తుపాకులతో పాలిటిక్స్ లోకి వస్తామన్న హీరో

Update: 2017-02-11 05:20 GMT
సున్నితమైన అంశాల జోలికి పోకుండా ఉండటం.. ప్రజాజీవితానికి ముడిపడి ఉన్న అంశాల్ని టచ్ చేసేందుకు సాహసించని వైనం.. రాజకీయాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని ఓపెన్ గా చెప్పేందుకు మల్లగుల్లాలు పడే ప్రముఖులకు భిన్నమైన తీరులో తమిళ నటులు వ్యవహరిస్తున్నారు. తాజాగా నెలకొన్ని రాజకీయ సంక్షోభంపై వారు తమదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు. తన ట్వీట్లతో అగ్గిపుట్టిస్తున్న లోకనాయకుడన్న ఇమేజ్ ఉన్న కమల్ హాసన్ తాజాగా స్పందించారు. ఒక ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాజకీయాల్లోకి తాను రావాలని అనుకోవటం లేదన్న ఆయన.. తనలాంటి వారిని రాజకీయాల్లోకి రాకూడదని ప్రార్థించాల్సిందగా కోరారు. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ నేతల ధోరణి ఏం బాగోలేదని.. తనలాంటోళ్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని.. రాజకీయాల్లోకి వస్తే తుపాకీలతో వస్తామని.. అలాంటిది జరగకూడదని తాను కోరుకుంటున్నట్లుగా వెల్లడించారు.

అరవై ఏళ్లుగా రాజకీయ నాయకులు తమిళనాడుకు ఒరగబెట్టింది ఏమీ లేదని.. కాంగ్రెస్.. ద్రవిడ పార్టీలు ఎవరూ తాము చేసిన వాగ్ధానాల్ని నెరవేర్చలేదన్న ఆయన.. తమకు ఫలితాలుకావాలని స్పష్టం చేశారు. అదే సమయంలో శశికళపై విరుచుకుపడ్డారు. ‘‘శశికళ అర్హతలేమిటో నాకు తెలియదు. ప్రజలకు కూడా తెలియని. ఒకరిచుట్టూ చాలా ఏళ్ల పాటు తిరగటమే మన్నలి ఒక వృత్తికి అర్హులను చేయదు. నేను ఒక న్యాయవాది కుమారుడ్ని. అంటే దానర్థం నేను కోర్టుకు వెళ్లి ఏదైనా కేసులో వాదనలు వినిపించగలనని కాదు’’ అంటూ తానేమనుకుంటున్నానో సూటిగా చెప్పేశారు. ఓపెన్ గా మాట్లాడేసిన కమల్ వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
Tags:    

Similar News