బాబును క‌లిసిన జ్యోతుల నెహ్రూ

Update: 2016-03-28 08:57 GMT
టీడీపీ అధ్య‌క్షుడు - ఏపీ సీఎం చంద్ర‌బాబుతో వైకాపా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స‌మావేశ‌మ‌య్యారా? త‌న‌తో పాటు మ‌రో ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావులను తెలుగుదేశం పార్టీలో చేర్చుకునే అంశంపై చంద్రబాబుతో ఆయ‌న చ‌ర్చించారా? ఇందుకు బాబు అంగీకారం తెలిపారా? ఈ సందేహాల‌కు తెలుగుదేశంలోని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాలు అవున‌నే స‌మాధానం ఇస్తున్నాయి.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఆదివారం రాత్రి జ్యోతుల నెహ్రూ - సుబ్బారావులు చంద్రబాబును కలిశారు. టీడీపీలో చేరేందుకు నిర్ణ‌యం తీసుకున్న జ్యోతుల నెహ్రూ ముందుగా పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ తో చర్చలు జరిపారు. తమ డిమాండ్లన్నింటిని ఆయన ముందుంచారు. అనంతరం కొద్దిసేపు తూర్పుగోదావరి జిల్లా  జిల్లాకు చెందిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో మంతనాలు నిర్వహించారు. ఆ త‌ర్వాత‌ వీరిద్దర్నీ స్వయంగా యనమల వెంటబెట్టుకుని బాబు వద్దకు తీసుకెళ్ళారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌ను పార్టీలోకి రావాల్సిందిగా బాబు ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం ఇస్తామని, నియోజకవర్గాల అభివృద్ధికి సహకరిస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు.

జగ్గంపేట నుంచి ప్రాతి నిథ్యం వహిస్తున్న జ్యోతుల నెహ్రూ - ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఇద్దరూ తోడల్లుళ్ళు. రాజకీయంగా కూడా ఇద్దరూ దీర్ఘ చరిత్ర ఉన్నవారు.గత ఎన్నికల్లో ఇద్దరూ వైకాపా తరఫున పోటీ చేసి గెలుపొందారు. రెండూ పక్కపక్కనున్న సరిహద్దు నియోజక వర్గాలే. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఇద్దరూ వైకాపాను వీడి టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఇందుకు గత నాలుగైదు రోజులనుంచి చర్చలు నడుస్తున్నాయి. ఇంతవరకు వైకాపాలో నెహ్రూ కీలకంగానే వ్యవహరించారు. ఆ పార్టీ అసెంబ్లి ఉపనేతగా కూడా ఉన్నారు. జిల్లా అధ్యక్ష పదవి కూడా నిర్వర్తిస్తున్నారు. ఖాళీ అయిన ప్రజాపద్దుల సంఘం చైర్మన్‌ పదవిని ఆయన ఆశించి భంగపడ్డారు. పైగా అందుకు తగ్గ సామర్థ్యం నెహ్రూకు లేదంటూ పార్టీలో జరుగుతున్న ప్రచారానికి ఆయ‌న షాక్‌కు లోన‌య్యారు. ఈ సాకుతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో ప్రత్తిపాడు తెలుగుదేశం ఇన్‌చార్జి, జిల్లా దేశం అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు ఆకస్మిక మరణం పొందారు. దీంతో ఆ నియోజక వర్గంలో తెలుగుదేశానికి నాయకత్వ కొరత ఏర్పడింది. ఈ పరిస్థితుల్ని వీరిద్దరూ తమకనుకూలంగా మలచుకున్నారు. వైకాపా నుంచి టీడీపీలో చేరేందుకు నిర్ణయిం చుకున్నారు.

Tags:    

Similar News