టైం చూసి 'ఎల్లో' గోల మొద‌లైందే!

Update: 2018-04-18 11:16 GMT
ఏపీలో ఇప్పుడు ఎక్క‌డ చూసినా రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం పోరాటాలు జ‌రుగుతున్నాయి. అధికార టీడీపీ - కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మిన‌హా మిగిలిన అన్ని పార్టీలు - ప్ర‌జా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్య‌మాలు చేస్తున్నాయి. అయితే తాము రోడ్డెక్కి ఆందోళ‌న‌లు చేసేది లేద‌ని చెబుతున్న అధికార టీడీపీ... శాంతియుత నిర‌స‌న‌లు మాత్ర‌మే చేస్తామంటూ వింత పోక‌డ‌లు పోతోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో మొన్న‌టికి మొన్న టీడీపీ యువ‌నేత‌ - శ్రీ‌కాకుళం ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు సిక్కోలు రైల్వే స్టేష‌న్ లో మెరుపు దీక్ష‌కు దిగారు. రాత్రంతా రైల్వే స్టేష‌న్ లోనే ప‌డుకున్న రామ్మోహ‌న్‌... నిన్న మ‌ధ్యాహ్నం దీక్ష విర‌మించారు. అదే స‌మ‌యంలో నిన్న తూర్పుగోదావ‌రి జిల్లా కేంద్రం కాకినాడ‌లో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ప‌డ‌వ‌ల‌పై జనాన్ని ఎక్కించేసి వినూత్నంగా బోటు నిర‌స‌న‌కు దిగారు. టీడీపీ అనుకూల మీడియా ఈ విష‌యాన్ని బాగానే ప్ర‌చారం చేసుకుంది.

అయితే స‌రిగ్గా ఈ స‌మ‌యంలోనే జ‌నమంతా *ఎల్లో* బ్యాచ్‌ గా పిలుచుకుంటున్న టీడీపీ నేత‌ల క‌న్ను జాల‌ర్లు - వారు వినియోగించే ప‌డ‌వ‌ల‌పై ప‌డింద‌న్న  వాద‌న వినిపిస్తోంది. నిన్నంటే నిన్న‌నే కాదు గానీ... గ‌త కొద్ది రోజులుగా జాల‌ర్లు - వారి ప‌డ‌వ‌ల‌పై దృష్టి సారించేసిన ఎల్లో బ్యాచ్‌... ప‌డ‌వల రంగుల‌ను ఎల్లోగా మార్చేసేందుకు ప‌క్కా ప‌థ‌క‌మే ర‌చించింద‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అధికారం త‌మ చేతుల్లోనే ఉంది కాబ‌ట్టి... స‌ముద్రంలోకి వెళ్లే బోట్లు - ప‌డ‌వ‌ల‌న్నీ కూడా త‌మ పార్టీ గుర్తు ప‌సుపు రంగులోనే క‌నిపించాలంటూ టీడీపీ నేత‌లు హుకుం జారీ చేసిన‌ట్లుగా విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఇదే విష‌యంపై ఆరా తీసిన విప‌క్ష వైసీపీ... ఇది వాస్త‌వ‌మేన‌ని - జాల‌ర్ల మ‌నోభావాల‌ను దెబ్బ తీసేలా ఉన్న ఈ నిర్ణ‌యం ప‌ట్ల తాము నిర‌స‌న తెలుపుతామ‌ని హెచ్చరిస్తోంది.

అస‌లు ఎల్లో బ్యాచ్‌ గా చెబుతున్న టీడీపీ నేత‌లు... జాల‌ర్లు - వారి ప‌డ‌వ‌ల‌పై క‌న్నేసిన వైనాన్ని ఓ సారి ప‌రిశీలిద్దాం. స‌ముద్రంలో చేప‌ల వేట కోసం మ‌త్స్య‌కారులు వ‌ల‌లు - ప‌డ‌వ‌లు వినియోగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల 15 నుంచి జూన్ 14 వ‌ర‌కు స‌ముద్రంలో చేప‌ల వేట‌ను ప్ర‌భుత్వం నిషేధించింది. ఈ 61 రోజుల వ్య‌వ‌ధిలో జాల‌ర్లు త‌మ వ‌ల‌ల‌ను బాగు చేయించుకోవ‌డంతో పాటుగా ప‌డ‌వ‌ల‌కు రిపేర్లు చేయించుకుంటారు. అంటే మ‌ళ్లీ చేప‌ల వేట సీజ‌న్ మొద‌ల‌య్యే నాటికి త‌మ స‌రంజామా మొత్తాన్ని సిద్ధం చేసుకుంటార‌న్న మాట‌. ఇదే అద‌నుగా రంగంలోకి దిగిన టీడీపీ నేత‌లు... ప‌డ‌వ‌ల‌కు ప‌సుపు రంగే వేయించాలంటూ ఆదేశాలు జారీ చేయించేశాయట‌. ఈ త‌ర‌హా జీవో ప్ర‌కాశం జిల్లాలో జారీ అయిన‌ట్లుగా చెబుతున్నారు.

ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందాలంటే మ‌త్స్య‌కారులు త‌మ ప‌డ‌వ‌ల‌కు ప‌సుపు రంగు వేయించుకోవాని కూడా స‌ద‌రు నిబంధ‌న‌ల్లో పేర్కొన్న‌ట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ప‌డ‌వ‌ల‌న్నింటికీ ప‌సుపు రంగు వేయించి స‌ముద్రం కూడా త‌మ పార్టీలోనే చేరిపోయిన‌ట్లుగా ప్ర‌చారం చేసుకునేందుకు టీడీపీ నేత‌లు రంగం సిద్ధం చేసుకుంటున్న‌ట్లుగా స‌మాచారం. దీనిపై విప‌క్షం భ‌గ్గుమంటోంటే... త‌మ మ‌నోభావాల‌కు అనుగుణంగా త‌మ పడ‌వ‌ల‌కు రంగులు వేయించుకుంటామ‌ని, అయితే త‌మ మ‌నోభావాల‌ను దెబ్బ తీసేలా ప్ర‌భుత్తం ప‌సుపు రంగు వేయించుకోవాలంటూ నిబంధ‌న‌లు విధించ‌డం ఎందుకంటూ మ‌త్స్య‌కారులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తంగా ఎల్లో బ్యాచ్ కొత్త గోల ర‌చ్చ‌ర‌చ్చ అయ్యేలానే క‌నిపిస్తోంది.

Tags:    

Similar News