పాల్ కామెడీ... ఎవరు గెలిచినా 30 ఆయనవేనట

Update: 2019-05-20 13:46 GMT
ప్రజాశాంతి పార్టీ పేరిట ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్... ఏపీ జనాలకు తనదైన కామెడీని పంచారు. ఈ విషయంలో ఏ ఒక్కరికి కూడా ఎలాంటి డౌట్ అవసరం లేదనే చెప్పాలి. టీడీపీ - వైసీపీ - జనసేనల మధ్య మాటల తూటాలు పేలితే.. పాల్ మాత్రం ఆ వేడిమి నుంచి జనాలకు కాస్తంత ఉపశమనం ఇచ్చేలా తనదైన కామెడీని పంచారు. సరే... ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ముగిసింది. వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వచ్చేశాయి. ఈ ఫలితాలు కేంద్రంలో మరోమారు ఎన్డీఏదే అధికారం అని తేలగా... ఏపీ అసెంబ్లీలో మాత్రం కొన్ని టీడీపీకి అనుకూలంగా చెబితే... మరికొన్ని వైసీపీ అనుకూలంగా ఫలితాలను చెప్పాయి.

ఇక కింగ్ మేకర్ ను అంటూ జబ్బలు చరుచుకున్న జనసేనాని పవన్ కల్యాణ్ పెద్దగా రాణించే అవకాశాలే లేవని అన్ని సర్వేలు తేల్చేశాయి. జనసేనాని పరిస్థితే ఇలా ఉంటే... ఇక కేఏ పాల్ పరిస్థితి ఇంకెలా ఉంటుందో పెద్దగా ఆలోచించాల్సిన పనే లేదన్న వాదన వినిపించింది. అయితే ఆ వాదనలన్నింటినీ పక్కనపెట్టేసిన కేఏ పాల్... తాను కూడా ఎగ్జిట్ పోల్స్ చెబుతానంటూ వచ్చి మరోమారు కామెడీ పంచారు. ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారన్న విషయం తనకు తెలియదని, తన పార్టీ మాత్రం 30 సీట్లను ఖాయంగా గెలుచుకుంటుందని ఆయన చెప్పుకొచ్చారు. అంటే... కేఏ పాల్ ఎగ్జిట్ పోల్స్ ఆయన పార్టీ ప్రజాశాంతి వరకు మాత్రమే. ఇతర పార్టీలకు వచ్చే సీట్లను ఆయన అస్సలు ప్రస్తావించనే లేదు.

తన ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా పాల్ ఏమన్నారన్న విషయానికి వస్తే... ‘ఈ ఎలక్షన్ ఫ్రాడ్ అని నేను ముందుగానే చెప్పా. ఇప్పుడు అందరూ అదే చెబుతున్నారు. అన్ని ఓట్లు పడకపోయినా ఓ 70 నుంచి 80 శాతం ఓట్లు మాకే పడ్డాయి. కపిల్ సిబల్ లాంటి  వ్యక్తులు చెప్పినదాని ప్రకారం అమెరికా ఇంటెలిజెన్స్, రష్యన్ హ్యాకర్ల పాత్ర ఈ ఎన్నికల్లో ఉన్నట్లు స్పష్టమయింది. నేను ఇంకా ఇండియాలోనే ఉన్నాను. ఏపీలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరుతున్నా. అయితే ఇప్పుడు ఈసీలో ఓ కమిషనర్ అశోక్ లావాసాకు  సీఈసీ అరోరాతో అభిప్రాయభేదాలు ఉన్నాయి. ఏపీలో ఎన్నికలు రీకాల్ చేయాలని హైకోర్టుకు వెళితే పిటిషన్ ను కొట్టేశారు. ఇక మనకు సుప్రీంకోర్టే దిక్కు. ఏదేమయినా ఏపీలో మనకు 30 ప్లస్ సీట్లు వస్తాయి. టీడీపీకి 90-100 సీట్లు వచ్చినా, లేక వైసీపీకి 90-100 సీట్లు వచ్చినా మన 30 స్థానాలు మనకే ఉంటాయి’ అని పాల్ తనదైన విశ్లేషణను చెప్పారు.


Tags:    

Similar News