అంత‌కోపం ఏల స్వామి ?!

Update: 2015-09-28 07:39 GMT
సుప్ర‌సిద్ధ న్యాయ‌వాది, బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి తాజాగా మరోసారి వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచారు. తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయ‌డం ద్వారా ఆయ‌న మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చారు. ఢిల్లీలోని జవహర్‌ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌ యు) వైస్ ఛాన్స లర్ పదవిని కేంద్ర మాన‌వ‌వ‌న‌రుల మంత్రిత్వశాఖ స్వామికి ఆఫర్ చేసిందని, కానీ ఆయన పదవిని చేపట్టాలంటే కొన్ని షరతులు పెట్టినట్లు మొద‌ట‌ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే తాము అలాంటి ప్ర‌తిపాద‌న ఏదీ చేయ‌లేద‌ని సంబంధిత‌ మంత్రిత్వశాఖ అమాత్యురాలు స్మృతి ఇరానీ ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో తాజాగా సుబ్రమణ్య స్వామిని మీడియా క‌లిసింది. జేఎన్‌ యు వైస్ ఛాన్సలర్ పదవికి మీ పేరును ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి కదా అని విలేకరులు ప్రశ్నించగా స్వామి ఒకింత ఆగ్ర‌హంగా స్పందించారు.

జేఎన్‌ యూలోని విద్యార్థులు - టీచర్లను నక్సలైట్లుగా ఆయ‌న‌ అభివర్ణించారు. విద్యార్థుల కంటే రాడిక‌ల్ భావాల‌కే వారు ప్రాధాన్యం ఇస్తున్నార‌ని మండిప‌డ్డారు. ప‌నిలోప‌నిగా భారత ప్రథమ ప్రధానమంత్రి జవహర్‌ లాల్ నెహ్రూ విద్యార్హతపై కూడా విమర్శ లు చేశారు. నెహ్రూ కంటే స్వాతంత్య్ర సమరయోధుడైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరింత విద్యావేత్త అని పేర్కొ న్నారు. అందువల్లే ప్రతిష్టాత్మకమైన యూనివర్శిటీకి జవహర్‌ లాల్ నెహ్రూ పేరును మార్చి సుభాష్ చంద్రబోస్ పేరును పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని చెప్పారు. అయితే స్వామి వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. నెహ్రూపై చేసిన విమర్శలను, యూనివర్శిటీకి పేరును మార్చాలని ఆయన చేస్తున్న డిమాండ్‌ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకానొక సమయంలో ఒక వెలుగువెలిగిన సుబ్రమణ్య స్వామి ప్రస్తుతం ఒక రాజకీయ జోకర్ అని కాంగ్రెస్ నాయకుడు సందీప్ దీక్షిత్ అన్నారు.
Tags:    

Similar News