ప్రాచీ ఈ కెలుకుడు ఆప‌వా..?

Update: 2018-08-04 04:50 GMT
ఏదోలా కెలుకుతూ ఉండ‌క‌పోతే సాధ్వీ ప్రాచీకి ఒక ప‌ట్టాన తోచ‌ద‌న్న‌ట్లుగా ఉంటుంది. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో ఎవ‌రో ఒక‌రి ఒళ్లు మండేలా మాట్లాడ‌క‌పోతే ఆమెకు నిద్ర ప‌ట్ట‌దు. అవ‌స‌రం ఉన్నా.. లేకున్నా.. త‌న‌కు తానే క‌ల్పించుకొని మ‌రీ వివాదాల్లోకి వెళ్ల‌టం ఆమెకు తెలిసినంత బాగా మ‌రెవ‌రికీ తెలీద‌ని చెప్పాలి.

ఇప్ప‌టివ‌ర‌కూ చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు భిన్నంగా ఆమె నోటి నుంచి ముస్లింలు మండిప‌డేలా ఆమె వ్యాఖ్య‌లు చేశారు. ముస్లిం మ‌హిళ‌లు హిందూ స‌మాజంలోకి రావాల‌ని.. హిందువుల‌ను పెళ్లి చేసుకోవాల‌న్నారు. అలా చేసిన ప‌క్షంలో వారికి త‌లాక్ గొడ‌వ ఉండ‌ద‌న్నారు. హ‌లాలా భ‌య‌మూ ఉండ‌ద‌ని చెప్పారు.

మ‌హిళ‌ల్ని నాశ‌నం చేసే మ‌త వ్య‌వ‌స్థ‌ను విడ‌నాడాల‌ని.. ఇస్లాంకు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పాల‌న్నారు. ఒక‌రి మ‌తం గొప్ప‌.. మ‌రొక‌రి మ‌తం చెడ్డ‌ద‌న్న‌ట్లుగా మాట్లాడ‌టానికి మించిన దుర్మార్గం మ‌రొక‌టి ఉండ‌దు. ఇదే రీతిలో ఎవ‌రైనా ముస్లిం పెద్ద మాట్లాడితే.. సాధ్వీ లాంటోళ్లు ఎంత‌లా ఫైర్ అవుతారో తెలిసిందే.

ఎవ‌రి మ‌తం వారికి అభిమానం స‌హ‌జం. అలాంట‌ప్పుడు మేం గొప్ప‌.. మీరు త‌క్కువ‌న్న‌ట్లుగా వ్యాఖ్య‌లు చేయ‌టం అభ్యంత‌ర‌క‌ర‌మ‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. ఒక మ‌తంలోని అబ్బాయిలు మంచోళ్లు.. ఉన్న‌త విలువ‌లు ఉంటాయ‌న్న మాట‌లు మాట్లాడ‌టం వారిని నొప్పించ‌ట‌మే కాదు.. త‌న‌లో ఏ మాత్రం మ‌త స‌హ‌నం లేద‌న్న విష‌యాన్ని ఆమె చెప్పేశారు.

ప్ర‌తి మ‌తంలోనూ మంచి ఉన్న‌ట్లే.. ఎంతో కొంత లోపాలు స‌హ‌జం. వాటిని కాలానికి త‌గిన‌ట్లుగా మార్చుకోవాలే కానీ.. ఆయా మ‌తాల వారి మ‌నోభావాలు దెబ్బ‌తినేలా మాట్లాడ‌టంలో అర్థం లేదు.  కానీ.. ఇదేమీ గుర్తించ‌నట్లుగా నోటికి వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడ‌టంతో కొత్త స‌మ‌స్య‌లు తలెత్తుతాయి. హిందూమ‌తంలో ఉన్న‌త విలువ‌లు ఉన్న అబ్బాయిలు మీకు దొరుకుతార‌ని ప్రాచీ చెప్ప‌టం అభ్యంత‌ర‌క‌రం. అదే నిజ‌మైతే.. హిందువుల్లో నేరాలు చేసే వారి మాటేమిటి?  ఒక మ‌తంలోనే మంచోళ్లు ఉంటార‌న్న‌ట్లు వ్యాఖ్య‌లు చేయ‌టం అనాగ‌రికం.

ఎవ‌రైనా స‌రే.. త‌మ మ‌తాన్ని పొగుడుకోవ‌టం త‌ప్పు కాదు. కానీ.. ఎదుటి వారి మ‌తాన్ని కించ‌ప‌రిచేలా.. త‌క్కువ చేసేలా.. చిన్న బుచ్చేలా మాట్లాడ‌టం సంస్కార‌మ‌నిపించుకోదు. ముస్లిం మ‌హిళ‌లు ఎదుర్కొనే ట్రిపుల్ త‌లాక్ లాంటి ఇష్యూ మీద త‌న‌కున్న వ్య‌తిరేక‌త‌ను వ్య‌క్తం చేయ‌టాన్ని ఎవ‌రూ అడ్డుకోరు. కానీ.. దాన్నో బూచిగా చూపిస్తూ.. హిందువు అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవాల‌ని మాట్లాడ‌టం స‌రికాదు. ఎవ‌రు ఎవ‌రిని పెళ్లి చేసుకోవాల‌న్న వ్య‌క్తిగ‌త విష‌యాల్లో సాధ్విగా చెప్పుకునే ప్రాచీకి అవ‌స‌ర‌మేంటి?
Tags:    

Similar News