బీఆర్ ఎస్.. భ్ర‌ష్టాచార రాక్ష‌సుల స‌మితి

Update: 2023-06-26 11:08 GMT
బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా.. తెలంగాణ అధికార పార్టీ బీఆర్ ఎస్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. బీఆర్ ఎస్ అంటే.. భ‌ష్టాచార రాక్షసుల స‌మితి అని అభివ‌ర్ణించారు. మహా జన్‌సంపర్క్ అభియాన్‌లో భాగంగా నాగర్‌కర్నూల్‌లో బీజేపీ నవసంకల్ప సభను నిర్వహించారు. ఈ సభకు నడ్డా హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. అలంపూర్‌ జోగులాంబ అమ్మవారికి నమస్కారములు అంటూ త‌న‌ ప్రసంగాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు దుఃఖంలో ఉన్నారని పేర్కొన్నారు.

తెలంగాణ‌లో సీఎం కేసీఆర్‌, ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్‌, ఆయ‌న కుమార్తె ఎమ్మెల్సీ క‌విత‌లు మాత్రమే సంతోషంగా ఉన్నారని జేపీ నడ్డా విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

9 ఏళ్ల మోడీ పాలనలో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి తెలంగాణ‌లోనూ అనేక చర్యలు చేపట్టామని వివరించారు. కేంద్రం 80 కోట్ల మంది ప్రజలకు రేషన్ అందిస్తోంద‌ని, వీరిలో తెలంగాణ పేద‌లు కూడా ఉన్నార‌ని న‌డ్డా చెప్పారు. తమ ప్రభుత్వం పేదలకు అంకితమని స్పష్టం చేశారు.  

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద.. 4 కోట్ల మందికి ఇళ్లు నిర్మించారని జేపీ నడ్డా తెలిపారు. బీజేపీ అధికారంలోకి రావ‌డంతో తెలంగాణలో అభివృద్ధి సాధ్యమని న‌డ్డా వివరించారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా రైతులకు ఏటా రూ.6,000 అందిస్తున్నామని.

కొవిడ్‌, ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడిందని, అయినా.. మోడీ దార్శ‌నిక‌త‌ను ప్ర‌ద‌ర్శించి.. ప్ర‌జ‌ల‌ను అన్ని విధాలా ఆదుకుంటున్నార‌ని తెలిపారు.  

ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీని గ్లోబల్‌ లీడర్‌గా ప్రపంచమంతా కొనియాడుతుందని నడ్డా వివరించారు. కేంద్రం చేపట్టిన సంస్కరణలతో దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిందని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పదో స్థానంలో ఉన్న భారత్‌ను.. ప్రధాని ఐదో స్థానంలోకి తెచ్చారని పేర్కొన్నారు. మోడీ ముందుచూపు చర్యలతో భారత ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టంగా మారిందని నడ్డా వ్యాఖ్యానించారు.

సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య వందేభారత్‌ను మోడీ ప్రారంభించారని, అయితే.. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను పిలిచినా.. త‌ప్పించుకుని తిరిగార‌ని న‌డ్డా విమ‌ర్శ‌లు గుప్పించారు.

తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం రూ.4,400 కోట్లు మంజూరు చేసిందని న‌డ్డా వివరించారు. అయితే. ఈ విష‌యాన్ని కేసీఆర్ కానీ, మంత్రి కేటీఆర్ కానీ, ఎక్క‌డా చెప్ప‌ర‌ని.. ఇది రాజ‌కీయం కాదా? అని ప్ర‌శ్నించారు.

తెలంగాణ ప్రజల కోసం మెగా టెక్స్‌టైల్స్‌ పార్కును కేంద్రం ఇచ్చిందని జేపీ నడ్డా వెల్లడించారు. దీనిని కూడా త‌మ ఘ‌న‌తేన‌ని కేసీఆర్‌, ఆయ‌న కుమారుడు ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు.

Similar News