జర జాగ్రత్త బాబు:రాయలసీమ రాజుకుంటోంది

Update: 2015-10-21 06:22 GMT
ఓపక్క ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన హడావుడితో ఏపీ సందడిగా మారింది. ఇంతటి ఉత్సాహ వాతావరణంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమరావతి శంకుస్థాపన సందర్భంగా తాము నిర్లక్ష్యానికి గురయ్యామన్న వేదనను రాయలసీమ వాసుల్లో కలగటం కొంత ఆందోళన కలిగించే అంశం.

మన మట్టి.. మన నీరు లాంటి కార్యక్రమం నిర్వహించినా.. ఏపీలోని అన్నీ గ్రామాల నుంచి అమరావతి శంకుస్థాపన కోసం మట్టిని.. పవిత్ర జలాల్ని సేకరించి అమరావతికి చేర్చినా.. సీమ నేతల్లో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది.

ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర అన్యాయానికి గురైన తాము.. విభజన తర్వాత కూడా పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నామన్న వేదన వ్యక్తమవుతోంది. ఏపీకి చెందిన సీమ మేదావులు.. రాజకీయ నేతలు తమ అసంతృప్తిని ప్రత్యక్షంగానూ.. పరోక్షంగానూ ప్రస్తావిస్తున్నారు.

రాయలసీమ అభ్యుదయ సమితి పేరుతో మాజీ న్యాయమూర్తి లక్ష్మణ రెడ్డి గవిర్నర్  నరసింహన్ ను కలిసి రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించే ప్రయత్నం చేశారు. మద్రాస్ స్టేట్ నుంచి విడిపోయిన సమయంలో జరిగిన శ్రీభాగ్ ఒప్పందంతో మొదలు పలు అంశాల్ని ఉల్లంఘన కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే విభజన కారణంగా ఏపీ దారుణంగా నష్టపోయిందని.. ఇలాంటి సమయంలో రాయలసీమ వాసుల అసంతృప్తి ఏమాత్రం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీమ నేతల.. ప్రజల ఆంధోళనల్ని.. భయాల్ని పరిగణలోకి తీసుకోకుండా ఉంటే.. రానున్న రోజుల్లో మరిన్ని సమస్యలు తప్పవు. తెలంగాణ విభజనకు కారణమైన ప్రజల అసంతృప్తి సీమ వాసుల్లో మరింత పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉంది.
Tags:    

Similar News