తండ్రీ కొడుకులు న‌న్ను చూసి భ‌య‌ప‌డుతున్నారు: పాల్ గారి ఫైర్‌

Update: 2022-05-01 04:15 GMT
తెలంగాణ స‌ర్కారుపై ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు.. క్యామెడీ పొలిటిక‌ల్ కింగ్ కేఏ పాల్ త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు. బంగారు తెలంగాణ చేస్తామ‌న్నారు..కానీ, వెండి తెలంగాణ కూడా చేయ‌లేక పోయార‌ని అన్నారు. తండ్రీ కొడుకులు(కేసీఆర్‌, కేటీఆర్‌)కు త‌ను తెలియ‌దా? అని ప్ర‌శ్నించారు. త‌న‌ను చూసి వారు భ‌య‌ప‌డుతున్నార‌ని అన్నారు.

తన సభకు అనుమతి ఇవ్వకుండా రాహుల్ గాంధీకి ఎలా ఇచ్చారని   కేఏ పాల్ స‌ర్కారును ప్రశ్నించారు. తనను తెలంగాణకు రాకుండా చేయాలని కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి మరింత దోచుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను విమర్శించారు.

రైతుల కోసం ఉద్యమం చేస్తానని భయపడి తమ సభకు అనుమతి ఇవ్వలేదని పాల్ ఆరోపించారు. రాహుల్ గాంధీకి ఓటు బ్యాంకు లేదని తెలిసి అనుమతి ఇచ్చారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కంటే ముందే ఏప్రిల్ 22న సభకు అనుమతి కావాలని దరఖాస్తు చేశానని తెలిపారు. వరంగల్ పోలీసు క‌మిష‌న‌ర్‌ తరుణ్ జోషిని కలిసిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు.

``రాష్ట్రంలో ఎంత దౌర్జన్యం జరుగుతుందనడానికి ఇదే నిదర్శనం. మే 6న రైతు సభ పెడతామంటే కేటీఆర్ ఫోన్ చేసి కేఏ పాల్ ఎవరో తెలియదని చెప్తారా? రాహుల్ గాంధీ సభకు అనుమతి ఇవ్వడమేంటీ? నేనెవరో కమిషనర్కు తెలియదా? మీకు చదువొస్తే గూగుల్లో కేఏ పాల్ అని కొట్టి నేర్చుకోండి. ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయండి. గవర్నర్కు కూడా ప్రోటోకాల్ ఇవ్వట్లేదు. ఎనిమిదేళ్లు బీజేపీకి మద్దతిచ్చిన కేసీఆర్.. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి ఇప్పుడు మోడీ మీకు చెడు అయ్యాడా? బంగారు తెలంగాణను అప్పులపాలు చేసిన కేసీఆర్ సమాధానం చెప్పాలి? తెలంగాణను ఇంకా దోచుకోవడానికి ఇదంతా చేస్తున్నారా?`` అని ప్ర‌శ్నించారు.

బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్.. కనీసం వెండిగా కూడా మార్చలేకపోయాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. తెలంగాణలో రైతులు, నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మే 6న హనుమకొండ అర్ట్స్ కళాశాల మైదానంలో సభకు అనుమతి ఇవ్వాలని లేకుంటే కోర్టుకు వెళ్తానని కేఏ పాల్ హెచ్చరించారు.
Tags:    

Similar News