కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కొచ్చే వాళ్లంతా జ‌గ‌న్ కాలేరురా బుజ్జా!

Update: 2020-03-11 16:30 GMT
నిన్న కాంగ్రెస్ కు రాజీనామా చేశాడో లేదో.. ఈ రోజు భార‌తీయ జ‌న‌తా పార్టీ తీర్థం పుచ్చేసుకున్నాడు జ్యోతిరాదిత్య సింధియా! పేరుకేమో రాజ‌వంశం. అందునా.. ద‌శాబ్దాలుగా రాజ‌కీయాల్లో తిరుగులేకుండా వెలుగుతున్న రాజవంశం. ఒక రాష్ట్రంలో కాదు.. వీరి బంధుగ‌ణం అటు రాజ‌స్థాన్ నుంచి ఇటు మ‌హారాష్ట్ర వ‌రకూ తిరుగులేని రాజ‌కీయ శ‌క్తులుగానే ఉంది. అది కూడా కేంద్ర‌మంత్రులు, ముఖ్య‌మంత్రుల స్థాయి సుమా! ఆస్తిపాస్తుల‌కు కొద‌వ‌లేదు. అనువంశికంగా వ‌చ్చిన జ‌నాద‌ర‌ణా ఉంది.

చెప్పుకోవ‌డానికి ఎంతో చ‌రిత్ర‌, రాజులు, రాణులు..యువ‌రాజులు.. అలాంటి వారిలో జ్యోతిరాదిత్య సింధియా కూడా ఒక‌రు. 49 యేళ్ల ఈ గ్వాలియ‌ర్ సంస్థాన‌పు ప్ర‌స్తుత రాజు..ఏదో ఒక పార్టీ స‌భ్య‌త్వం లేకుండా ఒక్క రోజు గ‌డ‌ప‌లేక‌పోయారు పాపం. కాంగ్రెస్ ఇప్పుడ‌ప్పుడే కేంద్రంలో అధికారంలోకి రాలేదని ఫిక్స‌య్యి, ఎలాగూ ఆ పార్టీ త‌ను కోరిన‌ట్టుగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప‌గ్గాలూ అప్ప‌గించ‌లేద‌ని.. ఫిక్స‌య్యి బీజేపీలోకి చేరిపోయారు.

అయితే సింధియా ఇలా త‌న చేత‌గానిత‌నాన్ని చాటుకున్నాడ‌నేది ఒక ప‌రిశీల‌న‌. అదెలాగంటే.. సింధియా సొంతంగా పార్టీ పెట్టుకోవాల్సింది. కాంగ్రెస్ అధిష్టానం త‌ను కోరుకున్న ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ఇవ్వ‌న‌ని చెప్పింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో సింధియాలో నిజంగానే చేవే ఉంటే.. ఎంచ‌క్కా కాంగ్రెస్ కు రాజీనామా చేసి, సొంతంగా పార్టీ పెట్టుకుని ఉంటే? క‌చ్చితంగా జాతీయ స్థాయిలో ఒక ప్ర‌భావవంత‌మైన శ‌క్తి గా ఉండేవాడు!

మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీనీ ఓడించారు. అలాగే కాంగ్రెస్ కూ గొప్ప విజ‌యం ఇవ్వ‌లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో సింధియా త‌ను బ‌య‌ట‌కు వెళ్లి పోయి సొంతంగా పార్టీ పెట్టుకుని.. త‌న వ‌ర్గాన్ని త‌యారు చేసుకుని, త‌న పార్టీని తృతీయ శ‌క్తిగా త‌యారు చేసుకుని ఉంటే ఆ క‌థ వేరు! అక్క‌డి రాజ‌కీయ ప‌రిస్థితుల్లో సింధియా సొంతంగా పార్టీ పెట్టుకుని ఉంటే.. అటు బీజేపీ ఆయ‌న‌తో బేరానికి వ‌చ్చేది, అలాగే కాంగ్రెస్ కూడా బేరానికి వ‌చ్చేది. అలా చేసి ఉంటే.. సింధియా కోరుకున్న సీఎం ప‌ద‌వి ద‌క్కేది కూడా!

అయితే ఇప్పుడు బీజేపీలోకి వెళ్లడంతో సింధియా ప‌రిస్థితి పెద్ద‌గా తేడా లేక‌పోవ‌చ్చు. రాజుగారు వ‌చ్చార‌ని బీజేపీ ఆయ‌న‌కు సీఎం సీటును ఇవ్వ‌దు, కాంగ్రెస్ కు పూర్తిగా దూరం అయిన‌ట్టే. మ‌హా అంటే రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం, కేంద్రంలో మంత్రి ప‌ద‌వి. కాంగ్రెస్ లోనే సింధియా కేంద్రంలో మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. అలాంటిది ఇప్పుడు అందులో ఆయ‌న‌కు మ‌జా ఏముంటుంది?

కాంగ్రెస్ కు తిరుగుబాటు చేస్తే చాల‌దు. ఆ త‌ర్వాత ఏం చేయాల‌నే దానిపైనా క్లారిటీ ఉండాలి. అలాంటి క్లారిటీతో, గ‌ట్టిగా నిలిచి, పోరాడి కాంగ్రెస్ ద‌యాదాక్షిణ్యాల అవ‌స‌రం లేకుండా సొంతంగా సీఎం అయిన నేత ఎవ‌రైనా ఉన్నారంటే.. అది వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్ర‌మే! కాంగ్రెస్ కు తిరుగుబాటు చేసిన వాళ్లంతా జ‌గ‌న్ లు కాలేర‌ని.. సింధియా బీజేపీ లో చేరిక‌తో స్ప‌ష్టం అవుతోంది!
Tags:    

Similar News