క్రికెటర్ బ్యాట్ పై బూతుపదం..ఐసీసీ వార్నింగ్

Update: 2018-06-04 13:42 GMT
ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే నేటి కాలంలో అసలైన హీరోయిజం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రపంచ క్రికెట్ లో ఎంతో ఎత్తుకు ఎదిగినా ఇప్పటికీ ఎంతో ఒద్దికగా.. పద్ధతిగా ఉంటాడు. అలా ఉంటాడు కాబట్టే క్రికెట్ గాడ్ గా పేరు తెచ్చుకున్నారు. కానీ ఇప్పటి నవతరం క్రికెటర్లు ఆటలో చూపించిన ఆవేశాన్ని బయట కూడా చూపిస్తూ అభాసుపాలవుతున్నారు. తాజాగా ఇంగ్లండ్ క్రికెటర్ బట్లర్ చేసిన పని విమర్శల పాలైంది.

ప్రస్తుతం పాకిస్తాన్ తో ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ ఇంగ్లండ్ వేదికగా జరుగుతోంది. మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన ఇంగ్లండ్ రెండో టెస్ట్ లో ఇన్నింగ్స్ తేడాతో పాకిస్తాన్ ఓడించి సత్తా చాటింది. ఇంగ్లండ్ విజయంలో బట్లర్ కీలకపాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా అవార్డు గెలుచుకున్నాడు. కాగా బట్లర్ బ్యాట్ పై ఉన్న అసభ్య పదజాలం కెమెరాకు చిక్కి అతన్ని ఇరకాటంలో పడవేసింది.

రెండో టెస్ట్ మ్యాచ్ మధ్యలో డ్రింక్స్ విరామ సమయంలో బట్లర్ తన హెల్మెట్ తో పాటు బ్యాట్ ను మైదానంలో ఉంచాడు. ఈ క్రమంలోనే బట్లర్ బ్యాట్ హ్యాండిల్ పై రాసిన అసభ్య పదజాలం కెమెరా కంటికి చిక్కింది. ఇది ప్రసారం కావడంతో నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ‘బట్లర్ బ్యాట్ పై ఏం రాసుకున్నాడో చూశారా’ అంటూ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు. అది వాడకూడని పదజాలం కావడంతో ఐసీసీ రంగంలోకి దిగి బట్లర్ కు వార్నింగ్ ఇచ్చింది. ఇలా మరోసారి వ్యవహరిస్తే శిక్ష విధిస్తామని మందలించింది. ఇలా బట్లర్ చేసిన పని ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. 
Tags:    

Similar News