చేతులు కట్టుకున్నే సీన్ లేదు....కలైంజ్ఞర్ కొడుకిక్కడ

Update: 2022-08-17 10:05 GMT
తమిళనాట ద్రవిడ వాదాన్ని బలంగా వినిపించి గెలిపించిన తొలితరం నాయకులలో కరుణా నిధి ఒకరు. ఆయనను  అంతా కలైంజ్ఞర్ అని పిలుచుకుంటారు. తొమ్మిది పదుల వయసు దాకా ఆయన బతికారు. తన మాటే శాసనం గా ఆయన కడదాకా కొనసాగారు. తమిళనాడు అంటే కరుణానిధి మాత్రమే గుర్తుకువచ్చేలా ఆయన తన రాజకీయాన్ని శ్వాసించి రచ్చ గెలిచారు.

ఆయనకు అసలైన వారసుడు స్టాలిన్. తండ్రి బాటలోనే ఆయన పయనం. డీఎంకే సిద్ధాంతాలను పూర్తిగా జీర్ణించుకున్న స్టాలిన్ తమిళనాట కరుణానిధి తరువాత తానే అనిపించుకుంటున్నారు. ఏడాదిన్నర ముఖ్యమంత్రిత్వంలో ఆయనకు జాతీయ స్థాయిలోనూ  మంచి మార్కులే పడ్డాయి. ఇక కేంద్రంతో తమిళనాడు ఏలికలు ఎపుడూ మంచి రిలేషన్స్ కొనసాగిస్తారు. అయితే తమ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా వారు అసలు రాజీ పడరు.

అవసరం అయితే సమరమే అని కూడా అంటారు. ఇదిలా ఉంటే కేంద్ర పెద్దలను కలవడానికి తాజాగా  ఢిల్లీ వచ్చిన స్టాలిన్ కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. తాను కేంద్ర పెద్దలను కలవడానికి తమిళనాడు నుంచి కావడి తీసుకుని రాలేదని పేర్కొన్నారు. తాను కేంద్ర పెద్దలు చెప్పేది వినడానికి చేతులు జోడించి నిలబడడానికి సిద్ధంగా ఉన్నానని ఎవరైనా అనుకుంటే అంతకంటే పొరపాటే లేదని కూడా స్పష్టం చేశారు.

తాము కలైంజ్ఞర్ కుమారుడిని ని అంటూ ఆయన బిగ్ సౌండ్  చేశారు. తన తండ్రి పంధాయే తనదని ఆయన కుండబద్ధలు కొట్టారు. ఇక డీఎంకే రాజకీయ విధానాలు సిద్ధాంతాలు కూడా ఎపుడూ ఒక్కలాగానే ఉంటాయి తప్ప మారేది కావని ఆయన చెప్పుకొచ్చారు. ఏ విషయంలోనూ తమ పార్టీ ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన పేర్కొనడం గమనార్హం.

అందువల్ల బీజేపీ ప్రభుత్వంతో తమ పార్టీ రాజీ పడడం అన్నది ఏనాడూ జరిగేది కానే కాదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ములను కూడా ఈ పర్యటనలో స్టాలిన్ కలవబోతున్నారు. అయితే ఆయన లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ మాత్రం సంచలనంగానే ఉన్నాయి.

మరి ఢిల్లీకి కావడిని తీసుకెళ్ళి కేంద్ర పెద్దల వద్ద చేతులు కట్టుకుని నిలబడే సీఎంలు ఎవరు అన్న చర్చకు కూడా స్టాలిన్ తన వ్యాఖ్యల ద్వారా తెర తీశారు. డీఎంకే రాజీ పడదు అంటే కొన్ని పార్టీలు రాజీ పడుతున్నాయని కూడా ఆయన చెప్పకనే చెబుతున్నారని అంటున్నారు.

మొత్తానికి స్టాలిన్ తానేంటో చెప్పారు. కొందరు సీఎంల  తీరు కూడా ఇండైరెక్ట్ గా ఎండగట్టారు అని అంటున్నారు. మరి కేంద్ర పెద్దల వద్ద  చేతులు కట్టుకునే సీఎం ల గురించే ఇపుడు చర్చ గట్టిగా సాగుతోంది. ఇంతకీ స్టాలిన్ బీజేపీ తో పాటుగా ఏఏ సీఎంల మీద సెటైర్లు వేశారు అన్నదే పెద్ద ప్రశ్న. జవాబు అందరికీ తెలిసినా ఎవరూ బయటకు చెప్పరుగా.
Tags:    

Similar News