'సుప్రీం'నే త‌న ముందు హాజ‌రు కావాల‌న్నాడు

Update: 2017-04-14 05:14 GMT
మొండిత‌నం.. మూర్ఖ‌త్వం పీక్స్ లో ఉన్న వ్య‌క్తి కీల‌క స్థానంలో ఉంటే ప‌రిణామాలు ఎలా ఉంటాయ‌న‌టానికి కోల్ క‌తా హైకోర్టు జ‌డ్జి జ‌స్టిస్ క‌ర్ణ‌న్ తీరు చూస్తే ఇట్టే అర్థ‌మైపోతుంది. ఇప్ప‌టికే అర్థం లేని తీరుతో వ్య‌వ‌హ‌రిస్తూ.. సుప్రీంకోర్టు ఓర్పుకు ప‌రీక్ష పెట్టిన ఆయ‌న‌.. తాజాగా మ‌రింతగా చెల‌రేగిపోయారు. సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్‌ ను - మరో ఐదుగురు జడ్జిలను త‌న ఇంటి ముందు హాజ‌రుకావాల‌న్న ఆయ‌న‌.. మ‌రోసారి ప‌తాక శీర్షిక‌లకు ఎక్కారు. గురువారం సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తితో స‌హా సుప్రీంకోర్టుకు చెందిన న్యాయ‌మూర్తులు త‌న ఎదుట హాజ‌రు కావాల‌న్న విచిత్రమైన హుకుం జారీ చేశారు.

త‌న‌కు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసిన ధ‌ర్మాస‌నంలోని జ‌డ్జిలంద‌రినీ త‌న ఎదుట ఈ నెల 28న తన ఇంటి వద్ద హాజ‌రుకావాలంటూ క‌ర్ణ‌న్ ఆదేశాలు జారీ చేయ‌టం సంచ‌ల‌నంగా మారింది. ఏడుగురు జ‌డ్జిల‌తో కూడిన ధ‌ర్మాస‌నం త‌న‌ను ఉద్దేశ‌పూర్వ‌కంగా అవ‌మానించార‌ని పేర్కొన్న ఆయ‌న‌.. ఏడుగురు జ‌డ్జిల మీదా ఎస్సీ.. ఎస్టీ అత్యాచార‌ నిరోధక చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు ప్రకటించారు. వారంతా త‌న ఎదుట‌కు వ‌చ్చి త‌మ వాద‌న‌లు వినిపించాల‌న్నారు.

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తితో పాటు.. మ‌రో ఆరుగురు సుప్రీంకోర్టు జ‌డ్జిల‌ను త‌న రెసిడెన్షియ‌ల్ కోర్టుకు హాజ‌రు కావాల‌ని వెల్ల‌డించిన ఆయ‌న వైఖ‌రిపై విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. త‌న ఆదేశాల ప్ర‌కారం వారంతా ఏప్రిల్ 28 ఉద‌యం 11.30 గంట‌ల‌కు హాజ‌రు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది మార్చి 31న సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ జేఎస్ ఖేహ‌ర్ త‌న మాన‌సిక ప‌రిస్థితి గురించి ప్ర‌శ్నించార‌ని.. దీనిని మిగిలిన ఆరుగురు న్యాయ‌మూర్తులు ఆమోదించార‌ని.. ఇదంతా త‌న‌ను అవ‌మానించ‌ట‌మేన‌న్న ఆయ‌న‌.. బ‌హిరంగ కోర్టులో త‌న‌ను అవ‌మానిస్తారా? అని ప్ర‌శ్నించారు. కోర్టు ధిక్కార నేరంలో ఒక హైకోర్టు న్యాయ‌మూర్తి సుప్రీం కోర్టు ఎదుట హాజ‌రు  కావ‌టం దేశ చ‌రిత్ర‌లోనే జ‌స్టిస్ క‌ర్ణ‌న్ ఇష్యూలో చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. మ‌రి.. క‌ర్ణన్ తాజా హుకుం మీద సుప్రీం ఎలా రియాక్ట్ అవుతుంద‌న్న‌ది ఇప్పుడు ఉత్కంట‌గా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News