వామ్మో..ఈ జ‌ర్న‌లిస్ట్ పైత్యం పీక్స్ కు చేరిందిగా!

Update: 2018-09-21 05:45 GMT
టార్గెట్ చేయ‌ట‌మే ల‌క్ష్యం. అందుకు త‌గ్గ‌ట్లు ఆవేశ‌పూరిత వ్యాఖ్య‌ల్ని సిద్ధం చేసుకుంటే స‌రి. వెనుకా ముందు చూసుకోక‌పోవ‌టం.. లాజిక్కులు వ‌గైరాలు ప‌ట్ట‌క‌పోవ‌టం ఈ మ‌ధ్య‌న ఎక్కువైంది. మీడియాను పూర్తిగా డామినేట్ చేసేసిన సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ఇప్పుడు ఎవ‌రైనా.. ఏ అభిప్రాయాన్ని అయినా చెప్పేసే వెసులుబాటు.. అవి కాస్తా వైర‌ల్ అయ్యే సెట‌ప్ ఇప్పుడుంది.

దీన్ని ఒక అవ‌కాశంగా తీసుకొని ఎవ‌రికి వారు చెల‌రేగిపోతున్నారు. నిజానికి ఇదంతా ఒకందుకు మంచిదే అయినా.. విచ‌క్ష‌ణ‌తో వ‌డ‌బోసే అవ‌కాశం మిస్ కావ‌టం పెద్ద లోపంగా చెప్పాలి. సామాన్యుల సంగ‌తి ఇలా ఉంటే.. ప్ర‌ముఖులు సైతం ఇందుకు ఏ మాత్రం త‌గ్గ‌ని రీతిలో బాధ్య‌తా రాహిత్యంతో చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారుతున్నాయి.

తాజాగా జ‌ర్న‌లిస్ట్ అభిజిత్ అయ్య‌ర్ మిత్రా మాష్టారి ముచ్చ‌టే చూడండి. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు లాజిక్ కు దూరంగా ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కాకుంటే.. రెచ్చ‌గొట్ట‌టానికి.. ఆ మాట‌ల్ని చూసి రెచ్చిపోవ‌టానికి స‌రిపోయే మ‌సాలా మాత్రం అత‌గాడి మాట‌ల్లో ద‌ట్టించిన‌ట్లుగా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇంత‌కీ అయ్య‌గారి మాట‌లేమంటే.. ప్ర‌ముఖ దేవాల‌యాల్లో ఒక‌టైన  కోణార్క్ దేవాల‌యం ఎంత‌మాత్రం కాద‌ట‌. అదో కామ‌కేళి స్థ‌లిగా ఆయ‌న అభివ‌ర్ణించారు.ఏంది సార్.. మ‌రీ అంత దారుణ వ్యాఖ్య‌లు చేస్తార‌న్న డౌట్ అక్క‌ర్లేదు.  త‌న వ్యాఖ్య‌ల వెనుక అస‌లు ఉద్దేశాన్ని చెబుతూ.. అక్క‌డి శిల్పాల్ని చూడాల‌ని.. మ‌హిళ‌లతో పురుషులు జంతువుల మాదిరి అంటూ శృంగార శిల్పాల్ని చూపిస్తూ దారుణ వ్యాఖ్య‌లు చేశారు.

ఈ శిల్పాల వ్య‌వ‌హార‌మంతా పెద్ద కుట్ర‌గా అభివ‌ర్ణిస్తూ.. హిందువుల‌కు వ్య‌తిరేకంగా ముస్లింలు చేసిన కుట్ర‌గా అభివ‌ర్ణించారు. హిందువుల‌ను కించ‌ప‌రిచేందుకు మాత్ర‌మే ఇలా చేశార‌ని.. అందుకే కొత్త‌గా నిర్మించుకునే అయోధ్య రామాల‌యంలో అలాంటి బొమ్మలు లేకుండా చూసుకుందామంటూ వ్యాఖ్య‌లు చేశారు.

ఆ మాట‌కు వ‌స్తే.. కోణార్క్ దేవాల‌యం ఏమిటి?  దేశంలోని ఎన్నో దేవాల‌యాల్లో ఆ త‌ర‌హా బొమ్ములు ఉన్నాయి. అవ‌న్నీ ముస్లిం పాల‌కుల ముందు నుంచే ఉన్న‌వి ఉన్నాయి. దేవాల‌యాల్లోని శృంగార శిల్పాల వెన‌క భారీ సంస్కృతి ఉంద‌న్న విష‌యాన్ని వ‌దిలేసి.. హిందూ.. ముస్లిం అంటూ చెత్త వాద‌న‌ను తెర మీద‌కు తీసుకొచ్చి భావోద్వేగాల్ని రెచ్చ‌గొట్ట‌టం స‌రికాద‌న్న వాద‌న వినిపిస్తోంది.


Tags:    

Similar News