వ‌ర్సిటీలు రాజ‌కీయ వేదిక‌లు కావొద్దా క‌డియం సాబ్‌

Update: 2017-07-17 04:47 GMT
చూస్తుంటే తెలంగాణ అధికార‌ప‌క్ష నేత‌లు త‌మ మూలాల్ని మ‌ర్చిపోయిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఇటీవ‌ల కాలంలో ఆ పార్టీ నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌లు కొన్ని చూస్తుంటే.. తాము ఎక్క‌డి నుంచి మొద‌ల‌య్యామా? అన్న విష‌యాన్ని మ‌ర్చిపోతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఆందోళ‌న‌లు ఎందుక‌ని ఆ మ‌ధ్య‌న గులాబీ నేత‌లు చెబితే.. మ‌రో నేత ముందుకెళ్లి విశ్వ‌విద్యాల‌యాల్లో ప‌ని చేసే వారికి రాజ‌కీయాలు ఎందుకని మాట్లాడ‌టం మ‌ర్చిపోకూడ‌దు. ఇదంతా ఒక ఎత్తు అయితే తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్య‌మంత్రి క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విశ్వ‌విద్యాల‌యాలు రాజ‌కీయాల‌కు వేదిక‌లు కాకూడ‌ద‌ని.. కేవ‌లం చ‌దువు.. రీసెర్చ్ (ప‌రిశోధ‌న‌)ల‌కు మాత్ర‌మే ప‌రిమితం కావాల‌ని చెప్పారు.

క‌డియం మాట‌లు విన్న వారంతా ఆశ్చ‌ర్యానికి గురి అవుతున్నారు. ద‌శాబ్దాల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్య‌మ దిశ‌ను.. ద‌శ‌ను మార్చింది ఉస్మానియా విశ్వ‌విద్యాల‌య విద్యార్థులే. ఉద్య‌మం వారి చేతుల్లోకి వెళ్లిన త‌ర్వాత తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర‌మైన భావోద్వేగానికి గురైన విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

రాష్ట్ర విభ‌జ‌నపై నాటి ఉమ్మ‌డి రాష్ట్రానికి వ్య‌తిరేకంగా ఉస్మానియా విశ్వ‌విద్యాల‌య విద్యార్థులు గ‌ళం విప్పి.. ఆందోళ‌న‌ల‌తో క‌దం తొక్కిన వేళ‌.. వారిని అణిచివేసేందుకు పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరు విమ‌ర్శ‌ల‌కు గురి కావ‌ట‌మే కాదు.. తెలంగాణ ఉద్య‌మాన్ని పీక్స్‌ కు వెళ్లేలా చేసింద‌ని చెప్పాలి. ఆ మాట‌కు వ‌స్తే.. ఇప్ప‌టి తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తే.. ఆ భావోద్వేగాన్ని రాష్ట్రం మొత్తాన్ని వ్యాపింప‌చేయ‌టంలో విద్యార్థులు కీల‌క భూమిక పోషించార‌న్న వాస్త‌వాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో కీల‌క భూమిక పోషించిన విద్యార్థుల బ‌లాన్ని క‌డియం మ‌ర్చిపోయారో ఏమో కానీ.. ఇప్పుడు మాత్రం ఆయ‌న విశ్వ‌విద్యాల‌యాలు రాజ‌కీయ వేదిక‌లుగా మార‌కూడ‌ద‌న్న ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేశారు. ప‌ద‌కొండు విశ్వ‌విద్యాల‌యాల‌కు చెందిన వీసీలు.. ఉన్న‌త విద్యామండ‌లి ఛైర్మ‌న్..  విద్యాశాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిల‌తో క‌లిసి స‌మీక్ష నిర్వ‌హించిన క‌డియం.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

విశ్వ‌విద్యాల‌యాలు కేవ‌లం చ‌దువుల‌కు కేంద్రంగా మారి సుహృద్భావ వాతావ‌ర‌ణం క‌ల్పించేలా చూడాల‌ని వీసీల‌ను కోర‌టం గ‌మ‌నార్హం. ప్ర‌పంచంలోని అత్యున్న‌త విశ్వ‌విద్యాల‌యాల‌తో విద్యా బోధ‌న‌కు సంబంధించిన అవ‌గాహ‌న ఒప్పందాలు కుదుర్చుకొని నాణ్య‌మైన విద్య‌ను అందేలా చూడాల‌ని క‌డియం చెప్పారు. వ‌ర్సిటీలు రాజ‌కీయ వేదిక‌లు కాకూడ‌ద‌న్న మాట‌లు చూస్తుంటే.. రానున్న రోజుల్లో విశ్వ‌విద్యాల‌యాల్లో నిర్వ‌హించే ఆందోళ‌న‌లు.. నిర‌స‌న‌ల‌కు క‌త్తెర వేసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News