సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు- ప్రొఫెసర్ ఐలయ్య షెఫర్డ్ రాసిన ఈ పుస్తకం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెను తుఫాను సృష్టించిన విషయం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. వైశ్యులు-దళిత సంఘాలు-సాధువుల సైతం వీధుల్లోకెక్కి మాటల తూటాలు పేల్చుకున్నారు. ధర్నాలు - రాస్తారోకోలతో రాష్ట్రాలు దద్దరిల్లేలా చేశారు. ఐలయ్య పుస్తకంపై నిషేధం విధించాలని - ఆయనను అరెస్టు చేయాలని - జైలుకు పంపాలని ఇలా వైశ్యులు - ఐలయ్యకు ఏదైనా జరిగితే అది వైశ్యులు చేసినట్టేనని దళితులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. విషయం సుప్రీం కోర్టు గడప తొక్కంది. అనూహ్యంగా ఎవ్వరూ ఊహించనట్టుగా.. ఐలయ్య పుస్తకంపై నిషేధం విధించడం సాధ్యం కాదని అత్యున్నత న్యాయస్థానం తేల్చేసింది. ఐలయ్య పుస్తకం భావప్రకటన కిందకి వస్తుందని స్పష్టం చేసింది. ఇక, దీంతో ఈ వివాదానికి తెరపడుతుందని అందరూ అనుకున్నారు.
అయితే, ఐలయ్యపై మండి పడుతున్న వారు మాత్రం సుప్రీం తీర్పుతో లోలోన రగిలిపోతున్నారు. అయినా.. పైకి మాత్రం గుంభనంగా ఉంటున్నారు. మరికొందరు చాలా లౌక్యంగా మాట్లాడుతూ.. ఐలయ్యను ఎత్తిపొడుస్తున్నారు. తాజాగా ఐలయ్య పుస్తకంపై మరోసారి స్పందించారు ప్రముఖ సినీ రచయిత - కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు. సుప్రీం తీర్పును ఎంత మాత్రమూ తప్పు పట్టకుండా ఐలయ్యకు కాలేలా స్టేట్ మెంట్ ఇచ్చారు. సుప్రీం తీర్పు అనంతరం.. ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఐలయ్య రాసిన పుస్తకంలో ఉన్న సారాంశాన్ని పిటిషనర్లు సరైన విధంగా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లలేదని తాను అనుకుంటున్నట్లు తెలిపారు.
అలాగే, ఆ పుస్తకాన్ని భావ ప్రకటనా స్వేచ్ఛ కింద రాసుకున్నారని సుప్రీంకోర్టు చెప్పింది కానీ, ఆ పుస్తకంలో రాసిందంతా యథార్థం అని ఎక్కడా చెప్పలేదని అన్నారు. ఐలయ్య పుస్తకం రాసిన విధానం భావస్వేచ్ఛ పరిధిలో ఉన్నదని మాత్రమే చెప్పిందని వ్యాఖ్యానించారు.అందులో భావం.. కులాలను, మతాలను అవహేళన చేసేలా ఉందని చెప్పారు. దీంట్లో ఉన్న విషయాలని స్పష్టంగా సుప్రీంకోర్టు ముందుకు తీసుకెళితే, దీనివల్ల విద్వేషాలు చెలరేగుతున్నాయని పిటిషనర్లు సరిగా చెబితే అప్పుడు సుప్రీంకోర్టు భావ ప్రకటనా స్వేచ్ఛ విషయం అంటూ కాకుండా వేరే కోణంలో విచారణ జరిపేదని అన్నారు. మొత్తానికి జొన్నవిత్తుల కోణంలో ఈ వివాదాన్ని మరో కోణంలో కోర్టుకు తీసుకువెళ్లాలని సూచిస్తున్నట్టే ఉంది. మరి ఈ కామెంట్ ఒక రకంగా ఐలయ్యకు కాలేలాగేనే ఉంది కదా! మరి ఆయనేమంటారో.. జొన్నవిత్తులపై ఎలాంటి కామెంట్లు చేస్తారో చూడాలి!!