జగన్ ను మార్చలేకపోయాను..

Update: 2016-05-23 10:04 GMT
జ్యోతుల నెహ్రూ..  కాపు సామాజికవర్గంలో ప్రధాన నేత. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నేతల్లో ప్రముఖుడు. టీడీపీలోనూ మంచి ఫొజిషన్లో ఉన్న సమయంలోనే చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలోకి కుల అభిమానంతో చేరిపోయారు. ఆ తరువాత చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో కలపడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన వైసీపీలో చేరారు. అయితే.. అక్కడ విభేదాలు రావడంతో తిరిగి తన పాతగూడు టీడీపీలోకి  వచ్చేశారు. జగన్ ను మార్చాలని చాలావరకు ప్రయత్నించినా అది సాధ్యం కాలేదని.. అందుకే టీడీపీలోకి వచ్చేసానని  జ్యోతుల చెబుతున్నారు. ఓ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తన రాజకీయ జీవితంలో మలుపులపై ఎన్నో ఆసక్తికర అంశాలు వెల్లడించారు.

టీడీపీతో కానీ, పార్టీ నాయకుడు చంద్రబాబుతోగానీ తనకెప్పుడూ విభేదాలు లేవని.. ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నవాళ్లలో తాను మొదటివాడిననని జ్యోతుల చెప్పుకొచ్చారు. కాపు సామాజిక వర్గానికి చెందిన చిరంజీవి.. సీఎం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో అటువైపు ఆసక్తి పెరిగి ప్రజారాజ్యంలో చేరాల్సి వచ్చిందని అప్పటి పరిస్థితులను చెప్పారు.  ఇప్పుడున్న రాజకీయాల్లో అన్నింటికీ డబ్బే ప్రధానం అయిపోయిందని... డబ్బులు ఖర్చుపెడితేగాని గెలవలేని పరిస్థితులు ఉన్నాయని జ్యోతుల చెప్పారు. వ్యాపారాల్లో తాను ఎంత నష్టపోయిందీ కూడా చెప్పుకొచ్చారు. అయితే.. తనకు డబ్బు సంపాదించాలన్న ధ్యాస లేదని చెప్పారు.

తాను తొలినుంచీ కాంగ్రెస్‌ వ్యతిరేకిని. చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌ లో విలీనం చేసేస్తానని చెప్పిన తర్వాత దానిని తానూ - సి.రామచంద్రరావు గట్టిగా వ్యతిరేకించినా చిరంజీవి వినలేదని చెప్పారు. దాంతో కాంగ్రెస్ లోకి వెళ్లకూడదని అనుకున్నానని.. అదే సమయంలో చంద్రబాబు నుంచి పిలుపు వచ్చినా కొందరు స్థానిక నేతలు మాత్రం తనను రానివ్వకుండా చేయాలని ప్రయత్నించడంతో ఆ ఆలోచన విరమించుకుని వైసీపీలో చేరానని చెప్పారు.

వైసీపీలో చేరిన తరువాత జగన్ లో లోపాలను గుర్తించి ఆయనలో మార్పు తీసుకొద్దామని విఫలమయ్యానని చెప్పారు. ఏం చెప్పినా జగన్ వినరని అన్నారు.  బడ్జెట్‌ సమావేశాల్లోనూ అసలు దేనిపైనా మాట్లాడనివ్వలేదు. నా సీట్లో నన్ను కూర్చోనిచ్చేవాడు కాదు. ‘ఈ సీట్లో కాకుండా పక్కన కూర్చో అన్నా’ అని చెప్పి తన పక్కన కూర్చోకుండా చేశారని ఆరోపించారు. ఎందుకంటే.. ‘చంద్రబాబు సింగిల్‌ సీట్‌ లో కూర్చుంటారు కాబట్టి.. నేనూ సింగిల్‌ గానే కూర్చుంటా’ అని చెప్పేవారు. చివరకు జగన్ తో విసిగిపోయి బయటకు వచ్చేశానని జ్యోతుల చెప్పుకొచ్చారు.
Full View



Tags:    

Similar News