గుంటూరులోనే కేఏ పాల్ అస్సలు తగ్గలేదుగా?

Update: 2022-07-31 05:13 GMT
తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని ప్రముఖుల్లో కేఏ పాల్ ఒకరు. క్రైస్తవ మత ప్రబోధకుడిగా సుపరిచితులైన అతగాడు.. ప్రజాశాంతి పార్టీని పెట్టిన ఆయన మాటలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న ఆయన.. ఢిల్లీకి వెళ్లి అనూహ్యంగా అమిత్ షాతో భేటీ కావటం చాలామందికి సర్ ప్రైజింగ్ గా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా గుంటూరుకు వచ్చిన కేఏ పాల్.. మీడియాతో మాట్లాడారు.

ఎప్పటిలానే తన మాటల్లో హడావుడిని ప్రదర్శిస్తూ బోలెడన్ని విషయాల మీద తన వైఖరిని స్పష్టం చేశారు. తెలంగాణలో తనపై జరిగిన దాడితో తనకు 30 లక్షల ఓటర్లు పెరిగినట్లుగా పేర్కొన్నారు. తెలంగాణలో తనపై జరిగిన దాడితో రాజకీయ ముఖ చిత్రమే మారినట్లుగా పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్.. జగన్ లు కలిసి నడిస్తే బాగుండేదని.. కానీ వారిద్దరు కలిసి నడవటానికి ససేమిరా అంటున్నట్లు చెప్పారు.

ఏపీలో తనకు జగన్.. చంద్రబాబు.. పవన్ లతో పోలిస్తే తనకే ప్రజలు ఎక్కవగా సపోర్టు చేస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు. తననే ప్రజలు ముఖ్యమంత్రిని కావాలని కోరుకుంటున్నరాని.. తాను తెలంగాణలో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ నుంచి తాను పోటీ చేస్తానని.. తన లైఫ్ మొత్తంలో జగన్ కు సపోర్టు చేయనని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ కు కళ్లు నెత్తికి వచ్చినట్లుగా వ్యాఖ్యానించారు. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిని తానేనని చెప్పారు. ఒకవేళ తాను ప్రధానమంత్రిని అయితే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలకు మహర్దశగా అభివర్ణించారు. ఏపీకి స్పెషల్ ప్యాకేజీ.. స్పెషల్ స్టేటస్ ఇస్తానని వెల్లడించారు.

జనసేన అధినేత కమ్ తమ్ముడు పవన్ కల్యాణ్ తనతో కలిస్తే.. అతడ్ని ఏపీకి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పారు. మొత్తానికి పవన్ ను ముఖ్యమంత్రి చేసే సత్తా ఉందన్న విషయాన్ని చెప్పిన కేఏ పాల్ మాటలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. అతగాడి మాటల్లో సీరియస్ నెస్ కంటే కూడా కామెడీ పాళ్లు ఎక్కువగా ఉన్నాయన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. పవన్ ను సీఎం చేస్తానన్న కేఏపాల్ మాటలకు పవన్ ఏ రీతిలో రియాక్టు అవుతారో?
Tags:    

Similar News