రాజ్ భవన్ లో జాబ్ దందా.. గవర్నర్ సీరియస్

Update: 2019-11-07 04:36 GMT
రాష్ట్రానికి ప్రధమ పౌరుడైన గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్ భవన్ లోనే దుకాణం పెట్టేసిన ఘనుడి తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. ఏపీకి గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ ను నియమించటం తెలిసిందే. ఏపీ గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్ భవన్ లో పని చేసే సిబ్బంది ఎంపికను ఒక సంస్థకు అప్ప జెబితే..దాన్ని అవకాశంగా తీసుకొని లక్షలు వసూలు చేసిన వైనం ఇప్పుడు బయటకు వచ్చింది.

ఈ విషయం గురించి ఆరా తీసిన గవర్నర్ సీరియస్ కావటమే కాదు.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంచలంగా మారిన ఈ ఉదంతం లోకి వెలితే.. రాజ్ భవన్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించే కాంట్రాక్టును సుమతి ఏజెన్సీ దక్కించుకుంది. రాజ్ భవన్ లో ఒక్కో పోస్టుకు ఎంపిక చేయాలంటే లక్షల రూపాయిలు చెల్లించాలని కండీషన్ పెట్టాడు సుమతి ఏజెన్సీస్ యజమాని ముని శంకర్.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పించే క్రమంలో సుమారు 20 మంది వద్ద నుంచి ఒక్కో పోస్టుకు లక్షల్లో వసూలు చేసినట్లుగా చెబుతున్నారు. ఇక్కడితో ఆగని సదరు ముని శంకర్.. ఉద్యోగాలు పర్మినెంట్ చేయిస్తామని చెబుతూ.. మరోసారి దుకాణం తెరిచేశారు. దీంతో కడుపు మండిన కొందరు ఉద్యోగులు మునిశంకర్ ఆరాచకాల మీద ఫిర్యాదు చేశారు. దీంతో విషయం పెద్దాయన వరకూ వెళ్లింది. వెంటనే.. దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు.

ఉద్యోగ నియామకాల సమయంలో ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లు చేసినట్లుగా తేలుస్తూ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. దీనిపై సీరియస్ అయిన గవర్నర్ వెంటనే పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ విజయవాడ పోలీసు కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ముని శంకర్ మీద కేసు నమోదైంది. ఎంత బరితెగింపు కాకుంటే రాజ్ భవన్ ఉద్యోగాల రిక్రూట్ మెంట్ లోనే ఇంత దందా? అని ముక్కున వేలేసుకుంటున్నారు.
Tags:    

Similar News