లాయర్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన హైకోర్టు జడ్జి

Update: 2016-11-07 04:36 GMT
న్యాయవాదులపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఉభయ రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి ఒకరు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారటమే కాదు.. అలాంటి వారు ఎవరు? అన్న సందేహం కలిగేలా చేస్తున్నాయటంలో సందేహం లేదు. కొందరు న్యాయవాదులు అంటూ హైకోర్టు జడ్జి జస్టిస్ నాగార్జున రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టి పడేలా చేస్తున్నాయి. విశాఖ జిల్లా చోడవరంలో ఏర్పాటైన తొమ్మిదో అదనపు జిల్లా కోర్టును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక సభను ఏర్పాటు చేశారు. సభను ఉద్దేశించి ప్రసంగించిన హైకోర్టు న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యల్ని చేశారు.

ఇటీవల కాలంలో కొన్ని కేసుల్లో తీర్పులు వెలువరించిన తర్వాత జడ్జిలపై కొందరు న్యాయవాదులు దారుణమైన అభాండాలు వేస్తున్నారని.. వారి మనుగడ కోసం జడ్జిల వ్యక్తిత్వాన్ని దెబ్బ తీయటానికి సైతం కొందరు న్యాయవాదులు వెనుకాడటం లేదన్నారు. ‘‘ఉభయ రాష్ట్రాల్లో న్యాయవ్యవస్థలో కొన్ని బ్లాక్ షీప్స్ ఉన్నాయి. ఇటు జడ్జిల్లో.. అటు న్యాయవాదుల్లో ఇలాంటి వారు ఉన్నారు. న్యాయవాదుల్లో చాలామంది వ్యవస్థకు బద్ధులుగానే ఉన్నారు. కానీ.. కొందరు మాత్రం న్యాయవ్యవస్థకు చాలా ప్రమాదకరంగా తయారయ్యారు. వీరి చేస్తున్న పనులు న్యాయవ్యవస్థకు ప్రమాదకరంగా మారాయి. వీరు న్యాయవ్యవస్థకు సవాల్ గా మారారు. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేందుకు సైతం వెనుకాడటం లేదు. జడ్జిలను కూడా టార్గెట్ చేస్తున్నారు. వారిపై అనవసర ఆరోపణలు చేసి బురద జల్లుతున్నారు. న్యాయవ్యవస్థకు ఇదేమాత్రం తగదు. ఇలాంటి శక్తులు చేస్తున్న చేష్టలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది’’ అని వ్యాఖ్యానించారు.

జడ్జిలు ఇచ్చిన తీర్పులపై అభ్యంతరం ఉంటే వాటిని హైకోర్టుకు లేదంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే అధికారం లాయర్లు ఉందన్న జస్టిస్ నాగార్జున రెడ్డి.. అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా జడ్జిల గౌరవాన్ని మంటగలిపేలా వ్యవహరిస్తున్నారన్నారు. న్యాయవ్యవస్థపై రానురాను నమ్మకం తగ్గిపోతుందని.. దాన్ని నివారించాల్సిన బాధ్యత జడ్జిలు.. లాయర్ల మీదే ఉందన్నారు. ఇక.. న్యాయవ్యవస్థను గౌరవించాల్సిన లాయర్లు ఆందోళనలు చేయటంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఆర్టికల్ 141 ప్రకారం లాయర్లు ట్రేడ్ యూనియన్ కార్మికులు కానే కాదని.. వారికి సమ్మె చేసే హక్కు లేదన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకించటం గమనార్హం. ఇలాంటి ఆందోళనల కారణంగా కోర్టు సమయం వృధా అవుతుందని.. కోర్టు విధులకు ఆటంకం కలిగించే లాయర్లపై ఆయా బార్ కౌన్సిళ్లు నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News