కడియం సలహా; కేసీఆర్‌ మనసు దోచుకోవాలంటే..!

Update: 2015-07-06 04:46 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మనసు దోచుకోవాలంటే.? ఆయన ఆదరాభిమానాలు పొందాలంటే..? ఆయన మనసు దోచుకోవాలంటే? కోరుకున్న డిమాండ్లకు కేసీఆర్‌ సానుకూలంగా స్పందించాలంటే..? కేసీఆర్‌ నోటి నుంచి వరాల వర్షం కురిపించుకోవాలంటే..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు.

వరంగల్‌లోని విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా మహాసభకు హాజరైన కడియం శ్రీహరి.. కేసీఆర్‌ మనసు దోచుకునేందుకు కీలకమైన ఒక అంశాన్ని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి బోళా శంకరుడని.. ఆయన మనసు దోచుకోవటం చాలా ఈజీ అని చెప్పటమే కాదు.. అదెలా అన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఏదైనా సమస్యపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వద్దకు అందరూ కలిసి కట్టుగా వెళ్లి.. తమకున్న సమస్యల్ని ఏకరువు పెట్టాలే కానీ.. వారు కోరుకున్న దాని కంటే ఎక్కువ వరాల్నే కేసీఆర్‌ ఇస్తారని కడియం చెప్పారు.

కడియం మాట నిజమే. కానీ.. కొన్ని కండీషన్లు కచ్ఛితంగా ఉంటాయన్న విషయం మర్చిపోకూడదు. తమ సమస్యల గురించి ఏకరువు పెట్టాలని భావించే వారు తప్పనిసరిగా.. తాము ప్రస్తావించే అంశం పట్ల కేసీఆర్‌ అప్పటికే సానుకూలత ఉండి ఉండాలి. తాము ప్రస్తావించే అంశంపై కేసీఆర్‌ వైఖరిని అందుకు భిన్నంగా ఉంటే వరం తర్వాత.. ఆగ్రహానికి గురి కావటం ఖాయమన్న విషయాన్ని మర్చిపోకూడదని చెబుతున్నారు.

భోళా శంకరుడికి అనుగ్రహం ఎంత ఈజీగా పొందొచ్చొ.. ఆగ్రహం కూడా అంతే సులువుగా వస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదని టీఆర్‌ఎస్‌ నేతలు లోగుట్టుగా వ్యాఖ్య చేయటం గమనార్హం.

Tags:    

Similar News