టీడీపీలో మ‌రో నేత‌కు వాట్సాప్ బిగ్ షాక్‌!

Update: 2019-02-11 07:26 GMT
సోష‌ల్ మీడియా దిగ్గ‌జం వాట్సాప్ ఏపీలో రాజ‌కీయ ప్ర‌కంప‌న‌ల‌కు తెర‌లేపుతోంది. టీడీపీ నేత‌లకు షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది. క‌డ‌ప జిల్లా తెలుగుదేశం నేత - ఎంపీ సీఎం ర‌మేశ్ అకౌంట్ ను స్తంభింప‌జేయ‌డం ద్వారా ఇటీవ‌ల క‌ల‌క‌లం సృష్టించిన వాట్సాప్ సంస్థ‌.. తాజాగా అదే పార్టీ - అదే జిల్లాకు చెందిన మ‌రో నేతకూ దిమ్మ‌తిరిగే షాకిచ్చింది.

క‌డ‌ప టీడీపీ అధ్య‌క్షుడు ఆర్‌.శ్రీ‌నివాస రెడ్డి వాట్సాప్ ఖాతా తాజాగా స్తంభించింది. తాను ఈ నెల 7వ తేదీ నుంచి వాట్సాప్ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోలేక‌పోతున్న‌ట్లు శ్రీ‌నివాస్ రెడ్డి తెలిపారు. ప‌లుమార్లు వాట్సాప్ యాప్ ను డిలీట్ చేసి తిరిగి ఇన్ స్టాల్ చేసుకునేందుకు తాను ప్ర‌య‌త్నించాన‌ని వెల్ల‌డించారు. అయితే - త‌న‌ ఖాతా బ్లాక్ అయిన‌ట్లు సందేశం వ‌స్తోంద‌ని పేర్కొన్నారు.

ఎంపీ సీఎం ర‌మేశ్ వాట్సాప్ ఖాతా కూడా ఇటీవ‌ల స్తంభించిపోయిన సంగ‌తిని శ్రీ‌నివాస్ రెడ్డి గుర్తుచేశారు. టీడీపీ నేత‌ల‌కే ఇలా జరుగుతుండ‌టం వెనుక చాలా అనుమానాలున్నాయ‌ని పేర్కొన్నారు. వైసీపీతో క‌లిసి బీజేపీ క‌డప టీడీపీ నేత‌ల‌పై ఇలాంటి దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని ఆరోపించారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ త‌మ క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ‌ను దెబ్బ‌తీయాల‌ని బీజేపీ-వైసీపీ కుట్ర ప‌న్నాయంటూ ధ్వ‌జ‌మెత్తారు.

వాట్సాఫ్ ఖాతాల విష‌యాన్ని తాము తేలిగ్గా తీసుకోబోమ‌ని శ్రీ‌నివాస్ రెడ్డి చెప్పారు. ఫిర్యాదు న‌మోదు చేసి పోరాడ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు. 19 ఏళ్లుగా తాను ఒకే ఫోన్ నంబ‌రును వినియోగిస్తున్నాన‌ని.. వాట్సాప్ నిబంధ‌న‌ల‌ను పక్కాగా పాటిస్తున్నాన‌ని తెలిపారు. ఇప్పుడు అక‌స్మాత్తుగా ఖాతాను స్తంభింప‌జేయ‌డ‌మేమిట‌ని ప్ర‌శ్నించారు. ఖాతా స్తంభ‌న కార‌ణంగా పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో త‌న క‌మ్యూనికేష‌న్ దెబ్బ‌తింటోంద‌ని వాపోయారు.

సాధార‌ణంగా అసాంఘిక కార్య‌క‌లాపాలు ప్రోత్స‌హించే వారి ఖాతాల‌ను వాట్సాప్ స్తంభింప‌జేస్తుంటుంది. ప‌క్కా సాక్ష్యాధారాలు ఉంటేనే అలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుంది. మ‌రి శ్రీ‌నివాస్ రెడ్డి విష‌యంలో వాట్సాప్ కు ఎవ‌రు ఫిర్యాదు చేశారు? ఎలాంటి సాక్ష్యాధారాల ఆధారంగా ఆయ‌న ఖాతాను సంస్థ స్తంభింప‌జేసింది? అనే ప్ర‌శ్న‌లు ప్ర‌స్తుతం ఆసక్తిక‌రంగా మారాయి
Tags:    

Similar News