బ‌డ్జెట్ పై క‌మ‌ల్ పాజిటివ్ కామెంట్స్!

Update: 2018-02-02 16:07 GMT
ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నిన్న‌ ప్ర‌వేశపెట్టిన బ‌డ్జెట్ పై కొంద‌రు పెద‌వి విరుస్తున్న సంగ‌తి తెలిసిందే. బడ్జెట్‌ ప్రతిపాదనలు మ‌రింత‌ మెరుగ్గా ఉండాల్సిందని కొంద‌రు ఆర్థిక నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్రైవేటు రంగానికి పెద్ద‌పీట వేసి....సామాన్యుడి న‌డ్డివిరిచేలా ఈ బ‌డ్జెట్ ఉంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బడ్జెట్ లో వ్యవసాయం రంగం - రైతులకు ప్రయోజనాల కోసం మ‌రింత కేటాయింపులు చేయాల్సింద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. సగటు పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఊరట లభించలేదని ప‌లువురు అంటున్నారు. ఈ నేప‌థ్యంలో జైట్లీ బ‌డ్జెట్ పై సినీ న‌టుడు క‌మల్ హాస‌న్ స్పందించారు. రైతులు - గ్రామీణ ప్రాంతాల కోసం బ‌డ్జెట్ లో కేటాయింపులు ఆశాజ‌న‌కంగా ఉండ‌డం శుభ‌ప‌రిణామ‌మ‌న్నారు.

త‌మిళ‌నాడులో దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణాన‌నంత‌రం జ‌రుగుతున్న రాజ‌కీయ చ‌ద‌రంగంలో క‌మ‌ల్ హాస‌న్ కీల‌కంగా మారిన సంగ‌తి తెలిసిందే. వామ‌ప‌క్ష భావాల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే క‌మ‌ల్.... సంద‌ర్భానుసారంగా.... బీజేపీపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతుంటారు. దేశంలో హిందూ ఉగ్ర‌వాదం పెరిగిపోయిందంటూ క‌మ‌ల్ చేసిన వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి ....ఆయ‌న హిందూ వ్య‌తిరేకి అని కొంద‌రు ప్ర‌చారం చేశారు. అయితే, తాను హిందూ వ్య‌తిరేకిని కాద‌ని క‌మల్ క్లారిటీ కూడా ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో తొలిసారిగా బీజేపీ స‌ర్కార్ పై క‌మ‌ల్ సానుకూల వ్యాఖ్య‌లు చేయ‌డం విశేషం. రైతులు - గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌ల‌పై కేంద్రం ఫోక‌స్ చేయ‌డం మంచి ప‌రిణామ‌మ‌ని క‌మ‌ల్ అభిప్రాయ‌ప‌డ్డారు. కేంద్రం తీసుకున్న నిర్ణ‌యం వారికి ఓదార్పునిస్తుంద‌న్నారు. అయితే, సామాన్య‌ - మధ్యతరగతి ప్ర‌జ‌ల విషయంలో మాత్రం బడ్జెట్ ఆశాజ‌న‌కంగా లేద‌ని క‌మ‌ల్ పెద‌వి విరిచారు.

Tags:    

Similar News