అరెస్ట్ అయిన జ‌స్టిస్ క‌ర్ణన్ ఇప్పుడెక్క‌డ‌?

Update: 2017-06-22 04:58 GMT
మాట జారి.. కోర్టు ధిక్కార నేరానికి జైలుశిక్ష ప‌డిన తొలి హైకోర్టు న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ క‌ర్ణ‌న్ రికార్డుల్లోకి ఎక్క‌టం తెలిసిందే. కోల్ క‌తా హైకోర్టు న్యాయ‌మూర్తిగా ఉన్న ఆయ‌న‌.. ఇటీవ‌లే రిటైర్ అయ్యారు. సుప్రీంను ధూషించట‌మే కాదు.. అత్యున్న‌త న్యాయ‌స్థానానికి చెందిన జ‌డ్జిల విష‌యంలో ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరు అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారింది. కోర్టు ధిక్కార నేరానికి సంబంధించి ఆర్నెల్లు జైలుశిక్ష ప‌డిన జ‌స్టిస్ క‌ర్ణ‌న్‌.. తీర్పు వ‌చ్చిన త‌ర్వాత నుంచి ప‌త్తా లేకుండా పోయారు.

ఆయ‌న ఆచూకీ కోసం గ‌డిచిన కొద్ది రోజులుగా కోల్ క‌తా పోలీసులు చేస్తున్న ప్ర‌య‌త్నాలు అన్ని ఇన్ని కావు. చివ‌ర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం ఆయ‌న త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరులో ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు.. ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం ఆయ‌న్ను కోల్‌క‌తాకు త‌ర‌లించారు.

కోల్ క‌తా ఎయిర్ పోర్ట్‌కు చేరిన వెంట‌నే ఛాతీ నొప్పితో బాధ ప‌డుతున్న‌ట్లుగా జ‌స్టిస్ క‌ర్ణ‌న్ చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. దీంతో.. వైద్య బృందాన్ని ఎయిర్ పోర్ట్‌కు తెప్పించి ప‌రీక్ష‌లు జ‌రిపారు. ఆయ‌న ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేద‌ని వైద్యులు చెప్ప‌టంతో ఆయ‌న్ను కోల్ క‌తా ప్రెసిడెన్సీ జైలుకు త‌ర‌లించారు. జైలుకు వెళ్లిన వెంట‌నే ఛాతీ నొప్పి ఎక్కువ అయ్యిందంటూ విల‌విల‌లాడిన‌ట్లుగా చెబుతున్నారు.

దీనికి తోడు హైబీపీ కూడా ఉంద‌ని చెప్ప‌టంతో ఆయ‌న్ను వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే.. ఆయ‌న్ను ఆసుప‌త్రిలో చేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఉందా? లేదా? అన్న‌ది ఇప్ప‌టికిప్పుడు చెప్ప‌లేమ‌ని చెబుతున్నారు. మ‌రోవైపు క‌ర్ణ‌న్ దాఖ‌లు చేసిన బెయిల్ పిటీష‌న్‌ను సుప్రీం తిర‌స్క‌రించింది. జైలుశిక్ష‌ను అనుభ‌వించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వెంట‌నే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చిన జ‌స్టిస్ క‌ర్ణ‌న్ ఆసుప‌త్రిలో ఉండ‌నున్నారా? జైలుకు వెళ్ల‌నున్నారా? అన్న‌ది తేలాల్సి ఉంది.
Tags:    

Similar News