చేతికి మ‌ట్టి అంట‌కుండా పాక్‌ కు చెక్ పెట్టిన భార‌త్‌

Update: 2017-09-04 13:42 GMT
చేతికి మ‌ట్టి అంట‌కుండా ప్ర‌త్య‌ర్థిని చావు దెబ్బతిన‌డం అంటే....అంత ఈజీ కాదు కదా?  కానీ స‌రిగ్గా భార‌త్ విష‌యంలో ఇప్పుడు అదే జ‌రిగింది.  పొరుగునే ఉన్నామ‌నే భావ‌న కూడా లేకుండా ఉగ్ర‌వాదంతో భార‌త్‌ ను ప‌రేషాన్ చేస్తున్న పాక్‌ కు చెక్ పెట్టింది. ప‌క్కా దౌత్య నీతితో కీల‌క రాజ‌కీయ‌వేదిక‌పై పాక్‌ ను దోషిగా నిల‌బెట్టింది. చైనాలో జ‌రుగుతున్న బ్రిక్స్ వార్షిక స‌మావేశాల్లో బ్రిక్స్ దేశాలు ఉగ్ర సంస్థ‌ల చర్య‌ల‌ను ఖండించాయి. ఉగ్ర చ‌ర్య‌ల‌ను ఖండిస్తూ ఇవాళ బ్రిక్స్ దేశాలు తీర్మానం చేశాయి. ఆ తీర్మాన్ని అన్ని దేశాలు స‌మ‌ర్థించాయి. దీంతో ఉగ్ర‌వాదంపై పోరు చేస్తున్న భార‌త్‌ కు దౌత్య‌ప‌ర‌మైన మ‌ద్ద‌తు ల‌భించింది. అది కూడా భార‌త్ ప్ర‌వేశ‌పెట్ట‌కుండానే బ్రిక్స్ దేశాలు ఈ తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టి ఆమోదించాయి.

బ్రెజిల్ అధ్య‌క్షుడు టీమ‌ర్‌ - ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌ - చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌ పింగ్‌ - ద‌క్షిణాప్రికా అధ్య‌క్షుడు జాక‌బ్ జుమోతో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఈ స‌మావేశాల్లో పాల్గొంటున్నారు.  తాజాగా స‌మావేశంలో  తాలిబ‌న్‌ - ఐసిస్‌ - ఆల్ ఖ‌యిదా - హ‌క్కానీ - ల‌ష్క‌రే తోయిబా - జైషే మొహ‌మ్మ‌ద్ లాంటి ఉగ్ర‌ సంస్థ‌ల‌ను బ్రిక్స్ దేశాలు ఖండించాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌రుగుతున్న అన్ని ఉగ్ర దాడుల‌ను బ్రిక్స్ దేశాలు త‌ప్పుప‌ట్టాయి. అయితే ఇందులో ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామం ఏమిటంటే..పాకిస్తాన్‌ కు వ్య‌తిరేకంగా భార‌త్ ఎలాంటి తీర్మానం ప్ర‌వేశ‌పెట్ట‌కుండానే...పాకిస్తాన్‌ కు షాకిచ్చే తీర్మానానికి చైనా మ‌ద్ద‌తు ఇచ్చింది. ప్ర‌ముఖ తీవ్ర‌వాద సంస్థ అయిన జైషే మహ్మద్ సంస్థ చీఫ్ మహ్మద్ సయీద్‌ పై ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర పడకుండా కాపాడుతూ వచ్చింది. ఇదే విష‌యాన్ని గ‌త ఏడాది జ‌రిగిన గోవా స‌ద‌స్సులో ప్ర‌ధాని మోడీ ప్ర‌స్తావిస్తే చైనా భిన్నంగా స్పందించింది కానీ ప్ర‌స్తుతం అదే చైనా..త‌న‌దేశం సాక్షిగా సాగుతున్న స‌ద‌స్సులో పాకిస్తాన్ కేంద్రంగా సాగుతున్న ఉగ్ర‌వాదంపై మండిప‌డింది. మన ప్రధాని మోడీ ప్రస్తావించకుండానే బ్రిక్స్‌ వేదికపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం గురించి ప్రకటించడం భారత్ కు చారిత్రాత్మక విజయమేన‌ని అంటున్నారు.

మ‌రోవైపు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. శాంతి - అభివృద్ధికి పరస్పర సహకారం అవసరమ‌ని అన్నారు.. మౌలిక వసతుల కల్పన - త్వరితగతిన అభివృద్ధికి ఎన్‌ డీబీని స్థాపించడం జరిగిందని తెలిపారు. పేదరిక నిర్మూలన - ఆరోగ్యం - పారిశుద్ధ్యం లక్ష్యంగా పనిచేస్తున్నాం. నైపుణ్యాభివృద్ధి - ఆహారభద్రత - విద్య - అన్ని వర్గాలకు సమానత్వం కల్పిస్తున్నామని వెల్లడించారు. బలమైన బ్రిక్స్ దేశాల కూటమే అభివృద్ధికి చిహ్నమని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మ‌ధ్య స‌హ‌కారం ఉంటేనే శాంతి - అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌ని ప్ర‌ధాని మోడీ అన్నారు. ఆవిష్క‌ర‌ణ‌లు - డిజిట‌ల్ ఎకాన‌మీ లాంటి అంశాల్లో బ్రిక్స్ దేశాల మ‌ధ్య స‌హ‌కారం ఉండాల‌ని, అప్పుడే పార‌ద‌ర్శ‌క‌త‌ - ప్ర‌గ‌తి సాధ్య‌మ‌వుతుంద‌ని మోడీ వివ‌రించారు.

బ్రిక్స్ సభ్య దేశాలు పరస్పరం విశ్వాసం - వ్యూహాత్మక సమాచార మార్పిడి పెంపొందించుకోవడంతోపాటు ప్రతి దేశం ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని చైనా అధ్యక్షుడు జీ జిన్‌ పింగ్ సూచించారు. సభ్య దేశాల మధ్య పరస్పర సహకారానికి విభేదాలను పక్కన బెట్టడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. పునాదులతోనే భారీ నిర్మాణం మొదలవుతుంది. బ్రిక్స్ మధ్య సహకారం కోసం అవసరమైన వ్యవస్థకు పునాదులు వేశాం. ఆర్థిక సహకారమే బ్రిక్స్ వ్యవస్థకు పునాది అని అన్నారు. ఉగ్రవాదం అన్ని రూపాలపై పోరుకు సమ్రగ విధానం అనుసరించాలని బ్రిక్స్ సభ్య దేశాలను చైనా అధ్యక్షుడు జీ జిన్‌ పింగ్ కోరారు. ఉగ్రవాద మూలాలు - లక్షణాలపై పోరు జరుపాల్సిందేనని, ఇందులో దాపరికమేమీ లేదన్నారు. ఉగ్రవాదులకు భూతల స్వర్గంగా మారిన పాకిస్థాన్‌ కు చైనా మిత్రదేశంగా మారిందని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో జీ జిన్‌ పింగ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
Tags:    

Similar News