కు తెలిసింద‌ని జిగ్నేష్ ఆరోపించారు. త‌న‌ను చంపేసేందుకు ఏకంగా పోలీసులే ప‌థ‌క ర‌చ‌న చేసుకుంటుండ‌టంపై జిగ్నేష్ విస్మ‌యం వ్య‌క్తం చేశారు. త‌న‌ను ఎన్ కౌంట‌ర్ చేసేందుకు ఏకంగా పోలీసు బాసులు త‌మ అధికారిక వాట్సాప్ గ్రూపు(ఏడీఆర్‌ అండ్‌ మీడియా)ల్లో చ‌ర్చ‌లు నిర్వ‌హిస్తున్నార‌ని - దానికి సంబంధించి ప‌క్కా ఆధారం దొరికిన నేప‌థ్యంలోనే తాను ఈ ఆరోప‌ణ చేస్తున్నాన‌ని జిగ్నేష్ చెబుతున్నారు.

త‌న ఎన్ కౌంట‌ర్‌కు సంబంధించి ఇద్ద‌రు  పెద్ద పోలీస్‌ అధికారుల మధ్య చర్చకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. స‌ద‌రు ఆధారానికి సంబంధించిన వెబ్ పోర్ట‌ల్ లింకుల‌ను కూడా జిగ్నేష్ విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ వ్య‌వ‌హారంపై జిగ్నేష్ చేసిన ఆరోప‌ణ‌ల‌ను పోలీసులు ఖండించారు. అయితే త‌న వ‌ద్ద ప‌క్కా ఆధారాలున్నందున తాను దీనిపై గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి, హోం మంత్రుల‌కు ఫిర్యాదు చేస్తాన‌ని జిగ్నేష్ చెబుతున్నారు. మొత్తానికి త‌న‌ను చంపేసేందుకు పోలీసులే ప‌థ‌కం ర‌చిస్తున్నార‌ని స్వ‌యంగా ఓ ఎమ్మెల్యే వెల్ల‌డించ‌డం ఇప్పుడు నిజంగానే సంచ‌ల‌నంగా మారింది.

Tags:    

Similar News