హెలికాఫ్ట‌ర్‌ లో రోహ‌త‌క్ జైలుకు జ‌డ్జి!

Update: 2017-08-28 03:57 GMT
యావ‌త్ దేశాన్ని ఉలిక్కిప‌డేలా చేసిన డేరా చీఫ్ గుర్మీత్ రాం ర‌హీమ్ సింగ్ కు ఈ రోజు శిక్ష ఖ‌రారు కానుంది. 50 ఏళ్ల ఈ బాబా.. దాదాపు 15 ఏళ్ల కింద‌ట త‌న ఆశ్ర‌మంలో ఉండే ఇద్ద‌రు మ‌హిళ‌ల్ని అత్యాచారం చేసిన నేరారోప‌ణ నిరూపితం కావ‌టం తెలిసిందే. ఈ కేసులో దోషిగా మారిన గుర్మీత్ కు ఈ రోజు శిక్ష‌ను ఖరారు చేయ‌నున్నారు.

ఒక‌టిన్న‌ర ద‌శాబ్దం క్రితం త‌న‌పై మోపిన నేరారోప‌ణ నిజ‌మ‌ని తేలిన సంద‌ర్భంగా వెల్లువెత్తిన హింస‌తో హ‌ర్యానా.. పంజాబ్ రాష్ట్రాలు అట్టుడిగిపోయాయి. డేరా చీఫ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నార‌న్న వార్త ఢిల్లీ.. రాజ‌స్తాన్‌.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లోని ప‌లు ప్రాంతాల్ని  ప్ర‌భావితం చేసింది. ఆయ‌న అభిమానులు రెచ్చిపోయిన తీరుతో శాంతిభ‌ద్ర‌త‌ల‌కు తీవ్ర విఘాతం క‌లిగింది.

గ‌ర్మిత్ కు విధించాల్సిన శిక్ష‌ను ఈ రోజు రోహ్ త‌క్ జిల్లాలోని సున‌రియా జైల్లోనే ఖ‌రారు చేయ‌నున్నారు. అత్యాచార కేసులో దోషి అన్న విష‌యాన్ని శుక్ర‌వారం ప్ర‌క‌టించిన జ‌డ్జి.. ఈ రోజు జైలులోనే ఎంతకాలం శిక్ష అన్న‌ది ఖ‌రారు చేయ‌నున్నారు. ఇందులో భాగంగా జైలులోనే అన్ని ఏర్పాట్లు చేశారు. గుర్మీత్‌ ను బ‌య‌ట‌కు తీసుకొస్తే శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లుగుతుంద‌న్న ఉద్దేశంతోనే ఈ ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు.

తీర్పును వెల్ల‌డించి నేప‌థ్యంలో.. శిక్ష‌ను ఖ‌రారు చేసేందుకు వీలుగా పంచ‌కుల సీబీఐ న్యాయ‌మూర్తి జ‌గ్ దీప్ సింగ్ ను ప్ర‌త్యేక హెలికాఫ్ట‌ర్ లో గుర్మిత్ ఉంటున్న జైలుకు వెళ్ల‌నున్నారు. గుర్మీత్‌కు శిక్ష ఖ‌రారు నేప‌థ్యంలో హ‌ర్యానాలో హింస చెల‌రేగే అవ‌కాశం ఉంద‌ని నిఘా వ‌ర్గాలు హెచ్చ‌రించాయి. ఈ గొడ‌వ‌లు కొన్ని రోజుల పాటు  కొన‌సాగే వీలుంద‌ని హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలో ఈ రోజు హ‌ర్యానాలోని స్కూళ్ల‌కు సెల‌వు ప్ర‌క‌టించారు. ఎలాంటి ఉద్రిక్త‌త ప‌రిస్థితులు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా పోలీసులు ప‌టిష్ట‌మైన బందోబ‌స్తును ఏర్పాటు చేశారు.

శిక్ష ఖ‌రారు నేప‌థ్యంలో పంచ‌కుల‌.. సిర్సాల‌తో పాటు రోహ్ త‌క్ చుట్టుప‌క్కల ప్రాంతాల్లో 144 సెక్ష‌న్ ను అమ‌ల్లోకి తీసుకొచ్చారు. గుర్మీత్‌ను విడుద‌ల చేయించేందుకు వీలుగా ఆయ‌న అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నార‌న్న విష‌యంపై స‌మాచారం అందుకున్న భ‌ద్ర‌తా వ‌ర్గాలు జైలుకు వెళ్లే అన్ని మార్గాల్లోనూ అంచెలంచెలుగా క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. రోహ్ త‌క్ రేంజ్ ఐజీ న‌వ్ దీప్ విర్క్ ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తున్నారు. తీర్పు నేప‌థ్యంలో ఢిల్లీలోనూ హైఅలెర్ట్ ను ప్ర‌క‌టించారు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో పంజాబ్‌.. హ‌ర్యానాల‌లోని ప‌లు ప్రాంతాల్లో నిలిపివేసిన మొబైల్ ఇంట‌ర్నెట్ సేవ‌ల‌పై నిషేధం కాన‌సాగుతోంది. మంగ‌ళ‌వారం ఉద‌యం 11.30 గంట‌ల వ‌ర‌కూ మొబైల్ ఇంట‌ర్నెట్ మీద నిషేధం కొన‌సాగ‌నుంది. ఇక‌.. విధ్వంస‌కాండ నేప‌థ్యంలో క‌ర్ఫ్యూ విధించిన ప‌లు ప్రాంతాల్లో ఎత్తివేశారు.  సిర్సాలో మాత్రం క‌ర్ఫ్యూ కొన‌సాగుతోంది.

ఇదిలా ఉండ‌గా సిర్సాలోని డేరా ప్ర‌ధాన‌కార్యాల‌యంలోనూ.. ఇత‌ర కేంద్రాల్లోనూ ల‌క్ష మంది వ‌ర‌కూ మ‌హిళ‌లు.. పిల్ల‌లు ఉంటార‌ని అంచ‌నా వేస్తున్నారు. వారంద‌రిని ప్ర‌త్యేక బ‌స్సుల్లో వారి వారి ఇళ్ల‌కు త‌ర‌లిస్తున్నారు. డేరా కేంద్రాల‌న్నింటిని ఖాళీ చేయాల‌ని ఆర్మీ.. పారామిల‌ట‌రీ బ‌ల‌గాలు ఆదేశించాయి. శిక్ష‌ను ఖ‌రారు చేసిన త‌ర్వాత‌.. డేరా ప్ర‌ధాన కేంద్రంలో సోదాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న స‌మాచారం ప్ర‌కారం గుర్మీత్ కు ఏడేళ్ల వ‌ర‌కూ శిక్ష విధించే వీలుంద‌ని చెబుతున్నారు.


Tags:    

Similar News