కమల్ మాట.. నేను గానీ 20 ఏళ్ల ముందు వచ్చుంటే..

Update: 2019-04-16 11:00 GMT
ఒక సమయంలో తాను ఎప్పటికీ రాజకీయాల్లోకి రానని.. తన లాంటి మనస్తత్వం ఉన్న వాళ్లకు రాజకీయాలు పడవని అన్నాడు లోకనాయకుడు కమల్ హాసన్. కానీ జయలలిత చనిపోయాక తమిళనాట రాజకీయ శూన్యత ఏర్పడ్డాక ఆయన ఆలోచన మారింది. రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. గత ఏడాదే ఆయన సొంతంగా ఎంఎన్ ఎం అనే పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. మరి కొన్ని రోజుల్లో తమిళనాట జరిగి లోక్ సభ ఎన్నికల్లో ఆయన పార్టీ తరఫున అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కమల్.

తూత్తుకుడి ప్రాంతంలో ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా కమల్ మాట్లాడుతూ.. తూత్తుకుడి అంటేనే ఓడరేవు గుర్తుకు రావాల్సింది పోయి తుపాకీ కాల్పులు గుర్తుకు వస్తున్నాయన్నాడు. దేశాన్ని విభజించే శక్తులు రాష్ట్రంలోకి చొరబడ్డాయని - వాటిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. తూత్తుకుడిలో స్టెరిలైట్‌ పరిశ్రమకు అనుమతి ఇచ్చింది ఒక పార్టీ అని - విస్తరణకు అవకాశం కల్పించింది మరో పార్టీ అని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను సాగనంపాలని తెలిపారు. స్టెరిలైట్‌ పరిశ్రమ వద్దని తాను చెప్పటం లేదని.. కానీ దాని కాలుష్యంతో ప్రజలకు ఎలాంటి హానీ జరగకుండా చూడాలన్నారు. స్టెరిలైట్‌ ఆందోళనలో కాల్చింది తమిళుడే - కాల్చమని చెప్పిందీ తమిళుడేనని గుర్తుచేశారు. తాను 20 ఏళ్లకు ముందు రాజకీయాలలోకి వచ్చుంటే ఈ అన్యాయం జరిగేది  కాదని తెలిపారు. తమిళనాడు చరిత్రను తిరగరాసే రోజు దగ్గర్లో ఉందని కమల్.. తాను లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం మీదా స్పందించారు. ఎంఎన్ఎం తరఫున పోటీ చేసే అభ్యర్థులంతా తన ప్రతిరూపాలన్న కమల్.. వారిని ఎన్నికల్లో గెలిపించి వారు చేసే పనుల ద్వారా ప్రజలు తనను చూడొచ్చని పేర్కొన్నారు.
Tags:    

Similar News